రిజిస్ట్రేషన్‌ లేని పడవలతో ఇసుకతీత

Sep 26 2021 @ 00:07AM

వరద గోదారిలోనూ ఆగని వైనం

 ఇటీవల రెండు బోట్లకు ప్రమాదాలు

 పట్టించుకోని అధికారులు

 కచ్చులూరు ప్రమాదం తర్వాత ఆగిన రిజిస్ట్రేషన్లు

 ఇటీవల జీవో ఇచ్చినప్పటికీ ఇంకా మొదలుపెట్టని పోర్టు అధికారులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గోదావరిలో రిజిస్ట్రేషన్‌లేని లేని పడవలతో ఇసుక తీత అధికమైంది. వరద గోదారిలో కూడా ఇది ఆగడం లేదు. అయినా అధికారులెవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. గతంలో లైసెన్స్‌ రెన్యువల్‌ చేయకపోయినా, అనుమతించేవారు కాదు. కానీ రిజిస్ట్రేషన్‌ లేదు, లైసెన్స్‌ రెన్యువల్‌ కూడా లేదు. అయినా రాజమహేంద్రవరం అఖండ గోదావరితో పాటు కోనసీమలోని పలుచోట్ల డీసిల్టేషన్‌ పేరిట బోట్లతో ఇసుక తీత జరుగుతున్న సంగతి తెలిసిందే. కొందరైతే డ్రెడ్జింగ్‌ మిషన్లతో కూడా ఇసుక తోడేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం రాజమహేంద్రవరం, కొవ్వూరు మధ్య గోదావరిలో వందలాది పడవలు ఇసుక వేటాడుతున్నాయి. పడవలు తిరగడానికి ఇంకా అధికారికంగా అనుమతి లేదు. కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బోట్లను ఆపేసిన సంగతి తెలిసిందే. పోలవరం పాపికొండలుకే ఇప్పటికి కేవలం ఒకటో రెండో టూరిజం బోట్లకు అనుమతి ఇచ్చారు. ప్రైవేట్‌ బోట్లకు కూడా అనుమతి ఇవ్వలేదు. కానీ ఇటీవల వరద గోదావరిలో ఇసుక తీతకు వెళ్లిన రెండు పడవలు ప్రమాదానికి గురయ్యాయి. ఫోర్త్‌ బ్రిడ్జి వద్ద ఒకటి, కాటన్‌ బ్యారేజీ వద్ద ఒక పడవకు ప్రమాదం జరిగింది. ఫోర్త్‌ బ్రిడ్జి వద్ద ఏకంగా బ్రిడ్జిని ఢీకొంది. ఐదుగురికి గాయాలు కాగా ఎవరికీ తెలియకుండా ఆసుపత్రిలో చేర్చడం పెద్ద చర్చనీయాంశమైంది. జూలై నుంచి  ఏకధాటిగా వరద వస్తోంది. మధ్యలో తగ్గిన అఖండ గోదావరిలో ఎక్కువగా వరద ఉంది. ఒక్కోసారి  ఇసుక వ్యాపారులు ఇరిగేషన్‌ అధికారులను మేనేజ్‌ చేసి ఎక్కువ నీటిని సముద్రంలోకి వెళ్లేటట్టు చేస్తున్నారని, దీనివల్ల ఇసుక తీత సులభమవుతుందనే ప్రచారం కూడా ఉంది.

 విచ్చలవిడిగా ర్యాంపులు

వాస్తవానికి జిల్లాలో చాలా బోట్స్‌మన్‌ సొసైటీలు ఉన్నాయి. జేపీ కార్పొరేట్‌ సంస్థ రంగంలోకి వచ్చాక మొదట్లో ఈ సొసైటీలను నిర్లక్ష్యం చేసింది. తర్వాత ర్యాంపులు ఆగిపోవడం, వివాదాలు చోటుచేసుకోవడం తెలిసిందే. తర్వాత  ప్రభుత్వ అనుమతితో బోట్స్‌మన్‌ సొసైటీలు తీసిన ఇసుకకు టన్ను ధర రూ.625గా నిర్ణయించారు. టన్ను ఇసుక తీసినందుకు రూ.200 మాత్రం సొసైటీకి ఇస్తారు. రెగ్యులర్‌గా ఈ సొసైటీలు తమ లైసెన్స్‌ను రెన్యువల్‌ చేసుకుంటూ ఉండాలి. కానీ కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత ఇరిగేషన్‌ శాఖ నుంచి లైసెన్స్‌లు ఇచ్చే  అధికారాన్ని పోర్టుకు అప్పగించారు. దీనితో రెన్యువల్స్‌ కూడా ఆగిపోయాయి. కానీ జేపీ సంస్థ లైసెన్స్‌ రెన్యువల్‌ కాని బోట్లతో ఇసుక తీయించి దర్జాగా వ్యాపారం చేస్తోంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే లైసెన్స్‌ లేని బోటు అని చెప్పి....  ఏ సహకారం కూడా చేసే అవకాశంలేదు. చాలాకాలం నుంచి ఇసుక వ్యాపారం అధికంగా ఉండడంతో చాలా మంది అప్పులు కూడా చేసి బోట్లు కొనుక్కున్నారు. ఇవాళ వారి పరిస్థితి   అయోమయంగా ఉంది.

ఇసుక పడవలకు ప్రభుత్వం కొత్త నిబంధనలు వర్తింపచేస్తూ కొద్ది రోజుల క్రితం జీవో ఇచ్చింది. కాని దీనిని అమలు చేయవలసిన పోర్టు అధికారులు గాఢంగా నిద్రపోతున్నారు. ఈ నిబంధనలు ఏంటనేవి కూడా గోప్యంగా ఉంచడం గమనార్హం. పోర్టు అధికారులు కనీసం ఈ జీవో ప్రకారం రిజిస్ట్రేష్లు గానీ, పాత వాటికి రెన్యువల్‌ గానీ చేస్తే ఈ బోట్స్‌మన్‌ సొసైటీలు ధైర్యంగా పనిచేసుకుంటాయి. కానీ ఇవాళ ఆ పరిస్థితి కనిపించట్లేదు. పైగా ఇటీవల ఇరిగేషన్‌ అధికారులు ఎక్కువ ర్యాంపులకు అనుమతి ఇవ్వడం గమనార్హం. దీంతో పడవల సంఖ్య పెరుగుతోంది. సమస్యలు పెరుగుతాయి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.