ఇసుక కొరత!

ABN , First Publish Date - 2021-06-02T05:27:54+05:30 IST

జిల్లాలో ఇసుక కొరత తలెత్తుతోంది. సకాలంలో ఇసుక దొరకక నిర్మాణపనులు నిలిచిపోతున్నాయి. దీంతో నిర్మాణదారులు, అటు భవన నిర్మాణ కార్మికులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

ఇసుక కొరత!
మడపాం ర్యాంపులో ఇసుక తవ్వకాలు చేపడుతున్న దృశ్యం




ర్యాంపుల ప్రారంభంలో జాప్యం

సబ్‌ కాంట్రాక్ట్‌ కోసం ఒత్తిళ్లే కారణం?

పట్టించుకోని ప్రభుత్వం

జిల్లాలో మొదలైన వర్షాలు 

 నదుల్లో పెరగనున్న నీటి ప్రవాహం

ఇసుక లభ్యత కష్టం

(కలెక్టరేట్‌)

జిల్లాలో ఇసుక కొరత తలెత్తుతోంది. సకాలంలో ఇసుక దొరకక నిర్మాణపనులు నిలిచిపోతున్నాయి. దీంతో నిర్మాణదారులు, అటు భవన నిర్మాణ కార్మికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లాలో ఇసుక ర్యాంపులను ప్రారంభించకపోవడమే కొరతకు కారణం. ప్రభుత్వం ఇసుక పాలసీలు మార్చుతున్నప్పటికీ ఫలితం లేకపోతోంది. గతంలో ఏపీ మైనింగ్‌ సంస్థ ద్వారా అందించగా ఎక్కడికక్కడే లోపాలు వెలుగుచూశాయి.  ఇప్పుడు ఇసుక నిర్వహణను ప్రభుత్వం జేపీ వెంచస్‌ సంస్థకు కట్టబెట్టింది. అయినా జిల్లాలో ర్యాంపులు ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా నుంచి  శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలకు ఇసుక అందించేందుకు ఫ్యాకేజ్‌-1 గా నిర్ణయించారు. నాగావళి, వంశధార నదీ పరీవాహక ప్రాంతాల్లో 29 ర్యాంపులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ సరుబుజ్జిలి మండలం యరగాం, సరసన్నపేట మండలం మడపాం, బూర్జ మండలం నారాయణపురం వద్ద మాత్రమే ర్యాంపులు ప్రారంభమయ్యాయి. మిగతావి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ జాప్యం జరుగుతుండడంతో రోజురోజుకూ ఇసుక కొరత పెరుగుతోంది. వర్షాకాలం ప్రారంభం కానుండడంతో నదుల్లో వరద నీరుతో ఇసుక దొరకని పరిస్థితి తలెత్తుతుంది. ఒక క్యూబిక్‌ మీటర్‌ ఇసుక రూ.475గా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ  కొరత దృష్టా ధర భగ్గుమంటోంది. కొందరు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 


 రాజకీయ ఒత్తిళ్లు

ఇసుక ఒక ఆదాయ వనరుగా మార్చుకున్న కొందరు అక్రమార్కులు, నాయకులు కోట్లాది రూపాయలు ఆర్జించారు. ఇప్పుడు టెండరు ద్వారా ఓ సంస్థకు ప్రభుత్వం అప్పగించడంతో సరికొత్తగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని ఇసుక ర్యాంపులను సబ్‌కాంట్రాక్టు పద్దతిపై అప్పగించాలని టెండరు పొందిన సంస్థపై రాజకీయ ఒత్తిళ్లను ప్రారంభించారు. ఈ విషయంలో బేరసారాలు కుదరకపోవడం వల్లే ర్యాంపుల ప్రారంభంలో జాప్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరోవైపు ర్యాంపుల వద్ద వివాదాలు నెలకొంటున్నాయి. ప్రభుత్వం అనుమతించిన చాలా ర్యాంపులకు సరైన రవాణా సదుపాయం లేదు. రైతుల ఆధీనంలో ఉన్న పొలాలు, తోటల గుండా వెళ్లాల్సి ఉంటుంది. భారీ వాహనాల రాకపోకలతో తమకు నష్టం కలుగుతోందని రైతులు, స్థానికులు ర్యాంపుల వద్ద ఆందోళనలకు దిగుతున్నారు. ఇటీవల నరసన్నపేట మండలం మడపాం, ఆమదాలవలస మండలం దూసి వద్ద స్థానికులు నిరసన తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరముంది. అటు రైతులకు నష్టం కలుగకుండా ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం చూపాలి. 


 ర్యాంపులు తెరిచేందుకు చర్యలు

జిల్లాలో ప్రభుత్వం అనుమతించిన ర్యాంపులు తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇది మా పరిధిలో అంశం కాదు. సంబంధిత టెండరు దక్కించుకున్న సంస్థ ర్యాంపులను ప్రారంభించాలి. ఇప్పటికే జిల్లాలో నాలుగు ర్యాంపులు ప్రారంభమయ్యాయి. మిగతా ర్యాంపులకు రహదారులు ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి వివాదాలు లేకుండా చర్యలు తీసుకుంటాం. 

- సూర్యచంద్రరరావు, గనుల శాఖ డీడీ



Updated Date - 2021-06-02T05:27:54+05:30 IST