దోచుకున్నోళ్లకు దోచుకున్నంత

ABN , First Publish Date - 2021-03-01T05:14:25+05:30 IST

గద్వాల జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణా దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అన్నంతగా సాగుతోంది.

దోచుకున్నోళ్లకు దోచుకున్నంత
అయిజ మండలం వేణిసోంపురం వద్ద అక్రమంగా నిల్వ చేసిన ఇసుక

- గద్వాల జిల్లాలో జోరుగా ఇసుక, మట్టి అక్రమ రవాణా

- అర్ధరాత్రి వేళ దోపిడీ

- వేణిసోంపురం, రాజోలి, కేటీదొడ్డి నుంచి ఇసుక..

- గద్వాల, ఇటిక్యాల, అయిజ మండలాల నుంచి మట్టి

- ప్రభుత్వ పనులకు లభించని వైనం

  గద్వాల జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణా దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అన్నంతగా సాగుతోంది. తుంగభద్ర నది నుంచి ఇసుక, మండలాల్లోని గుట్టల ద్వారా మట్టిని రాత్రి వేళల్లో రవాణా చేస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన వారే ముడుపులు తీసుకుంటూ సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో నడుస్తున్న ఈ దందాను అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

- గద్వాల, ఆంధ్రజ్యోతి

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇసుక, మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. జిల్లాలో పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలు, ఇరిగేషన్‌ శాఖలు, మునిసిపాలిటీల్లో రూ.కోట్ల విలువ చేసే పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు ఇసుక కావాలన్నా, మట్టి కావాలన్నా గనులు, భూర్భశాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలి. వారు మాత్రం ప్రభుత్వ పనులకు ఇసుక లేదని, మట్టి క్వారీలు లేవని చెబుతుండగా, వందల టిప్పర్ల మట్టి, ఇసుకను దళారులు కొల్లగొడుతున్నారు. ఇసుక కేవలం శాండీటాక్సీలో భాగంగా ఇస్తున్నామని, ప్రభుత్వ పనులకు ఇంకా ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు.


రాత్రి 10 గంటల నుంచి...

    తుంగభద్ర నదిలో ఇసుక అక్రమ రవాణా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటలకు కొనసాగుతోంది. ఇసుక ట్రాక్టర్‌ ట్రిప్పునకు రూ.1,500 వసూలు చేస్తున్నారు. ఉదయం శాండిటాక్సీ పేరుతో రవాణా చేస్తున్నారు. అక్రమ రవాణా చేసినందుకు వసూలు చేసిన డబ్బులు అధికార పార్టీ నాయకులకు కొంత, డిపార్టుమెంట్‌కు కొంత పంచుతున్నారని తెలుస్తోంది. శాండిటాక్సీలో భాగంగా చిన్న ధన్వాడ వద్ద గ్రామాభివృద్ధి పేరుతో ట్రాక్టర్‌కు రూ.1,500 వసూలు చేస్తున్నారు. ఈ డబ్బు ల్లో సగం డిపార్ట్‌మెంట్‌ వారీగా పంచుకుంటున్నారని సమాచారం. ఇదే తీరులో టిప్పరు మట్టికి రూ.3,000 నుంచి రూ.5,000 తీసుకుంటున్నారని తెలుస్తోంది.


శాండీటాక్సీ పర్మిట్‌ పేరుతో...

ఇటిక్యాల, వేణిసోంపురం, రాజోలీ, చిన్న ధన్వాడ, పెద్ద ధన్వాడ నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. శాండీటాక్సీ పర్మిట్‌ పేరుతో ఒక ట్రిప్పునకు బదులు రెండు ట్రిప్పులు తీసుకెళ్తున్నారు. ఇసుక ఒకరి పేరున బుక్‌ చేసి మరొకరికి పోస్తున్నారు. నది ఒడ్డుపై కుప్పలుగా పోసి పగలు రాత్రి తేడా లేకుండా రవాణ చేస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుకను రూ.5,500 నుంచి రూ.6,500 వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా ఆరా తీస్తే శాండీటాక్సీ మెసేజ్‌ చూపుతున్నారు. కేటీదొడ్డి, ధరూర్‌ మండలాల్లోని వాగుల్లోంచి ఇసుకను జోరుగా అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొందరు వ్యక్తులు ఇసుక, మట్టి అక్రమ రవాణా కోసం మంత్రుల పేరు చెప్పి, స్థానిక సిబ్బందికి పదో పరకో చేతుల పెట్టి దందా సాగిస్తున్నారు. ఇసుక రవాణాకు సంబంధించి ప్రతి నెలా నిర్వహించాల్సిన సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల అక్రమార్కులను అడ్డుకునే వారే లేకుండా పోయా రు. ఈ విషయంపై గనులు, భూగర్భశాఖ అధికారి పి.విజయ రామరాజును ఆరా తీయగా తమ వద్ద సిబ్బంది లేరని, అందరూ కలిసి అరికడితే తప్ప మట్టి, ఇసుక అక్రమ రవాణ ఆగదని చెప్పారు.


Updated Date - 2021-03-01T05:14:25+05:30 IST