పెత్తనాలు పోవాలి.. సమానత్వం రావాలి

ABN , First Publish Date - 2020-05-15T22:27:10+05:30 IST

నేను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెరిగాను. మా తాతల సమయంలోనే మేం ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చేశాం. ఎమర్జెన్సీ సమయంలో మా నాన్నగారిని అరెస్టు చేశారు. నామీద జగిత్యాల జైత్రయాత్ర ప్రభావం ఉంది. అయితే.. తుపాకీ పట్టుకోకుండా ఇటు రావడానికి కారణం.. ఉద్యోగం చేయాలా?

పెత్తనాలు పోవాలి.. సమానత్వం రావాలి

మా పోరాటం.. పురుషుల మీద కాదు.. పితృస్వామ్య భావజాలం మీద

ఆ భావజాలానికి బలవులున్న పురుషులు కూడా ఉన్నారు

మనుషుల్లో తగ్గిపోతున్న స్పందనను చూస్తే భయమేస్తోంది

పెరిగిపోతున్న స్వార్థమంటే ఇంకా భయం

06-06-2011న జరిగిన ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో పీవోడబ్ల్యూ నేత సంధ్య


ఆర్కే: వెల్‌కం టూ ఓపెన్‌ హార్ట్‌.. సంధ్యగారూ.. మీరు వంట బాగా చేస్తారట కదా!

సంధ్య: ఇంట్లో వంట నేనే చేస్తాను. మా ఆయన చేయరు.


ఆర్కే: మీకు ఫైర్‌బ్రాండ్‌ నేచర్‌ ఎలా వచ్చింది?

సంధ్య: నేను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెరిగాను. మా తాతల సమయంలోనే మేం ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చేశాం. ఎమర్జెన్సీ సమయంలో మా నాన్నగారిని అరెస్టు చేశారు. నామీద జగిత్యాల జైత్రయాత్ర ప్రభావం ఉంది. అయితే.. తుపాకీ పట్టుకోకుండా ఇటు రావడానికి కారణం.. ఉద్యోగం చేయాలా? పెళ్లి చేసుకోవాలా? ఉద్యమం చేయాలా? అనే సందిగ్ధంలో నేను టెన్త్‌ (1979) చదువుతున్నప్పటి నుంచి 1988 వరకూ మానసికంగా సంఘర్షణను ఎదుర్కొన్నాను. ఆ తరువాత ఉద్యోగం చేస్తూ ఉద్యమం చేశాను. నేను ఉన్నది న్యూడెమోక్రసీ పార్టీ కాబట్టి అది సాధ్యమైంది.


ఆర్కే: సంధ్య గయ్యాళి అని అందరూ అనుకుంటారు.

సంధ్య: నేనేం గయ్యాళిని కాదు. మా నాన్నగారు గుర్తొస్తే ఏడుస్తాను. అందుకే ఆయన ఫొటో కూడా ఇంట్లో పెట్టుకోను. బాధితుల కన్నీళ్లు చూస్తే ఏడుస్తాను. ఆ ఆర్ద్రత పోతే నేను ఉద్యమంలో పని చేయడం మానేస్తాను. కన్నీళ్లు.. మా నాన్నగారంటే నాకు చాలా అటాచ్‌మెంట్‌. ఆయనను ఎమర్జెన్సీలో అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టినప్పుడు ప్రజల ఒత్తిడి వలన ఎంపీ బాలాగౌడ్‌ చాలా కష్టపడి విడుదల చేయించారు.


ఆర్కే: మీ సంసారం ఎలా ఉంటుంది?

సంధ్య: ఆయన పేరు రామకృష్ణా రెడ్డి.. ఆర్కేఆర్‌ అంటారు. మా పెళ్లి 1991 జనవరి 26న.. పబ్లిక్‌ హాలిడే కాబట్టి జరిగింది. ఆయనను భర్తగా కాక.. స్నేహితుడిగా చూస్తాను. నేను పెత్తనం చేయను.. ఆయన చేస్తే ఒప్పుకోను.


ఆర్కే: మీరు ఫెమినిస్టు కాకపోయినా.. వివక్ష కూడదంటారు కదా?

సంధ్య: మేం మార్క్సిస్టు దృక్పథంతో పని చేస్తాం. పురుషాధిపత్యం వద్దంటాం. దానర్థం స్ర్తీ ఆధిపత్యం ఉండాలని మా ఉద్దేశం కాదు. అసలు ఆధిపత్యమే వద్దంటాం. మన సమాజంలోని కుటుంబ సంబంధాల్లో భాగంగా ఎవరో ఒకరు ఆధిపత్యం చేస్తుంటారు. అలాంటి నియంత్రణ లేకుండా కూడా కుటుంబం నడపొచ్చని మా వాదన. మా ఆయన బిజినెస్‌లో బిజీ అయిపోయిన తరువాత ఉద్యమంలోకి రాలేదు. తల్లిదండ్రులు లేని చాలా మందిని నేను చదివిస్తున్నా.. అయన అభ్యంతర పెట్టరు. నేను ఉద్యోగం మానేశాక నన్ను ఆర్థికంగా ఆదుకున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు నేను కూడా ఆయన పనులన్నీ నేనే చూస్తాను. ఉదయం ఆయన లేచిన వెంటనే కాఫీ కూడా నేనే ఇస్తాను.


ఆర్కే: అంటే మీలో ఇద్దరు సంధ్యలు ఉన్నారు?

సంధ్య: కాదు. రెండూ ఒకటే అనుకుంటాను. నా వ్యతిరేకత పితృస్వామిక భావజాలం మీదే కానీ, నేను పురుషులకు వ్యతిరేకం కాదు.


చంద్రబాబు హయాంలో నా ఉద్యోగం పోయింది..


ఆర్కే: పీవోడబ్ల్యూ అంటే సంధ్య మాత్రమేనా?

సంధ్య: నేను 1988లో గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన సభల్లో పీవోడబ్ల్యూ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టాను. ఆ తరువాత రాజమండ్రిలో జరిగిన సభల్లో అధ్యక్షురాలిగా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి 6 సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షురాలిగా ఎన్నికవుతూ వస్తున్నాను. ఎన్నిసార్లు వద్దని చెప్పినా బాధ్యతలు అప్పచెబుతూనే ఉన్నారు. ఈ బాధ్యతల వల్లే పిల్లలు వద్దనుకున్నాం.


ఆర్కే: మీ దగ్గరకు వచ్చే కేసులెలా ఉంటాయి?

సంధ్య: ఎక్కువ కేసులు అత్త పెత్తనం గురించే వస్తుంటాయి. అత్త పెత్తనం విషయంలో వీఐపీ కుటుంబాల కోడళ్లు కూడా మా దగ్గరకు వచ్చారు. ఎక్కువ కేసుల్లో భార్యను అర్థం చేసుకున్న భర్తను చవటగా ముద్ర వేయడం చూస్తున్నాం. ఈ సందర్భంలో పురుషాధిపత్యానికి పురుషులు కూడా బాధితులేనంటాను. అందుకే పితృస్వామిక కుటుంబాల బదులు ప్రజాస్వామిక కుటుంబాలు కావాలంటాం మేం. చాలా కేసుల్లో బాధలను తట్టుకోలేక నేను ఏడుస్తుంటాను. ఫ్యామిలీ హిస్టరీలో బీపీ, షుగర్‌ లేకున్నా, ఇలాంటి ఒత్తిడి వలనే నాకు 35 ఏళ్లకే అవి వచ్చేశాయి. ఏదైనా కేసును నేను డీల్‌ చేస్తుంటే.. నా పేరు చెప్పి భయపెట్టి పోలీసులు డబ్బు వసూలు చేస్తుంటారు.


ఆర్కే: ఇలాంటి పరిష్కారాల్లో ఎవరినైనా కొట్టారా?

సంధ్య: చాలా సార్లు జరిగింది. ఒకసారి అడ్వకేట్‌ను కొట్టాను కూడా. వయసు పెరిగే కొద్దీ అది తగ్గుతోంది. ఇలాంటి సందర్భాల్లో నాకెప్పుడూ భయం వేయలేదు. అయితే.. మనుషుల్లో స్పందన తగ్గిపోవడం చూస్తుంటే మాత్రం భయంతో బిక్కచచ్చిపోతాను. సమాజంలో పెరిగిపోతున్న స్వార్థం, విలువలు తగ్గిపోవడాన్ని చూస్తుంటే విపరీతమైన భయం వేస్తుంది.


ఆర్కే: చంద్రబాబు హయాంలో మీ ఉద్యోగం పోయింది కదా?

సంధ్య: మహిళా సంక్షేమ శాఖలో ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేశాను. చంద్రబాబు హయాంలో నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. పీవోడబ్ల్యూ అధ్యక్షురాలిగా ఉన్నందుకు, చంద్రబాబు ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తి చూపినందుకు నన్ను ఉద్యోగం లోంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలిచ్చారు. కోర్టుకెళ్లాం. తీర్పు నాకు అనుకూలంగా వచ్చినా, ఆ తరువాత రాజీనామా చేశాను.


ఆర్కే: మీకు ఏమైనా ప్రలోభాలు చూపించారా?

సంధ్య: డబ్బు ఇస్తామని కాకపోయినా పదవులు ఆశ చూపించారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లోనూ నాకు రాజ్యసభ సభ్యత్వం, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవిని ఇవ్వజూపారు. పవర్‌ పాలిటిక్స్‌ అంటే ఇష్టం లేక వెళ్లలేదు.


ఆర్కే: తెలంగాణ విషయంలో ‘మోర్‌ లాయల్‌ దాన్‌ ది కింగ్‌’ అన్న స్థాయిలో మాట్లాడడం ఎందుకు?

సంధ్య: మా తాతల కాలం నాడే తెలంగాణకు వచ్చి స్థిరపడ్డాం. మా నాన్న గారు టీఎన్‌జీవోల నేతగా చేశారు. ఉద్యోగ క్రాంతి ఎడిటర్‌గా ముల్కి ఉద్యమాన్ని నడిపారు. భాష, సంస్కృతి పరమైన వివక్షకు మేం వ్యతిరేకం.


ఆర్కే: సాధారణంగా.. బొట్టు, బోసిమెడ, గాజుల్లేని చేతులతో కనిపించే సంధ్య.. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో నిండు ముత్తైదువలా ఎందుకు కనపడుతుంది?

సంధ్య: మన సంస్కృతిలో అణిచివేతకు మాత్రమే నేను వ్యతిరేకం. మన ఐడెంటిటీని కోల్పోవడాన్ని ఇష్టపడను..అందుకే అలా కనపడతాను.


ఆర్కే: మీరు ఎక్కడ తృప్తి చెందుతారు?

సంధ్య: మా వల్ల సమస్యలు పరిష్కారమైన వారు మా పట్ల కృతజ్ఞత చూసిస్తుంటే సంతోషం వేస్తూ ఉంటుంది.

Updated Date - 2020-05-15T22:27:10+05:30 IST