సండూరు కొండల్లో ఇనుప ఖనిజం గుహలు ప్రత్యక్షం

Sep 28 2021 @ 11:11AM

- స్వామిమలై కొండల లోయల్లో దాగివున్న ఖనిజ సంపద

- ట్రెక్కర్ల సాహస యాత్రలో వెలుగుచూసిన వైనం


బళ్లారి(కర్ణాటక): సండూరు కొండల్లో అత్యంత విలువైన ఇనుప ఖనిజం కలిగిన ఏడు గుహలు వెలుగు చూశాయి. దట్టమైన  కారడవుల మధ్య ఇన్ని ఏళ్ల పాటు ఎవరికీ కనిపించక పోవడం విశేషం. కొంతమంది సాహస యాత్రికులు సండూరు కొండల్లో పర్యటనలు చేస్తున్న సమయంలో అత్యంత విలువైన ఇనుప ఖనిజంతో కూడిన ఏడు కొండగుహలు వీరికి కనిపంచడంతో వెలుగులోకి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే... గనుల నాడుగా ప్రసిద్ధి గాంచిన బళ్ళారి జిల్లా పరిధిలోని సండూరు తాలూకా అత్యంత ప్రకృతి రమణీయాలకు పుట్టినిల్లు. ఈ మధ్య కాలంలో సండూరుకు సమీపంలోని స్వామిమలై అటవీ ప్రాంతంలో సుబ్బరాయన హళ్లికి  సమీపంలో గుహలను పర్వతారోహకులు కనుగొన్నారు. తాలూకా పరిధిలోని సుబ్బరాయన హళ్లి నుంచి కిందివైపునకు వెళుతూ సుమారు 500 మీటర్ల లోతైన ప్రాంతంలో దిగారు. పెద్ద పెద్ద కొండరాళ్లను దాటుతూ ముందుకు పోతే... లోతైన లోయల్లో ఒకటి తరువాత మరొకటి ఏడు ఇనుప ఖనిజం  సమృద్ధి కలిగిన గుహలు బయటపడ్డాయి. పర్వతారోహకుల అంచనా ప్రకారం ఒక్కో గుహ సుమారు 40 నుంచి 50 మీటర్ల పొడవు ఉన్నట్లు  లెక్కగట్టారు. కొంతమంది ఈ గుహలో ప్రవేశించేందుకు ప్రయత్నం చేసినా... గుహలో కారుచీకటి ఉండడంతో లోపల అపాయకరమైన విషజంతువులు, సర్పాలు వల్ల ప్రమాదం ఉంటుందని తెలుసుకుని పర్వతోహరణ బృందానికి చెందిన గౌడ్‌ సురేష్‌ సలహా మేరకు ట్రెక్కర్స్‌ వెనక్కు తగ్గినట్లు తెలిసింది. ఈ గుహలకు సమీపంలో సుబ్బరాయనహళ్లి, కమతూరు గ్రామాలకు చెందిన ప్రజలు అభిప్రాయం ప్రకారం ఈ గుహలు ‘అప్పుడు దిప్పడు’ స్వాములకు చెందిన గుహలుగా పిలుస్తున్నట్లు, కొన్ని శతాబ్దాల క్రితం ఈ గుహల్లో అప్పుడు దిప్పడు అనే పేరుతో నిశాచరి(రాత్రివేళ) సంచరించే స్వాములు నివసిస్తున్నట్లు, వారు ఎపుడో ఒకసారి తమ గ్రామాలకు వచ్చి వారికి అవసరమైన ఆహార పదార్థాలు తీసుకెళ్ళేవారని తమ పూర్వికులు చెప్పినట్లు గుర్తుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ గుహల జనవాసాలకు దూరంగా దట్టమైన అటవీ ప్రాంత లోయల్లో ఉండడంతో వాటితో జనసంబంధాలు లేవు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఏడు ఇనుప ఖనిజం కలిగిన గుహాలను గైడ్‌ సురేష్‌, ట్రెక్కర్స్‌ రామగడ శ్రీనివాస్‌, రాజ్‌, వెంకటసుబ్బయ్య, దయానంద, శివకుమార్‌, ముత్తు ప్రకాష్‌, నాగేంద్ర, కార్తిక సింధె, అనుధర్‌ ప్రవీణ్‌, నిశాంత్‌ మసూతిల వెలుగులోకి తీసుకొచ్చారు. సండూరు తాలూకా, స్వామిమలై అటవీ ప్రాంతంలో సుబ్బరాయనహళ్లి నుంచి కుడివైపునకు 500 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి వెళితే ఈ గుహలు కనిపిస్తాయని ట్రెక్కర్స్‌ తెలిపారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.