స్వయంశక్తితో సంగం డెయిరీ ప్రగతి

ABN , First Publish Date - 2022-09-22T05:40:43+05:30 IST

ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా సంగం డెయిరీ స్వయం శక్తితో ఎదుగుతోందని ఆ సంస్థ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు.

స్వయంశక్తితో సంగం డెయిరీ ప్రగతి
పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ఛైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌

రూ.1,302 కోట్లకు చేరిన టర్నోవర్‌

డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర

చేబ్రోలు, సెప్టెంబరు 21: ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా సంగం డెయిరీ స్వయం శక్తితో ఎదుగుతోందని ఆ సంస్థ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు. బుధవారం వడ్లమూడి సంగం డెయిదీ ఆవరణలో పాలకవర్గ, 9వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సంగం వార్షిక ప్రణాళిక, నివేదికను ప్రకటించి సభ్యుల ఆమోదం తీసుకున్నారు. నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ సంగం డెయిరీ రైతులు, ఉద్యోగుల సహకారంతో ప్రగతిపథంలో నడుస్తుందన్నారు. గడచిన ఏడాది 12 కోట్ల లీటర్ల పాలను సేకరించగా ఈ ఏడాది 17 కోట్ల లీటర్లను సేకరిస్తుందన్నారు. 8 లక్షల లీటర్ల సామర్ధ్యంతో ఆటోమెషీన్‌ ప్లాంట్‌ను సమకూర్చుకున్నామన్నారు. 13.69 కోట్ల లీటర్ల పాల అమ్మకాలు సాగించగా 874 టన్నుల బటర్‌, 873 టన్నుల నెయ్యి, 599 టన్నుల పాలపొడి, రోజుకు 1.66 లక్షల కిలోల పెరుగు, 44 వేల లీటర్ల మజ్జిగ, 514 కిలోల స్వీట్లు, 756 కేజీల పన్నీరు రోజూ విక్రయిస్తున్నట్లు తెలిపారు. 248 వాహనాల ద్వారా రవాణా జరుగుతుండగా 874 మంది డిస్ర్టిబ్యూటర్లు, 2,292 మంది ఏజెంట్లు, 530 పార్లర్ల ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో సీడ్‌ప్లాంట్‌ను ఏర్పాటుచేసి వరి, మినుము, తీగజాతి కూరగాయల విత్తనాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది సాధించిన టర్నోవర్‌ ద్వారా రూ.10.19 కోట్ల లాభాలు సాధించగా వచ్చే ఏడాది రూ.1,540 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 33 బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్ల ద్వారా పాల సేకరణ చేస్తున్నామని, భవిష్యత్‌లో రాష్ట్రమంతా సంగం సేవలు విస్తరించనున్నట్లు చెప్పారు. పాల ఉత్పత్తులుపై ప్రభుత్వం విధించే పన్నుల కారణంగా ఏడాదికి సంగం డెయిరీపై రూ.20 కోట్ల భారం పడుతుందన్నారు. పన్నులు విధిస్తుంటే పెద్దన్నలా ఉన్న అమూల్‌ డెయిరి చోద్యం చూడడం సరికాదని అభిప్రాయపడ్డారు.  పశువుకు బీమా ప్రీమియంలో 40 శాతం సంగం డెయిరీ భరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పదవీకాలం ముగిసిన పాలకవర్గ సభ్యుడు గంగినేని హనుమంతరావును, సంగం డెయిరీకి అత్యధిక పాలు పోసిన రైతులను సత్కరించి ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎండీ పి.గోపాలకృష్ణన్‌, పాలకవర్గ సభ్యులు, జిల్లాలోని పాల సొసైటీల అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ విభాగాల అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


Updated Date - 2022-09-22T05:40:43+05:30 IST