ప్చ్‌..!

ABN , First Publish Date - 2021-12-31T06:15:45+05:30 IST

సోమశిల నుంచి విడుదలైన నీటిని సంగం ఆనకట్ట నుంచి కనిగిరి రిజర్వాయర్‌, కనుపూరు కాలువు, బెజవాడ పాపిరెడ్డి కాలువ, నెలూరు చెరువు కాలువలకు విడుదల చేస్తారు.

ప్చ్‌..!
గత ఏడాది ఆనకట్ట వారధిపై వేసిన రింగ్‌బండ్‌ (ఫైల్‌)

సంగం వారధిపై ఇసుక బస్తాల రింగ్‌బండ్‌ ఏర్పాటు

గతేడాది కంటే రెట్టింపు విలువతో టెండర్‌

ఒక్కరంటే ఒక్కరూ ముందుకురాని కాంట్రాక్టర్లు

రెండేళ్లుగా బిల్లుల పెండింగే కారణం!

మళ్లీ షార్ట్‌ టెండర్‌కు నోటిఫికేషన్‌


సంగం ఆనకట్ట వారధిపై ఇసుక బస్తాలతో రింగ్‌బండ్‌ వేసేందుకు అధికారుల ఆహ్వానించిన ఆన్‌లైన్‌ టెండర్లకు ఒక్క కాంట్రాక్టరు కూడా ఆసక్తి చూపలేదు. దీంతో చేసేదిలేక  మరోమారు షార్ట్‌ టెండర్లు పిలిచారు. సంగం ఆనకట్టపై రెండేళ్లుగా ఇసుక బస్తాల రింగ్‌బండ్‌ వేసిన గుత్తేదారులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు. ఈ కారణంతోనే కాంట్రాక్టర్లు  ముందుకు రాలేదని తెలుస్తోంది.


సంగం, డిసెంబరు 30 : సోమశిల నుంచి విడుదలైన నీటిని సంగం ఆనకట్ట నుంచి కనిగిరి రిజర్వాయర్‌, కనుపూరు కాలువు, బెజవాడ పాపిరెడ్డి కాలువ, నెలూరు చెరువు కాలువలకు విడుదల చేస్తారు. సంగం ఆనకట్టపై ఫాలింగ్‌ షట్టర్లతో సుమారు పది అడుగుల మేర నీరు నిల్వ చేసి కాలువలకు తరలిస్తారు. ఆనకట్ట వద్ద ఫాలింగ్‌ షట్టర్ల లెవల్‌ నీటిమట్టంతో కనుపూరు కాలువకు 350 క్యూసెక్కులు, బెజవాడ పాపిరెడ్డి కాలువకు 400 నుంచి 450 క్యూసెక్కుల నీటి ప్రవాహం మాత్రమే వెళ్తుంది. రబీ సీజన్‌లో కనుపూరు కాలువ దిగువ ఆయకట్టుకు సజావుగా సాగునీరు అందాలంటే సుమారు 500 స్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలి. అదేవిధంగా బెజవాడ పాపిరెడ్డి కాలువకు 650 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలి. ఆ రెండు కాలువకు కేటాయించిన విధంగా నీటిని విడుదల చేయాలంటే సంగం ఆనకట్ట వద్ద 11.5 అడుగుల మేర నీటిమట్టం పెంచాలి. దీంతో ప్రతి ఏడాది రబీ సీజన్‌లో ఫాలింగ్‌ షట్టర్ల వద్ద వారధిపై 1236 మీటర్ల పొడవునా ఇసుక బస్తాలతో ఐదు అడుగుల ఎత్తు మేర రింగ్‌బండ్‌ ఏర్పాటు చేస్తారు. దాని ఆధారంగా నీటి మట్టం 11.5 అడుగుల మేర పెంచి కనుపూరు, బెజవాడ పాపిరెడ్డి కాలువల కింద సాగు చేసిన దిగువ ఆయకట్టు వరకు నీటిని అందిస్తారు.


 రూ.61 లక్షలతో టెండర్లు

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడది కూడా సంగం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలతో రింగ్‌బండ్‌ వేసేందుకు వారం రోజుల క్రితం ఆన్‌లైన్‌ టెండర్లు పిలిచారు. గత ఏడాది సుమారు రూ.33 లక్షలతో టెండరు పిలవగా 10శాతం లెస్‌తో టెండర్‌ వేశారు. ఈ ఏడాది పెరిగిన రేట్ల ప్రకారం  రెండింతలు పెంచి రూ.61 లక్షలకు టెండర్‌ పిలిచారు. 28వ తేదీతో గడువు ముగిసింది. అయితే, అధికారుల పరిశీలనలో ఒక్కరు కూడా టెండరు వేయలేదని తెలిసింది.   గడిచిన రెండేళ్ల నుంచి వేసిన ఇసుక బస్తాల రింగ్‌బండ్‌కు చెందిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదు.  సుమారు రూ. 65 లక్షలకుపైగా బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి.  దీంతో ఇరిగేషన్‌ అధికారులు గురువారం మళ్లీ షార్ట్‌ టెండరు నోటిఫికేషన్‌ ఇచ్చారు.


త్వరలో బిల్లులు వస్తాయ్‌!

రెండు రోజుల క్రితం ముగిసిన ఇసుక బస్తాల రింగ్‌బండ్‌ టెండరులో ఎవరూ టెండర్‌ వేయని మాట వాస్తవమే. దీంతో షార్ట్‌ టెండర్‌ పిలిచాం. గతంలో చేసిన పనులకు బిల్లులు త్వరలో వస్తాయి. కాంట్రాక్టర్లు భయపడాల్సిన పనిలేదు. 

- కృష్ణమోహన్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ


Updated Date - 2021-12-31T06:15:45+05:30 IST