సంగారెడ్డి 3, మెదక్‌ 11

ABN , First Publish Date - 2022-07-01T05:44:57+05:30 IST

పదోతరగతి ఫలితాల్లో మెదక్‌ జిల్లా నిరాశపరిచింది. గత ఫలితాలతో పోలిస్తే ఈ సారి 4.04 శాతం శాతం కిందకు పడిపోయి రాష్ట్రంలోనే 11వ స్థానానికి పరిమితమైంది.

సంగారెడ్డి 3, మెదక్‌ 11
విజయసంకేతం చూపుతున్న తూప్రాన్‌ మండలం దాతర్‌పల్లి గురుకుల బాలికలు

పదోతరగతి ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాకు మెరుగైన ర్యాంకు

పడిపోయిన మెదక్‌ జిల్లా ర్యాంకు 

ఈ సారి కూడా బాలికలదే హవా

సంగారెడ్డి జిల్లాలో 96.75, మెదక్‌లో 93.45 శాతం ఉత్తీర్ణత


మెదక్‌ అర్బన్‌, జూన్‌ 30: పదోతరగతి ఫలితాల్లో మెదక్‌ జిల్లా నిరాశపరిచింది. గత ఫలితాలతో పోలిస్తే ఈ సారి 4.04 శాతం శాతం  కిందకు పడిపోయి రాష్ట్రంలోనే 11వ స్థానానికి పరిమితమైంది. కరోనా కారణంగా తరగతులు సరిగ్గా జరగకపోవడం, పనిదినాల సంఖ్యను తగ్గించడం.. సిలబ్‌సను కుదించడం వంటి కారణాలు ఫలితాలపై ప్రభావం చూపాయి. 

 ఈ ఏడాది మే 23 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించిన పదోతరగతి పరీక్షలకు మెదక్‌ జిల్లావ్యాప్తంగా 11,395మంది హాజరయ్యారు. ఇందులో 10,649 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 5,192 (91.41శాతం)మంది, బాలికలు 5,457 (95.49 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. 93.45 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే అధికశాతం పాసయ్యారు. జిల్లాలో 140 ఉన్నత పాఠశాలుండగా పదో తరగతి ఫలితాల్లో బాలికలు 109 మంది, బాలురు 40 మంది, మొత్తం 149 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్‌లు సాధించారు. 65 పాఠశాలల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. 


గతంతో పోలిస్తే 4.04 శాతం తేడా

2018-19 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్ష ఫలితాల్లో మెదక్‌ జిల్లా 97.49 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత రెండేళ్లు కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే విద్యార్థులను ఆల్‌పాస్‌ చేశారు. 2021-22లో మెదక్‌ జిల్లా విద్యార్థులు 93.45శాతం ఉత్తీర్ణత సాధించారు. గతంలో రాష్ట్రంలో 7వ స్థానంలో ఉన్న జిల్లా ఇప్పుడు 11వ స్థానానికి తగ్గింది. దాదాపు 4.04 శాతం మేర ఫలితాల్లో తేడా కనిపించింది.


మెరుగైన సంగారెడ్డి జిల్లా స్థానం

సంగారెడ్డిఅర్బన్‌, జూన్‌ 30: పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో సంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచింది. గతేడాది (2018-19) నాలుగోస్థానంలో నిలవగా ఈసారి ర్యాంకు కాస్త మెరుగుపడింది. జిల్లాలో మొత్తం 22,363 మంది పరీక్షలు రాయగా అందులో 21,636 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 11వేల మంది, బాలికలు 10,636 మంది ఉన్నారు. బాలురు 95.99ు, బాలికలు 97.54ు మొత్తం 96.75 ఉత్తీర్ణత శాతం నమోదైంది. అయితే ఈ సారి కూడా అమ్మాయిలదే హవా కొనసాగింది.


ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం

- నాంపల్లి రాజేశ్‌, డీఈవో సంగారెడ్డి

పదోతరగతి ఫలితాల్లో జిల్లా మూడోస్థానంలో నిలవడంపై సంతోషంగా ఉంది. గతేడాది నాలుగో స్థానంలో నిలిచిన సంగారెడ్డి జిల్లా ఈ సారి మూడోస్థానం రావడం హర్షించదగ్గ విషయం. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులందరి కృషి ఫలితంగానే మెరుగైన స్థానం దక్కించుకున్నాం. వచ్చే ఏడాది ఇదే స్ఫూర్తితో మెరుగైన స్థానం కోసం ప్రణాళికలు రూపొందించి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం. 

Updated Date - 2022-07-01T05:44:57+05:30 IST