సంగారెడ్డి జిల్లా ఇక సస్యశ్యామలం

Jun 15 2021 @ 00:52AM
మునిపల్లి మండలం లింగంపల్లిలో సంగమేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు సర్వే పనుల ప్రారంభసభలో మాట్లాడుతున్న మంత్రి హరీ్‌షరావు

 రెండు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సర్వేకు రూ.27 కోట్లు

 70 రోజుల్లో సర్వే పనులు పూర్తి

 నిధులు మంజూరు చేయించి సీఎం కేసీఆర్‌తో శంకుస్థాపన చేయిస్తాం

 సంగమేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సర్వే పనుల ప్రారంభంలో మంత్రి హరీశ్‌రావు


ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి/మునిపల్లి, జూన్‌ 14 : సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులతో సంగారెడ్డి జిల్లా ఇక సస్యశ్యామలం కానున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మునిపల్లి మండలం లింగంపల్లిశివారులో సంగమేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు సర్వే పనులను సోమవారం  ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం నీటిని సింగూర్‌కు తేవాలని, సింగూర్‌ నీటి ద్వారా సంగారెడ్డిని సస్యశ్యామలం చేయాలన్నదే సీఎం  లక్ష్యమన్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సంగారెడ్డి, అందోల్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాలకు సాగు నీరందుతుందని, బసవేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి సాగునీరు రానున్నదని  ఆయన తెలిపారు. ఈ రెండు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సర్వే పనుల కోసం ప్రభుత్వం రూ.27 కోట్లు కేటాయించిందన్నారు. ఈ సర్వే పనులను 70 రోజుల్లో పూర్తి చేయించి ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తామన్నారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేయిస్తామని హామీ ఇచ్చారు. సర్వే పనులు పూర్తయిన వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసి ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు ఇరిగేషన్‌ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌కు సూచించారు. సంగమేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ద్వారా 11 మండలాల్లోని 230 గ్రామాలకు సాగు నీరందుతుందని తెలిపారు.. కాళేశ్వరం నీటిని నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దు చివరి గ్రామం వరకు అందిస్తామని ఆయన చెప్పారు. 


నేటి నుంచి అన్నదాతలకు రైతుబంధు డబ్బు

వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు డబ్బు ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో జమవుతాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కరోనా వచ్చి ప్రభుత్వ ఆదాయం తగ్గినా రైతు ప్రయోజనాలను యథావిధిగా కొనసాగిస్తున్నామని తెలియజేశారు. రైతుల కోసం బీమా కల్పించిన రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరొకటి లేదన్నారు. రాష్ట్రంలో కోటి 25 లక్షల ఎకరాలు మాగాణిగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇటీవలే యాసంగి సీజన్‌లో 90 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. గతేడాది వానాకాలం సీజన్‌, యాసంగితో కలిపి రాష్ట్రంలో సుమారు 2.20 కోట్ల ధాన్యం పండిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీజైపాల్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు క్రాంతకిరణ్‌, మాణిక్‌రావు, మహిపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, కలెక్టర్‌ హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, నీటి పారుదలశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


నూనెగింజల ఉత్పత్తిని పెంచేందుకు ప్రోత్సాహం

సంగారెడ్డి టౌన్‌, జూన్‌ 14 : నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా కంది విత్తనాల ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాకు రూ.51 లక్షల విలువ గల 554 క్వింటాళ్ల కంది విత్తనాలను రైతులకు ఉచితంగా అందజేశామన్నారు. పొద్దుతిరుగుడు, పల్లి నూనె గింజల ఉత్పత్తిని ఎక్కువగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో 70 లక్షల ఎకరాల్లో పత్తి, 20 లక్షల ఎకరాల్లో కంది, 8 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పప్పు దినుసులకు మరింత మద్దతు ధర పెంచిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ పత్తికి మంచి డిమాండ్‌ ఉన్నదన్నారు. ఎంఎస్‌పీ ధర కంటే ఎక్కువకు అమ్మడానికి రైతులకు వెసలుబాటు కల్పించిందని మంత్రి తెలిపారు. అంతకుముందు పాశమైలారం, కిర్బి పరిశ్రమ యాజమాన్యం, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ వారు జిల్లాకు విరాళంగా ఇచ్చిన మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌కు సంబంధించిన వాహనాలను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి జెండా ఉపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌, శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

Follow Us on: