పారిశుధ్య నిర్వహణపై మేయర్‌ అసంతృప్తి

ABN , First Publish Date - 2021-04-19T06:45:13+05:30 IST

మంత్రి కేటీఆర్‌ అదేశాల మేరకు నగరంలో చేపట్టిన స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఖైరతాబాద్‌, చార్మినార్‌ జోన్లలో చేపట్టిన పారిశుధ్య పనులను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పారిశుధ్య నిర్వహణపై మేయర్‌ అసంతృప్తి
పారిశుధ్య నిర్వహణను పరిశీలిస్తున్న మేయర్‌ విజయలక్ష్మి

అధికారులపై ఆగ్రహం

చెత్తకుప్పలు తొలగించాలని ఆదేశం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మంత్రి కేటీఆర్‌ అదేశాల మేరకు నగరంలో చేపట్టిన స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఖైరతాబాద్‌, చార్మినార్‌ జోన్లలో చేపట్టిన పారిశుధ్య పనులను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిమల్కాపూర్‌ డివిజన్‌ సంతో్‌షనగర్‌ కాలనీలో చెత్తను చూసి ఎస్‌ఎస్‌ కృష్ణపై అగ్రహం వ్యక్తం చేసి చెత్త తొలగించాలని ఆదేశించారు. కార్మికుల బయోమెట్రిక్‌ను పరిశీలించారు.  మొత్తం 18 మందికి 15 మంది హాజరవడంపై ప్రశ్నించారు. మెడికల్‌ ఆఫీసర్‌ అయీజాజ్‌ఖాన్‌కు ఫోన్‌ చేయగా అందుబాటులోకి రాలేదు. సున్నం చీపుర్లకు బ్లీచింగ్‌ ఫౌడర్‌ రావడం లేదని కార్మికులు మేయర్‌ దృష్టికి తీసుకురాగా.. వెంటనే చీపుర్లు ఏర్పాటు చేయాలని మెహిదీపట్నం డిప్యూటీ కమిషనర్‌ అలీకి సూచించారు. రామ్‌సింగ్‌పురా రాధాకృష్ణ మందిరం వద్ద చనిపోయిన గోవు, పేరుకుపోయిన చెత్తను తొలగించాలన్నారు. రోడ్లపై చెత్తవేయొద్దని స్థానికులకు అవగాహన కల్పించారు. జియాగూడలోని డంపింగ్‌ యార్డ్‌ను పరిశీలించారు. రాంకీప్లాంట్‌లో మెషీన్‌ పనిచేయకపోవడంతో రిపేర్‌ చేయించి పనులను ప్రారంభించాలన్నారు. సాయిదుర్గానగర్‌ నుంచి పురానాపూల్‌ 100 అడుగుల రోడ్డులో వెళ్తుండగా మురికి నీరు, చెత్తను చూసి తొలగించమని అధికారులను ఆదేశించారు. రోడ్డు పక్కన సీఎండీ పాయింట్‌ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేట్లబురుజు, శాలిబండ, ఫలక్‌నుమా, చార్మినార్‌లో పర్యటించిన మేయర్‌ కొన్నిచోట్ల రోడ్లపై చెత్త డంప్‌ చేస్తున్నారని, వెంటనే తొలగించాలని జోనల్‌ కమిషనర్‌ అశోక్‌సామ్రాట్‌ను ఆదేశించారు. బేగంబజార్‌, చింతల్‌బస్తీ, ఉస్మాన్‌గంజ్‌ ఏరియాలో పారిశుధ్య పనులు, ఫలక్‌నుమాలో బిడ్ర్జి పనులను పరిశీలించారు. మెహిదీపట్నం విజయనగర్‌కాలనీలో రోడ్డుపై కిలోమీటర్‌ మేర చెత్త ఉండడం చూసిన మేయర్‌ డీసీని పిలిచి తొలగించాలని ఆదేశించారు. జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్యకు ఫోన్‌ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌జోన్‌లో చాలాచోట్ల చెత్త నిల్వ ఉందని, తొలగించాలన్నారు. 


Updated Date - 2021-04-19T06:45:13+05:30 IST