- కుళాయి చెంతనే చెత్తా చెదారం.. పందుల స్వైర విహారం
రాజమహేంద్రవరం రూరల్, మార్చి 27: గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు పరుస్తూ పరిశుభ్రమైన తాగు నీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులు చేస్తున్న ఆదేశాలు ప్రకటనలకే పరిమిత మవుతున్నాయి. రూరల్ మండలం హుకుంపేట పరిధిలో పలు ప్రాంతాల్లో పారిశుధ్యం అధ్వా నంగా తయారయింది. కాలువలో పూడిక తీత తీయక పోవడం, కొన్నిచోట్ల డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహాత్మగాంధీ వీధిలో కుళాయి చెంతనే డ్రైనేజీలో చెత్త పేరుకుపోయింది. దీనికి తోడు పందులు స్వైర విహారం చేయడంతో మంచినీరు పట్టుకునేందుకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికుడు ఉపాధ్యాయుడు ఆత్రేయపురపు వెంకట్రావు తదితరులు వాపోతున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శికి ఎన్నిమార్లు తెలిపినా వారేమీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పం దించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.