ముమ్మరంగా పారిశుధ్య డ్రైవ్‌

ABN , First Publish Date - 2021-04-19T06:46:08+05:30 IST

నగరంలో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమం చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించడంతో నగరవ్యాప్తంగా ఆదివారం పారిశుధ్య డ్రైవ్‌ నిర్వహించారు.

ముమ్మరంగా పారిశుధ్య డ్రైవ్‌

కొవిడ్‌ కేసులు ఎక్కువయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

రంగంలోకి 453 ఎంటమాలజీ బృందాలు 

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): నగరంలో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమం చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించడంతో నగరవ్యాప్తంగా ఆదివారం పారిశుధ్య డ్రైవ్‌ నిర్వహించారు. ప్రతి జోన్‌కు అదనపు వాహనాలు కేటాయించి రహదారులు, ప్రధాన కూడళ్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. విస్తృత స్థాయిలో శానిటైజేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. కరోనా నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా ఒక్కరోజే 453 ఎంటమాలజీ బృందాలతో 636 ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని చల్లారు. 16 వేలకు పైగా ఆవాసాల్లో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని చల్లి.. సాయంత్రం ఫాగింగ్‌ చేశారు. ప్రధానంగా పాజిటివ్‌ కేసులు ఎక్కువ నమోదవుతున్న ప్రాంతాలలో రోజుకు రెండుసార్లు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్ర్పే చేసే కార్యక్రమం చేపట్టారు. ప్రతి జోన్‌లో మూడువేల లీటర్ల సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని అందుబాటులో ఉంచారు.జోనల్‌, సర్కిల్‌ స్థాయిలో ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, ఆలయాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని చల్లే కార్యక్రమం చేపట్టారు.


Updated Date - 2021-04-19T06:46:08+05:30 IST