ఇదేనా ‘చెత్త’శుద్ధి..!

ABN , First Publish Date - 2022-09-29T17:15:50+05:30 IST

గ్రేటర్‌లో గాడి తప్పిన పారిశుధ్య నిర్వహణ దిశగా జీహెచ్‌ఎంసీ అధికారులు కనీస ప్రయత్నాలు చేయడం లేదు. ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సహ

ఇదేనా ‘చెత్త’శుద్ధి..!

స్టాండింగ్‌ సమావేశంలోఆ కమిటీ ఊసేది?

ఎజెండాలోని అంశాలకు ఆమోదం

పారిశుధ్య నిర్వహణపై జరగని చర్చ  


హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో గాడి తప్పిన పారిశుధ్య నిర్వహణ దిశగా జీహెచ్‌ఎంసీ అధికారులు కనీస ప్రయత్నాలు చేయడం లేదు. ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సహ అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ముక్తకంఠంతో నగరంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతోందని అసహనం వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని సభ్యులు అభిప్రాయపడ్డారు. మెరుగైన నిర్వహణ చర్యల కోసం అఖిలపక్ష కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. రోడ్లపై చెత్త చూస్తే నాకూ సిగ్గేస్తుందని మేయర్‌ స్వయంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని విజయలక్ష్మి సమాధానమిచ్చారు. కానీ, బుధవారం జరిగిన సమావేశంలో పారిశుధ్య నిర్వహణకు సంబంధించి చర్చ జరగకపోవడం గమనార్హం. స్టాండింగ్‌ కమిటీలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో పారిశుధ్య నిర్వహణ అంశం ప్రస్తావనకు రాలేదని తెలిసింది. 


అప్పగించి.. చేతులెత్తేసి..

జీహెచ్‌ఎంసీ పరిధిలో నిత్యం 6300-6500 మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతోంది. ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తోన్న ట్రాలీ కార్మికులు.. సెకండరీ కలెక్షన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ పాయింట్ల (ఎస్‌సీటీపీ) వద్ద వేస్తున్నారు. అక్కడి నుంచి ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ కంపాక్ట్‌ వాహనాల ద్వారా జవహర్‌నగర్‌కు తరలిస్తున్నారు. రోడ్లపై వేసే చెత్తను గతంలో జీహెచ్‌ఎంసీ వాహనాల ద్వారా తొలగించే వారు. మూడు నెలల క్రితం సెకండరీ ట్రాన్స్‌పోర్టేషన్‌(రోడ్లు ఊడ్చిన, రోడ్లపై ప్రజలు వేసిన చెత్త) బాధ్యతలు అదే ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి రహదారులపై ఎక్కడికక్కడ చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. స్వీపింగ్‌ కార్మికులు, పలు ప్రాంతాల్లో పౌరులు వేసే చెత్త తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించి చేతులు దులుపుకున్న జీహెచ్‌ఎంసీ.. పర్యవేక్షణను విస్మరించడం వల్లే ఈ దుస్థితి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా పాలకమండలి, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


స్టాండింగ్‌ కమిటీలో నిర్ణయాలివి..

మేయర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎజెండాలోని తొమ్మిది అంశాలకు కమిటీ ఆమోదం తెలిపింది. అందులో శేరిలింగంపల్లి జోన్‌లోని ఈపీటీఆర్‌ఐ చెరువు సుందరీకరణ, హెర్బల్‌ పార్క్‌ అభివృద్ధి, జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయం నుంచి నల్లగండ్ల రైల్వే స్టేషన్‌ మీదుగా బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌ వరకు 150 మీటర్ల మేర రహదారి, గుల్మోహర్‌ పార్క్‌ వద్ద జంక్షన్‌ అభివృద్ధి, నల్లగండ్ల గ్రామ పరిధి సర్వే నెంబర్‌ 400/ఏఏ1/1లో శివరాజుకు చెందిన ఖాళీ స్థలంలో ఉన్న 2155.99 చదరపు మీటర్ల హుడా భూమిని వనజ హౌసింగ్‌ ఎల్‌ఎల్‌సీపీకి బదిలీకి ప్రతిపాదన, హుస్సేన్‌సాగర్‌ నాలాపై అరవింద్‌నగర్‌ వద్ద నిర్మించిన నాలాపై శ్లాబ్‌ను తొలగించి రూ.2.99 కోట్ల వ్యయంతో బ్రిడ్జి పునర్నిర్మాణానికి ఆమోదం వంటి అంశాలు ఉన్నాయి.

Updated Date - 2022-09-29T17:15:50+05:30 IST