తడి.. పొడిగా...!

ABN , First Publish Date - 2021-03-06T05:07:56+05:30 IST

నెల్లూరు నగరంలో ఇళ్ల నుంచి చెత్త సేకరణను పటిష్టంగా అమలు చేసేందుకు నగరపాలక సంస్థ పూనుకుంది.

తడి.. పొడిగా...!
తడి, పొడి చెత్తను వేరు చేస్తున్న మున్సిపల్‌ కార్మికుడు

చెత్త సేకరణలో పటిష్ట విధానం

రెండు డివిజన్లలో ఫైలెట్‌ ప్రాజెక్టు 

ఆ తర్వాత మరో 24 డివిజన్లకు విస్తరణ 

ప్రజల అవగాహనకు సదస్సులు 

డంపింగ్‌ యార్డుల్లో ఎరువుల తయారీకి కసరత్తు 



నెల్లూరు (సిటీ), మార్చి 5 : 

నెల్లూరు నగరంలో ఇళ్ల నుంచి చెత్త సేకరణను పటిష్టంగా అమలు చేసేందుకు నగరపాలక సంస్థ పూనుకుంది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని ప్రజలకు సూచించింది. చిల్డ్రన్స్‌పార్కు సమీపంలోని 16వ డివిజన్‌, కపాడిపాళెం ప్రాంతమైన 51వ డివిజన్‌ను ఫైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఈ నూతన విధానాన్ని అమలు చేస్తోంది. అక్కడి ఫలితాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ నగరంలోని 24 డివిజన్లలో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరు సేకరించే కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి కావడంతో సభలు, సమావేశాలు, ర్యాలీల ద్వారా నగరవాసులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లను వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడమేకాక డంపింగ్‌ యార్డులకు చేర్చిన తర్వాత చెత్త నుంచి ఎరువులు తయారుచేసే ప్లాంట్ల ఏర్పాటుకు కార్పొరేషన్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 


నెల్లూరు నగరం 54 డివిజన్లుగా విస్తరించి ఉంది. వీటిలోని నివాసాలు, దుకాణాలు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాల నుంచి నిత్యం సుమారు 350 టన్నుల చెత్తను నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగం సేకరిస్తోంది. ఆ వ్యర్థాలను బోడిగాడితోటలోని డంపింగ్‌ యార్డుకు తరలించి అక్కడి నుంచి దొంతాలి వద్దనున్న ప్రధాన యార్డుకు చేరవేస్తోంది. అయితే నగరం రోజురోజుకు విస్తరిస్తుండటం, దాని తోపాటు వ్యర్థాలు కూడా భారీ పెరుగుతుండటంతో వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చెత్త నుంచి ఎరువులు తయారు చేసేందుకు అనుగుణంగా తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలని నగర పాలక సంస్థ నిర్ణయించింది. తడి చెత్త నుంచి తయారు చేసే ఎరువులను బహిరంగ మార్కెట్‌లో విక్రయించేలా, పొడి చెత్తలోని ప్లాస్టిక్‌, ఐరన్‌ వస్తువులను ప్రాసెసింగ్‌ ప్లాంట్ల ద్వారా ఏజెన్సీలకు విక్రయ బాధ్యతలు అప్పగించేలా అధికారులు యోచన చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం 16, 51 డివిజన్లలో ప్రయోగాత్మకంగా ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరణను ప్రారంభించారు. ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో 4, 5, 6, 8, 9, 10, 11, 13, 14, 15, 17, 18, 21, 22, 23, 24, 29, 40, 41, 42, 47, 49, 50, 52 డివిజన్లలోనూ దీనిని అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని, రోడ్లపై వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తేనే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ప్రజలే కీలకం 

- వెంకట రమణయ్య, కార్పొరేషన్‌ ఆరోగ్య అధికారి 

తడి, పొడి చెత్త సేకరణలో ప్రజల చైతన్యమే కీలకం. వారికి అన్ని రకాలుగా అవగా హన కల్పిస్తున్నాము. కమిషనర్‌ ఆదేశానుసారం సదస్సులు, సమావేశాలు నిర్వహి స్తున్నాము. ఇప్పటికైతే చక్కటి ఫలితాలే వస్తున్నాయి. 

Updated Date - 2021-03-06T05:07:56+05:30 IST