పర్‌ఫెక్ట్‌గా ‘నకిలీ’

ABN , First Publish Date - 2020-08-07T18:27:22+05:30 IST

ప్రాణాలు తీసిన శానిటైజర్‌ నకిలీదిగా పోలీసులు గుర్తించారు. పర్‌ఫెక్ట్‌ కంపెనీ..

పర్‌ఫెక్ట్‌గా ‘నకిలీ’

ప్రాణాలు తీసిన శానిటైజర్‌

హైదరాబాద్‌ కేంద్రంగా తయారు

పోలీసుల అదుపులో నిందితులు

దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్‌ 


ఒంగోలు(ప్రకాశం): ప్రాణాలు తీసిన శానిటైజర్‌ నకిలీదిగా పోలీసులు గుర్తించారు. పర్‌ఫెక్ట్‌ కంపెనీ డొల్లాతనాన్ని సిట్‌ బృందం గుర్తించింది. దీంతోపాటుగా గుంటూరు జిల్లా సాతులూరులో ఉన్న మరో కంపెనీ తయారుచేసిన మూడు బ్రాండ్లపై కూడా అనుమానం రావడంతో సిట్‌ అటువైపు దర్యాప్తు సాగిస్తోంది. అయితే ఇప్పటికే కురిచేడులో శానిటైజర్‌ తాగి మృతిచెందిన విషయంపై ఒక అవగాహనకు వచ్చిన సిట్‌ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదేక్రమంలో గురువారం ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా మెడికల్‌, కిరాణా దుకాణాల్లో ఉన్న శానిటైజర్లను పరిశీలించారు.


బ్రాండ్లపై విచారణ చేపట్టారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తయారుచేస్తున్న పర్‌ఫెక్ట్‌ శానిటైజర్‌కి సంబంధించి ఎలాంటి లైసైన్స్‌, జీఎస్టీ, తయారుచేసే కంపెనీ చిరునామా నకిలీగా గుర్తించారు. అంతేకాదు శానిటైజర్‌లో ఆల్కహాల్‌ బదులుగా ప్రాణాంతకమైన మిథైల్‌ క్లోరైడ్‌ వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో అక్కడ పనిచేసే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఒక గుడారం ఏర్పాటుచేసి శానిటైజర్‌ తయారుచేయడాన్ని చూసిన సిట్‌ అధికారులు విస్తుపోయారు. దీంతో జిల్లాలో విక్రయిస్తున్న శానిటైజర్లలో అనేకం నకిలీ ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. 


అడ్ర్‌సలేని కంపెనీపై ఆరా

తీగ లాగితే డొంక కదిలినట్లుగా శానిటైజర్‌ డిస్ట్రిబ్యూటర్‌ను విచారిస్తే నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో పర్‌ఫెక్ట్‌ శానిటైజర్‌ తయారుచేసే కేంద్రాన్ని గుర్తించిన సిట్‌ బృందం శానిటైజర్‌పై ఉన్న చిరునామాకు తయారుచేసే కేంద్రానికి ఎలాంటి పొంతన లేక పోవడాన్ని గుర్తించింది. ఆ కేంద్రాన్ని నిర్వహిస్తున్న సూత్రధారుల కోసం వేట ప్రారంభించారు. 


పోలీసులు అదుపులో పలువురు

నకిలీ శానిటైజర్‌ తయారీకి సంబంధించి ఇప్పటికే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా నరసరావుపేట సమీపంలో ఉన్న ఫార్మాలో తయారవుతున్న మూడు బ్రాండ్లలో కూడా అవకతవకలను గుర్తించిన సిట్‌ అక్కడ మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  


Updated Date - 2020-08-07T18:27:22+05:30 IST