మోదీ వస్తే.. పిల్లిలా ఎందుకు దాక్కున్నావ్‌!

ABN , First Publish Date - 2022-02-13T08:18:14+05:30 IST

‘‘ప్రధాని మోదీని తరుముతా. ఢిల్లీ గోడలు బద్దలు కొడతా అంటూ రెచ్చిపోతున్న కేసీఆర్‌.. మోదీ తెలంగాణ వస్తే ఎందుకు ఎదురుపడలే? పిల్లిలా ఎందుకు దాక్కున్నావ్‌.? మన రాజ్యాంగాన్ని ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకుంది.

మోదీ వస్తే.. పిల్లిలా ఎందుకు దాక్కున్నావ్‌!

మేధావులను మోసం చేసే మేధావి కేసీఆర్‌: సంజయ్‌

రాజ్యాంగాన్ని ముట్టుకుంటే.. ప్రజలను ముట్టుకున్నట్లే: హరగోపాల్‌

ఎమ్మార్పీఎస్‌, అనుబంధ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం

పంజాగుట్ట, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రధాని మోదీని తరుముతా. ఢిల్లీ గోడలు బద్దలు కొడతా అంటూ రెచ్చిపోతున్న కేసీఆర్‌.. మోదీ తెలంగాణ వస్తే ఎందుకు ఎదురుపడలే? పిల్లిలా ఎందుకు దాక్కున్నావ్‌.? మన రాజ్యాంగాన్ని ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకుంది. అంబేడ్కర్‌ భిక్షతోనే సీఎం అయ్యావనే విషయాన్ని గుర్తుపెట్టుకో’’ అని పలువురు వక్తలు అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్‌), అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్ఫంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘అంబేడ్కర్‌ బతికి ఉంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చెప్పి ఉండే వారేమో? కానీ, కేసీఆర్‌ రాజ్యాంగాన్ని తిరగరాస్తా అంటున్నాడు. మేధావులను మోసం చేసే అతి పెద్ద మేధావి కేసీఆర్‌. రాజ్యాంగాన్ని కాపాడుకునే నినాదంతో మనమంతా ముందుకెళ్లాలి. కేసీఆర్‌ హఠావో. రాజ్యాంగం బచావో పేరిట రాజ్యాంగ పరిరక్షణ వేదికను ఏర్పాటు చేసి ఐక్య పోరాటం చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. తాగి వాహనం నడిపితే తప్పయినప్పుడు తాగి ప్రభుత్వాన్ని నడపడం, మీడియా సమావేశం పెట్టడం కూడా తప్పేనన్నారు.


రాజ్యాంగాన్ని తిరిగి రాసే సత్తా కేసీఆర్‌కు ఉందా..? అని షర్మిల నిలదీశారు. ‘‘ప్రధానిని తరిమికొట్టడం ఏమో కానీ.. తెలంగాణ ప్రజలు త్వరలోనే మిమ్మల్ని తరిమికొడతారు. రాష్ట్రంలోని సమస్యలపై తన వైఫల్యాలను ఎత్తిచూపకుండా ఉండేందుకే కేసీఆర్‌ ఈ అంశాన్ని బయటకు తెచ్చారు. అత్యంత గొప్పదైన మన రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం కేసీఆర్‌ అవిధేయతే కాదు.. అహంకారం కూడా. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఎంతమందికి నివాళులర్పించారు..?’’ అని నిలదీశారు. ‘‘రైతు పంట కొనే సత్తా లేని కేసీఆర్‌..  నేను పులి బిడ్డను అంటున్నారు. మరి మోడీ వచ్చినప్పుడు వరి అంశం మీద ఎందుకు ప్రశ్నించలేదు? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా మీలో చలనం లేదా?’’ అని మండిపడ్డారు.


రాజ్యాంగాన్ని ముట్టుకుంటే.. ప్రజలను ముట్టుకున్నట్లేనని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. ‘‘కేసీఆర్‌కు ఈ రాజ్యాంగం ఏం అడ్డొచ్చింది? రాజ్యాంగం రాసినప్పటి నేపథ్యం ఆయనకు తెలియదు. చైతన్యమే ప్రభుత్వాన్ని భయపెడుతోంది. అందరం కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి’ అని పిలుపునిచ్చారు. కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘కేసీఆర్‌ మనసులో ఏదైనా దీర్ఘకాలిక ఆలోచన ఏమైనా ఉందా..? అనిపిస్తోంది. ఏడేళ్లుగా కేసీఆర్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వస్తున్నారు. సభలు, సమావేశాలు పెట్టుకునే హక్కులను కాలరాశారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న మాటలకే కాదు, ఉల్లంఘనలు, దుర్వినియోగంపై కూడా స్పందించాల్సిన అవసరం ఉంది.  రాజ్యాంగాన్ని మార్చాలనడాన్ని సందేహించాల్సిందే.. వ్యతిరేకించాల్సిందే’’ అని అన్నారు. రాజ్యాంగంలో రాసిందే మనం అడుగుతున్నామని.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ దౌర్జన్యం చేస్తానంటే ఉరుకుంటామా అని కోదండరాం అన్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ వేదికను ఏర్పాటు చేసుకుని కొట్లాడదామన్నారు. 2023లో తెలంగాణకు బహుజనుడు ముఖ్యమంత్రి కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ప్రగతి భవన్‌ను అంబేడ్కర్‌ భవన్‌గా మారుస్తామని.. ఏప్రిల్‌ 14న లక్షల మందితో నగరంలో సభ నిర్వహిస్తామని చెప్పారు. 


అంబేడ్కర్‌ పట్ల కృతజ్ఞత లేదు: మందకృష్ణ

కేసీఆర్‌ ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఎంగా రాజ్యాంగంపైనే ప్రమాణం చేశారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. అంతలా ఎదుగుదలకు ఉపయోగపడిన రాజ్యాంగం, అంబేడ్కర్‌ పట్ల ఆయనకు కృతజ్ఞత లేదన్నారు. కేసీఆర్‌ రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు వ్యతిరేకి అని.. ఆయన పులిబిడ్డ కాదు పిరికివాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఒక దీక్ష చేస్తే.. రెండు విరమణలు ఉంటాయని విమర్శించారు.


అనంతరం మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్‌ మొదటి వారంలో హైదరాబాద్‌లో లక్షల మందితో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సభను నిర్వహిస్తామని తీర్మానించారు. ఈనెల 15న రాజ్యాంగ పరిరక్షణ వేదిక సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ, కమిటీని ప్రకటిస్తామని.. 16న మహిళా సంఘాలతో.. 17న మేధావులతో, 18, 19, 20 తేదీల్లో కుల, విద్యార్థి, వికలాంగుల, తదితర సంఘాలతో సమావేశాలు పెట్టాలని తీర్మానించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌, లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు గోవర్ధన్‌, టీడీపీ అధికార ప్రతినిధి పద్మావతి, వివిధ కుల, మహిళా, విద్యార్థి సంఘాలు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-13T08:18:14+05:30 IST