సంజయ్‌ను ప్రభుత్వం కట్టడి చేయాలి

ABN , First Publish Date - 2022-05-28T08:35:07+05:30 IST

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో మసీదులను తవ్వి చూద్దాం’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు రాచరిక, మధ్యయుగాల నాటి

సంజయ్‌ను ప్రభుత్వం కట్టడి చేయాలి

- మధ్యయుగ అరాచకాలను ప్రతిబింబించేలా వ్యాఖ్యలు: భట్టి 

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో మసీదులను తవ్వి చూద్దాం’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు రాచరిక, మధ్యయుగాల నాటి అరాచకాలను ప్రతిబింబిస్తున్నాయని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. ఆ వ్యవస్థ బాగాలేదనే దేశ ప్రజలు పోరాటాలు చేసి ప్రజాస్వామ్య పాలన తెచ్చుకున్నారని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మతం పేరిట కలహాలను బండి సంజయ్‌ సృషిస్తున్నారని ఆరోపించారు. ఆయన ప్రవర్తనను ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశం శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంతో పోటీ పడుతున్న క్రమంలో అశాస్త్రీయ ఆలోచనలకు అద్దం పట్టేలా దేశాన్ని మధ్యయుగంనాటి వ్యవస్థ వైపు తీసుకెళ్లేలా బండి వ్యాఖ్యలు ఉండడం దురదృష్టకరమన్నారు. రాజకీయ లబ్ధికోసం సమాజంలో మతాల మధ్య వైషమ్యాలను సృష్టించి విభజన తెచ్చి అధికారంలోకి రావడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఉర్దూను రద్దు చేస్తామనడం అవివేకమన్నారు. మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బీజేపీ.. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లనూ రద్దు చేయాలన్న వాదనను తెచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, అలాంటి వారిని తెలంగాణలో తిరగకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. 

Updated Date - 2022-05-28T08:35:07+05:30 IST