‘100 కోట్ల వ్యాక్సిన్ డోసులు’ ఇవ్వలేదని రుజువు చేస్తా : సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2021-10-24T19:27:08+05:30 IST

దేశవ్యాప్తంగా 100 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను

‘100 కోట్ల వ్యాక్సిన్ డోసులు’ ఇవ్వలేదని రుజువు చేస్తా : సంజయ్ రౌత్

ముంబై : దేశవ్యాప్తంగా 100 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా తప్పు అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. అర్హులైనవారికి ఇప్పటి వరకు 23 కోట్ల డోసుల కన్నా ఎక్కువేమీ ఇవ్వలేదని, దీనిని తాను రుజువు చేస్తానని మహారాష్ట్రలోని నాసిక్‌లో శనివారం జరిగిన పార్టీ సమావేశంలో చెప్పారు. 


సంజయ్ రౌత్ ప్రత్యక్షంగా ఎవరినీ ప్రస్తావించకుండా, ‘‘ఎన్ని అబద్ధాలు చెబుతారు?’’ అని ప్రశ్నించారు. ‘‘గత 15 రోజుల్లో 20 మంది హిందువులు, సిక్కులు హత్యకు గురయ్యారు. 17 నుంచి 18 మంది సైనికులు అమరులయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, లడఖ్‌లలో చైనా సమస్యలు సృష్టిస్తోంది. కానీ మనం 100 కోట్ల వ్యాక్సినేషన్‌ను సంబరంగా జరుపుకుంటున్నాం. 100 కోట్ల వ్యాక్సినేషన్ నిజం కాదు’’ అని పేర్కొన్నారు. పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసులను ఎవరు లెక్కబెట్టారని ప్రశ్నించారు. 


ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఒకరు మాట్లాడుతూ, కోవిడ్-19 వ్యాక్సినేషన్ గణాంకాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 


ఈ ఏడాది జనవరి 16 నుంచి అక్టోబరు 21 ఉదయం 10 గంటల వరకు మన దేశంలో 100 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 


Updated Date - 2021-10-24T19:27:08+05:30 IST