బరితెగింపు!

ABN , First Publish Date - 2021-01-16T05:21:14+05:30 IST

సంప్రదాయాల ముసుగులో జిల్లాలో యథేచ్ఛగా కోడిపందాలు నిర్వహించారు. కోతముక్క, నెంబర్లాట నిరాటంకంగా నిర్వహించారు.

బరితెగింపు!
పల్లెకోన బరిలో కోడి పుంజులు

 జిల్లాలో జోరుగా కోడి పందాలు

 యథేచ్ఛగా మద్యం విక్రయాలు, జూద క్రీడలు

కన్నెత్తి కూడా చూడని పోలీసులు

అమాయకులపై కేసులు నమోదు

  

రేపల్లె/భట్టిప్రోలు జనవరి 15: సంప్రదాయాల ముసుగులో జిల్లాలో యథేచ్ఛగా కోడిపందాలు నిర్వహించారు. కోతముక్క, నెంబర్లాట నిరాటంకంగా నిర్వహించారు. నగరం పోలీస్‌స్టేషన్‌కు, తహసీల్దార్‌ కార్యాలయానికి సమీపంలోనే కోడిపందాలను నిర్వహిస్తున్నా పోలీస్‌యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడలేదు. కోడి పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో పందెం రాయుళ్ళు స్వగ్రామాలకు రావటంతో కోడిపందాలు కోలాహలంగా జరిగాయి. సంస్కృతి సంప్రదాయాలను అడ్డం పెట్టుకుని అదికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు రాజకీయ అండదండలతో తీర ప్రాంతంలో కోడిపందాలు, జూదానికి తెరలేపి కోట్ల రూపాయలను దండుకుంటున్నారంటూ తీరప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. బహిరంగంగా మద్యం విక్రయాలు చేస్తున్నప్పటికి సంబంధిత కన్నెత్తి కూడా చూడలేదు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావులతో పాటుగా పలువురు పల్లెకోనలో జరుగుతున్న కోడి పందాలను తిలకించారు. ఎంపీ తనయుడు మోపిదేవి రాజీవ్‌, ఎమ్మెల్యే తనయుడు మేరుగ చందన్‌నాగ్‌ కోడి పుంజులతో బరిలో దిగారు. పల్లెకోనలో ఏర్పాటు చేసిన బరుల వద్ద ఘర్షణ జరిగింది. మార్కెట్‌యార్డు చైర్మన్‌పై కొంతమంది చేయిచేసుకున్నారు. అక్కడే ఉన్న వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఇరువర్గాలను సర్ది చెప్పారు. పెదకూరపాడు ప్రాంతంలో కోడి పందాలు యథేచ్ఛగా సాగాయి. 

Updated Date - 2021-01-16T05:21:14+05:30 IST