ప్రయాణం.. పరేషాన్‌..!

ABN , First Publish Date - 2022-01-12T15:38:11+05:30 IST

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లాలంటే సాధారణ, మధ్య తరగతి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. రెగ్యులర్‌, సంక్రాంతి స్పెషల్‌ రైళ్లు సమయానికి అందుబాటులో లేకపోవడంతో కుటుంబాలతో సహా స్టేషన్లకు వస్తున్న

ప్రయాణం.. పరేషాన్‌..!

అరకొర రైళ్లతో ప్రయాణికుల ఇబ్బందులు

2019తో పోల్చితే సగం మాత్రమే


హైదరాబాద్‌ సిటీ: సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లాలంటే సాధారణ, మధ్య తరగతి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. రెగ్యులర్‌, సంక్రాంతి స్పెషల్‌ రైళ్లు సమయానికి అందుబాటులో లేకపోవడంతో కుటుంబాలతో సహా స్టేషన్లకు వస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అధిక చార్జీలు చెల్లించి ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు జనవరి 5 నుంచి 25 వరకు మొత్తం 220 రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. 20 రోజుల్లో నేరుగా 176 సర్వీసులను నడిపిస్తుండగా, 32 ట్రిప్పులు ఆయా స్టేషన్ల మీదుగా వెళ్తున్నాయి. 12 అన్‌రిజర్వ్‌డ్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా యి. ఈ రైళ్లన్నీ సికింద్రాబాద్‌, నాంపల్లి, లింగంపల్లి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నాందేడ్‌ స్టేషన్ల నుంచి నడుస్తున్నాయి. 


గతంతో పోల్చితే సగమే..

నాలుగు రోజులుగా సికింద్రాబాద్‌, లింగంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతీ రైలులో సామర్థ్యానికి మించి కిక్కిరిసి ఉంటున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రోజుకు సగటున 1.80 లక్షల నుంచి 2.10 లక్షల మంది ప్రయాణిస్తున్నారంటే తాకిడి అర్థం చేసుకోవచ్చు. ఒక్కో డివిజన్‌ పరిధిలో స్పెషల్‌ రైళ్లు పదుల సం ఖ్యలోనే నడుస్తున్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. 2019లో జనవరి 5 నుంచి 25 వరకు 408 ప్రత్యేక రైళ్లను నడిపించిన దక్షిణ మధ్య రైల్వే.. ఈసారి 220 మాత్రమే అందుబాటులో ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రైవేట్‌ వాహన డ్రైవర్లు సాధారణ రోజుల కంటే పండగ రోజుల్లో రెండింతల రేట్లు వసూలు చేస్తున్నారు. ఉప్పల్‌ నుంచి హన్మకొండకు ఆర్టీసీ బస్సులో రూ.215 టికెట్‌ ధర ఉండగా, కారు డ్రైవర్లు రూ.400 వసూలు చేస్తున్నారు. ఖమ్మం, విజయవాడ లాంటి ప్రాంతాలకు ఒక్కొక్కరి నుంచి రూ.1500 నుంచి రూ.2000 తీసుకుంటున్నట్లు తెలిసింది. 


ప్రత్యేక బస్సులు శివార్ల నుంచే..ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ చర్యలు

మహాత్మాగాంధీ బస్టాండ్‌లో సంక్రాంతి రద్దీ నేపథ్యంలో యాదగిరిగుట్ట, వరంగల్‌ వెళ్లే బస్సులను ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌ నుంచి నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. కర్నూల్‌, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, మాచెర్ల, నెల్లూరు వైపు బస్సులు సీబీఎస్‌ నుంచి, మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేటకు వెళ్లే బస్సులను దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌ నుంచి నడుపుతున్నారు. ఎంబీజీఎస్‌ 35, 36 ప్లాట్‌ఫాం నుంచి టీఎ్‌సఆర్టీసీ విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరుకు వెళ్లే సర్వీసులను నడుపుతోంది. ఎంజీబీఎస్‌లో అదనపు విచారణ కౌంటర్లను ఏర్పాటు చేశారు. 


బస్టాండ్లు కిటకిట..

సంక్రాంతి ప్రయాణికులతో బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రత్యేక సర్వీసుల్లో సైతం సాధారణ చార్జీలనే టీఎస్‌ ఆర్టీసీ వసూలు చేస్తుండటంతో బస్సెక్కేందుకు ప్రయాణికులు పోటీపడుతున్నారు. రద్దీకి అనుగుణంగా జిల్లాలకు ప్రత్యేక సర్వీసుల సంఖ్యను పెంచుతున్నట్లు, ప్రయాణికులకు సమాచారం ఇచ్చేందుకు 200 మంది ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-12T15:38:11+05:30 IST