సంక్రాంతి బరిలో నాలుగు – థియేటర్లు దొరుకుతాయా?

Jul 30 2021 @ 17:33PM

సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ రోజు రైట్‌ అంటే రాంగ్‌ అవుతుంది. రాంగ్‌ అంటే రైట్‌ అవుతుంది. అనుకున్న కాంబినేషన్లు కొన్నిసార్లు సెట్‌ కాకపోవచ్చు. ప్రకటించిన తేదికి సినిమాలు విడుదల కాకపోవచ్చు. చాలా కాలంగా ఈ తంతును చూస్తూనే ఉన్నాం. ఇది పరిశ్రమకు కొత్తేమీ కాదు. వీటిలో సినిమాల విడుదల విషయానికొస్తే.. ఒకేసారి మూడు, నాలుగు పెద్ద సినిమాలు ఉంటే ఎవరో ఒకరు ఫ్రెండ్లీ అండర్‌స్టాండింగ్‌తో వెనక్కి తగ్గుతుంటారు. మరో తేది చూసుకుని తమ చిత్రాలను విడుదల చేస్తారు. కానీ పండుగ సీజన్‌లో అలా కాదు. భారీ చిత్రాలను పండుగ బరిలోనే విడుదల చేయాలని తపిస్తుంటారు నిర్మాతలు. రానున్న సంక్రాంతి అలాంటి గట్టి పోటీ ఇవ్వనుంది స్టార్‌ హీరోలకు. 


ఇప్పటికే పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ తెలుగు రీమేక్‌, మహేశ్‌ ‘సర్కారువారి పాట’ చిత్రాలను సంక్రాంతికి విడుదల చేయనున్నామని నిర్మాతలు ప్రకటించారు. అయితే తేదీ ఇవ్వలేదు. కరోనా, షూటింగ్‌ ఆలస్యం తదితర కారణాలతో విడుదల లేట్‌ అయిన ‘రాధేశ్యామ్‌’ కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. మేకర్స్‌ ఓ అడుగు ముందుకేసి జనవరి 14న సినిమాను విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అయితే ఈ మూడు చిత్రాలు భారీ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నవే. అయితే సంక్రాంతి బరిలో మరో సినిమా కూడా పోటీ ఉండేలా కనిపిస్తుంది. వెంకటేశ్‌ నటిస్తున్న ‘ఎఫ్‌3’ సినిమా కూడా సంక్రాంతి బాటలో వెళ్లేలా కనిపిస్తోంది. తాజాగా హీరో వెంకటేశ్‌ కూడా ‘ఎఫ్‌3’ సంక్రాంతికి విడుదలైతేనే బావుంటుంది’ అని తన మనసులో మాటను బయటపెట్టారు. మరి నిర్మాత దిల్‌ రాజు ఆలోచన ఎలా ఉందో చూడాలి. ఆయనకు సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొచ్చింది. తన బ్యానర్‌లో సూపర్‌ హిట్‌ చిత్రాలైన ‘సీతమ్మవాకిట్టో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్‌3’, ‘ఎవడు’ చిత్రాలు సంక్రాంతికే విడుదలై సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి. ఆ సెంటిమెంట్‌ కోసం కూడా దిల్‌ రాజు ఆలోచించే అవకాశం ఉంది. 


సమస్య అదే...

పండుగ సీజన్‌లో నాలుగు సినిమాలు విడుదల చేయకూడదనే రూల్‌ ఏమీ లేదు. వరుసగా సినిమాలు విడుదలైతే థియేటర్లు కళకళలాడుతుంటాయి. అయితే ఆయా చిత్రాలకు థియేటర్ల సంఖ్య తగ్గుందనే భయం నిర్మాతలకు ఉంటుంది. ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్ల సంఖ్య 2500కు పైగా ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. ఉన్నవాటిలో మంచి థియేటర్లు ఆదిపత్యం ఉన్నవారికే దక్కుతుంటాయి. ఓ మాదిరి థియేటర్‌లలో పెద్ద సినిమాలు వేయడానికి ఇష్టపడరు. కాబట్టి మూడు, నాలుగు సినిమాలు రెండు రోజుల తేడాతో విడుదల ఉంటే థియేటర్లను పంచుకోవడం కష్టమే. ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తే మొదటి వారంలోనే మంచి వసూళ్లు రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే పరిశ్రమలో అనుకున్నది అనుకున్నట్లు జరగగపోవచ్చు. చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చు. ముందే ప్రకటించి విడుదల వెనక్కి వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఏం జరుగుతుందో తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే! 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.