నేడు భోగి

ABN , First Publish Date - 2021-01-13T06:00:38+05:30 IST

ముంగిట మెరిసే ముత్యాల ముగ్గులు.. వాటి మధ్యలో గొబ్బెమ్మలు, పల్లె పడుచులు పాడే గొబ్బి పాటలు.. బాలల చేతుల్లో ఎగిసే గాలిపటాలు, కొత్తకు చోటు కల్పిస్తూ పాతకు వీడ్కోలు పలుకుతూ పాత సామగ్రితో వేసే భోగి మంటలు, బొమ్మల కొలువులు, సంప్రదాయ పిండి వంటల ఘుమఘుమలు..

నేడు భోగి

  1. ఆధ్యాత్మిక, శాస్త్రీయ సందేశాల సమ్మిళితం
  2. నేడు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ
  3. గ్రామాలకు చేరి.. వేడుకలకు సిద్ధమైన హైందవులు


కర్నూలు (కల్చరల్‌), జనవరి 12: ముంగిట మెరిసే ముత్యాల ముగ్గులు.. వాటి మధ్యలో గొబ్బెమ్మలు, పల్లె పడుచులు పాడే గొబ్బి పాటలు.. బాలల చేతుల్లో ఎగిసే గాలిపటాలు, కొత్తకు చోటు కల్పిస్తూ పాతకు వీడ్కోలు పలుకుతూ పాత సామగ్రితో వేసే భోగి మంటలు, బొమ్మల కొలువులు, సంప్రదాయ పిండి వంటల ఘుమఘుమలు..! ఇంతేనా.. ఎక్కడెక్కడో స్థిరపడ్డవారు ఒక్కచోట చేరి.. ఉమ్మడి కుటుంబ వైభవాన్ని గుర్తు చేసే క్షణాలు..! ఇదీ పల్లె పల్లెనా కనిపించే సంక్రాంతి సందడి. మూడు రోజుల ముచ్చటైన వేడుక వారం ముందే ఆరంభమైంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు సంక్రాంతి వేడుకలకు సిద్ధమయ్యాయి. బుధవారం భోగి, గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమ పండుగలను ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. 


సంస్కృతిని చాటే వేడుక

‘అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు’ అంటూ బసవన్నల ఆటతో ఆబాలగోపాలాన్ని గంగిరెద్దులవారు అలరిస్తారు. ధాన్యం, పాత దుస్తులు తీసుకుని ఆనందంగా వెళతారు. గ్రామ సీమల్లో పశుసందప ఎక్కువ. వాటిపై ఆధారపడి  రైతు కుటుంబాలు జీవిస్తాయి. రైతులకు బసవన్న సేవలను గుర్తు చేస్తారు గంగిరెద్దుల ఆటగాళ్లు. ‘అంబ పలుకు జగదాంబ పలుకు.. అయ్య వారింటికి అంతా మంచి జరుగు’ అంటూ ఢమరుకాన్ని ఆడిస్తూ ధాన్య సంపద ఉన్న ఇళ్లకు దిష్టితీసి, ధాన్యం యాచిస్తారు బుడబుక్కల వారు. ‘హరిలో రంగ హరీ.. మా ఇంట కొలువు దీరయ్య శ్రీరంగ హరి’ అంటూ చెక్క భజనతో హరిదాసులు ఆధ్యాత్మిక భావసంపదను పంచుతారు. సంక్రాంతి వేళ ధాన్య రాశులు ఇళ్లకు చేరుతాయి. ప్రకృతి మాత ‘సంక్రాంతి లక్ష్మి’ రూపంలో తెలుగు వారి లోగిళ్లలో తిరుగాడుతుంది. వారసత్వ సంప్రదాయ పండుగ సంక్రాంతి వెనుక ఎన్నో ఆధ్యాత్మిక, శాస్త్రీయ అంశాలు ఇమిడి ఉన్నాయి. 


రంగవల్లులు

సంక్రాంతికి నెల రోజుల ముందే రంగవల్లుల సందడి ఆరంభం అవుతుంది. ధనుర్మాసం  మొదలవ్వగానే రోజూ వేకువజామున ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేస్తారు. ఇందుకోసం వేకువజామునే నిద్రలేస్తారు. ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపి జల్లుతారు. దీనివల్ల హాని కలిగించే క్రిములు నశిస్తాయి. ఆవుపేడ యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. ధాన్యపు పిండితో ముగ్గు వేడయం, వాటి మధ్య ధాన్యం పోయడం వల్ల ప్రకృతిలో మేలు చేసే చీమలకు, చిన్న చిన్న పక్షులకు ఆహారం అందుతుంది. రైతులు ఇళ్లలో ధాన్యపురాశి కోసం వచ్చే పిచ్చుకల కోసం ఇంటి పైకప్పు, వసారాల్లో ధాన్యపు కంకులు ఏర్పాటు చేస్తారు.



భోగి వేడుక

మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో ముందుగా ‘భోగి’ వస్తుంది. ఆ రోజు వేకువజామున భోగి మంటలు వేస్తారు. గ్రామ వీధుల్లో, చావడులలో సామూహికంగా ఈ వేడుక నిర్వహిస్తారు. భోగి మంటలు వేసి, అందులో పాత వస్తువులు దహనం చేస్తారు. భోగి మంటల ద్వారా నవ్యక్రాంతిని అందుకోవాలనే అర్థం ఇందులో ఇమిడి ఉంది. భోగిపండుగ రోజున పిల్లలకు రేగుపండ్లు, పూలను తలమీద పోస్తారు. దీనివల్ల ప్రకృతి నుంచి ఎలాంటి కీడు తమ పిల్లలపై పడదని తల్లిదండ్రులు విశ్వసిస్తారు. భోగి పండుగ రోజున నువ్వులు కలిపిన సజ్జ రొట్టెలు, వంకాయ కూరను వండుకు తింటారు. 


సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

సూర్యుడు దక్షిణార్ధ గోళం నుంచి ఉత్తరార్ధ గోళం వైపు పయనిస్తూ మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా వేడుక నిర్వహించుకుంటాము. సంక్రాంతి ప్రధానంగా రైతుల పండుగ. పండుగ రోజున రైతుల ఇండ్లన్నీ బంధువులతో కళకళలాడుతాయి. సంక్రాంతి పండుగ రోజ న కొత్త ధాన్యంతో పొంగలి చేస్తారు. వివిధ రకాల పిండి వంటలు తయారు చేస్తారు. సంప్రదాయ రుచులను ఆస్వాదిస్తారు. కొత్త దుస్తులు ధరించి ఆనందంగా గడుపుతారు. హరిదాసులు, జంగమ దేవరలు, గంగిరెద్దుల ఆటగాళ్లకు తమ వంతుగా ధాన్యం, పాత దుస్తులు దానం చేస్తారు. సాయంత్రం కుర్రకారు గాలి పటాల ఎగురవేస్తారు. బాలికల కోసం తల్లిదండ్రులు బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. 


కనుమ పండుగ

వ్యవసాయ పనులలో ఏడాదంతా తమకు ఆసరాగా నిలిచే పశువుల కోసం కనుమ పండుగను రైతులు ఘనంగా నిర్వహిస్తారు. ఎద్దులు, ఆవులకు స్నానం చేయించి, వాటిని అందంగా ముస్తాబు చేస్తారు. పశు సంపద మరింత వృద్ధి చెందాలని, వ్యవసాయ పనులకు మరింత అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ.. వాటిని పూజిస్తారు. 





Updated Date - 2021-01-13T06:00:38+05:30 IST