విజయన్నా.. మా జోలికి రావొద్దు..!

ABN , First Publish Date - 2022-01-25T04:31:42+05:30 IST

కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మేము వ్యాపారాలు చేస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని, అనవసరంగా మాపై ఆరోపణలు చేస్తే పెట్టుబడిదారులు ముందుకురారన్న వాస్తవాన్ని గ్రహించి తమ జోలికి రావద్దని రియల్టర్లు డీసీసీబీ మాజీ చైర్మన్‌, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డికి హితవు పలికారు.

విజయన్నా.. మా జోలికి రావొద్దు..!
వివరాలు వెల్లడిస్తున్న వ్యాపారులు

వైసీపీ నేతపై రియల్టర్ల ధ్వజం 

నెల్లూరురూరల్‌, జనవరి 24 : కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మేము వ్యాపారాలు చేస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని, అనవసరంగా మాపై ఆరోపణలు చేస్తే పెట్టుబడిదారులు ముందుకురారన్న వాస్తవాన్ని గ్రహించి తమ జోలికి రావద్దని రియల్టర్లు డీసీసీబీ మాజీ చైర్మన్‌, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డికి హితవు పలికారు. సోమవారం నెల్లూరురూరల్‌ ప్రాంతం కోడూరుపాడు వద్ద బాలాజీ సన్‌సిటీలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సన్నపురెడ్డి పెంచలరెడ్డి, జీ వెంకటేశ్వర్లునాయుడు, మాలకొండయ్యనాయుడు మాట్లాడారు. రైతుల వద్ద 21 ఎకరాల పట్టా భూములు కొనుగోలు చేసి నుడా నుంచి అన్ని అనుమతులు తీసుకుని సర్వసౌకర్యాలతో లే అవుట్లు వేశామన్నారు. ఇప్పటికే కొందరు కొనుగోలు చేశారని చెప్పారు. ఇందులో ప్రభుత్వ భూములున్నాయని, కాలువలను ఆక్రమించారని, రోడ్డు మాయమైందని ఆనం విజయకుమార్‌రెడ్డి ఆరోపించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సర్వేయర్లు తీసుకొచ్చుకుని విచారణ చేసుకోవచ్చని సూచించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే కొనుగోళ్లు నిలిచి రిజిస్ర్టేషన్లు ఆగి ప్రభుత్వానికి ఆదాయం పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, రాజశేఖర్‌నాయుడులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-25T04:31:42+05:30 IST