రాజమహేంద్రవరం సిటీ, మార్చి 27: రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జాతీయ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ సాంస్కృతిక మహోత్సవంలో 25 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన అద్భుతమైన ప్రదర్శనలు దేశ సమైక్యతను చాటాయి. రెండు రోజులుగా జరుతున్న ఈ మహోత్సవాలు ఆదివారం రాత్రితో ముగిసాయి. చివరి రోజు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన శాసన మండలి చైర్మన్ కొయ్యా మోషేన్‌రాజు మాట్లాడుతూ దేశంలో ఉన్న వివిధ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలను ఒక చోటుకు చేర్చి చూసే అవకాశాన్ని కల్పించారన్నారు. జాతీయ సాంస్కృతిక మహోత్సవం బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద మాట్లాడుతూ తాను రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగానని, తాను సినిమాలో అడుగుపెట్టడానికి కారణం గోరంట్ల బుచ్చయ్యచౌదరి అని గుర్తుచేసుకున్నారు. ఇక్కడ సాహిత్యం, కళలు, కవులు, కళాకారులు ఎందరో మహనీయలు నడయాడారని చెప్పారు. వేదంలా ఘోషించే గోదావరి అంటూ పాటను రెండు లైన్లు పాడారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ మహోత్సవాల నిర్వహణకు కారణమైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో జాతీయ స్థాయు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, దానికి కేంద్రం పూర్తిగా సహకరించాలని కోరారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో కల్చరల్ రీజనల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు మంత్రి కిషన్‌రెడ్డి సముఖంగా ఉన్నారని, అయితే దానికి అవసరమైన భూమి కావాలన్నారు. అలాగే నగరంలో గౌతమి లైబ్రరీని అభివృద్ధికి చేస్తున్నారని, గోదావరి ప్రక్షాళనకు రూ.400 కోట్ల నిధులు కేటాయించారని, అందులో ఇప్పటికే 40 కోట్లు విడుదల చేశారని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ భారతీయు వారసత్వ సంపద, ప్రాచీన కళలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ తెలంగాణలో రామప్ప ఆలయం మాదిరి రాజమహేంద్రవరంలో హేవలాక్ బ్రిడ్జిని యునెస్కో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ జానపద కళలను కాపాడుకోవాలన్నారు. రాజమహేంద్రవరంలో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయని, రాళ్ల బండి మ్యూజియం, కాటన్ మ్యూజియం, నేదునూరి వాగ్మయ గ్రంథాలయం వంటి వాటిని పరిరక్షించి అభివృద్ధి చేయాలన్నారు. సభ ప్రారంభం ముందు ముఖ్య అతిథులతో పాటు కలెక్టర్ హరికిరణ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజును జాతీయ సాంస్కృతిక శాఖ అధికారులు దీపిక, గౌరీబసు జ్ఞాపికలతో సత్కరించారు. మహోత్సవాలకు పూర్తిగా సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ శాఖలైన రెవెన్యూ, పోలీస్, విద్యుత్, సాంస్కృతిక శాఖల అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.