Santuario Madonna Della Corona: పర్వతం అంచున అద్భుత కట్టడం.. వెళ్లాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే.. ఇంతకీ దీని కథేంటంటే..

ABN , First Publish Date - 2022-07-22T22:18:29+05:30 IST

Santuario Madonna Della Corona మందిరాన్ని కూడా అంత ప్రాయాసపడే చూసి రావాలి. ఇది కొండ అంచున ఉంది. చుట్టూ అడవి.. పైగా ఎటు చూసినా అందమైన కనువిందు చేసే దృశ్యాలు..

Santuario Madonna Della Corona: పర్వతం అంచున అద్భుత కట్టడం.. వెళ్లాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే.. ఇంతకీ దీని కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: పర్యాటకం అనగానే చాలా మంది ఆలోచన పుణ్యక్షేత్రాల మీదకు పోతుంది. మరీ సాహసాలు మనకెందుకులే అనుకుంటారు. కాస్త కష్టంతో చూసి వచ్చే ప్రదేశాలను చూడాలని అసలు అనుకోరు. పూర్వం రోజుల్లో పుణ్యం సంపాదించుకోవాలని కాశీ రామేశ్వరాలు కాలి నడకన వెళ్ళి సంవత్సరాలు ప్రయాణించి చుట్టి వచ్చే వారు. తల్లిదండ్రులను కావిడిలో మోసిన శ్రవణ కుమారుడినే తీసుకుంటే ఆ అడవి మార్గంలో వారిని మోసుకుంటూ తిరిగి ఎన్నో పాట్లు పడ్డాడు. ఇప్పుడా కష్టాలు మాకెందుకు అనుకోమాకండి.. 


ఇదంతా ఎందుకంటే కష్టపడి మనం సందర్శించిన ప్రదేశాల గురించి మన జీవితంలో ఓ పేజీ ఉంటుంది. దానితో కొన్ని జ్ఞాపకాలు మరపురానివిగా మిగిలిపోతాయి. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న Santuario Madonna Della Corona మందిరాన్ని కూడా అంత ప్రాయాసపడే చూసి రావాలి. ఇది కొండ అంచున ఉంది. చుట్టూ అడవి.. పైగా ఎటు చూసినా అందమైన కనువిందు చేసే దృశ్యాలు.. ఇలాంటి చోటికి వెళ్ళడానికి ఎందుకు భయం? భలే చెపుతున్నారే.. అనుకోకండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రదేశం అందుకు సరిగ్గా సరిపోతుంది. కాస్త సాహసం, మరికొంత అద్భుతాన్ని తనలో దాచుకున్న ఓ గొప్ప కట్టడం ఇది. 


ఇటలీలోని అతిపెద్ద సరస్సు లాగో డి గార్డా నుండి వెరోనాకు కొంచెం దూరంలో Santuario Madonna Della Corona మందిరం ఉంది.  అవర్ లేడీ ఆఫ్ ది క్రౌన్(Our Lady of the Crown) గా పిలిచే ఈ చర్చ్ ను గురించి తెలుసుకోవాలని ఎందరో సందర్శకులు వస్తూ ఉంటారు. ఇది ఒక ప్రత్యేక ప్రదేశం. నిటారుగా ఉన్న కొండ చుట్టూ సగం వరకు అడవి దానిని ఆనుకుని ఉన్న కొండ మీద ఉందీ కట్టడం. 



సాధారణం కంటే కొంచెం భిన్నంగా విహారయాత్ర కోసం చూస్తున్న వారికి,  మడోన్నా డెల్లా కరోనా(Madonna Della Corona) సరైన ఎంపిక. ఈ అభయారణ్యం స్పియాజీ(Spiaggia)లో, కాప్రినో వెరోనీస్(Caprino Veronese), ఫెరారా డి మోంటే బాల్డో(Ferrara di Monte Baldo) మధ్య ఉంది. ప్రకృతి అందించే ప్రశాంతతను ఆస్వాదించడానికి దైవ ఆరాధనకు, ప్రశాంతత క్షణాలను ఆస్వాదనకు, విశ్రాంతి ని పొందాలనుకునే వారికి ఈ ప్రదేశం అనువైది.  ఇక్కడ వరకూ వెళితే మోంటే బాల్డో(Monte Baldo) శిలల గుండెలో దాగి ఉన్న నిశ్శబ్దాన్ని చూడవచ్చు. శతాబ్దాల నుండి ఈ అభయారణ్యం ఒక తీర్థయాత్రా స్థలంగా పేరు పొందింది. ఈ ప్రయాణం"పిల్‌ గ్రిమ్స్ పాత్"(Pill Grimes Path) లేదా "హోప్స్ పాత్"(Hope's Path) బ్రెంటినో బెల్లునో(Brentino Belluno) నుండి మొదలవుతుంది. సుమారు 600 మీటర్ల ఎత్తు 1540 కలప మెట్లు దాదాపు మొత్తం సుమారు 2 గంటల కాలి నడక. ఇంత ప్రేయాసతో గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత నడక శ్రమ మాయమై ఉత్కంఠభరితమైన ప్రదేశాన్ని చూస్తున్నామనే ఆనందంలో మునిగిపోతారు.


మడోన్నా డెల్లా కరోనా(Madonna Della Corona) అడవిని చూడటం ఓ గొప్ప మరపురాని అనుభవం. ఈ ప్రదేశం చుట్టి వస్తే అద్భుతమైన అందాన్ని చూసి ఆనందించే అవకాశం లభిస్తుంది. దీని చుట్టూ అద్భుతమైన ఎత్తైన పర్వతాలు, దిగువకు పెద్ద లోయ, పక్కగా "అడిగే" నది కనువిందు చేస్తాయి. వెచ్చని ఎండ రోజున మడోన్నా డెల్లా కరోనా అభయారణ్యం చూడటం మంచి అనుభవంగా మిగిలిపోతుంది. ఆ ఎండలో మెరిసే కట్టడం కళ్లకు మరింత అందాన్ని పులుముతుంది. చుట్టూ ఉన్న పర్వతాలు, నీలి ఆకాశం అందంగా కనువిందు చేస్తాయి. 



నమ్మశక్యం కాని మత నిర్మాణం...

రోవెరెటో(Rovereto) లో గొప్ప కుటుంబానికి చెందిన లోడోవికో కాస్టెల్‌బార్కో(Lodovico Castelbarco) 1432లో ఇక్కడి మడోన్నా విగ్రహాన్ని తయారు చేసి కరోనాకు ఇచ్చినట్టు పురాణాలు చెపుతున్నాయి. అయితే ఇక్కడ మరో కథనం కూడా ఉంది. 10వ శతాబ్దంలో అడిగే లోయలో నివసించే ప్రజలు దూరంగా మెరిసే కాంతిని చూసి.. అదేంటో తెలుసుకోవాలని కరోనా పర్వతంపైకి వెళ్లారు, అక్కడ కాంతి స్పష్టంగా మినుకుమినుకుమంటుంది. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే శిలువ వేసిన తర్వాత యేసు శరీరాన్ని పట్టుకున్న మడోన్నా విగ్రహం కనిపించిందట. గ్రామస్తులు ఆ విగ్రహానికి పూజ కోసం దిగువ అడిగె లోయకు తీసుకు రావాలని అనుకున్నారు. కానీ అది కుదరకపోయే సరికి అక్కడే కొండ మీద ఉంచేయాలని నిర్ణయించుకున్నారు. ఇది అక్కడ ప్రాచుర్యంలో ఉన్న కథ.



వెయ్యి సంవత్సరాల చరిత్ర..

ఈ ప్రదేశం 1,000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉందని చెపుతుంది. అప్పటి ఆధారాల్లో శాంటూరియో మడోన్నా డెల్లా కరోనా ఒకప్పుడు "రాళ్ళలో ప్రమాదకరమైన మార్గం" గా ఉండేదట. ఈ అభయారణ్యం దేవుడు, జీవిత రహస్యాలను నిశ్శబ్దంగా అన్వేషించే సన్యాసులలో నిండి ఉండేదట. కాలంతో పాటు ఇప్పుడు మడోన్నా డెల్లా కరోనా ప్రత్యేకమైన పర్యాటక ఆకర్షణగా మారింది. 1982లో ఈ మందిరానికి "బాసిలికా మైనర్"(Basilica Minor) అనే బిరుదును ఇచ్చారు. ఏప్రిల్ 17, 1988న పోప్ జాన్ పాల్ II (Pope John Paul II)ఈ మందిరాన్ని సందర్శించి, లేడీ ఆఫ్ కరోనాను ప్రార్థించారు.




16వ శతాబ్దపు పునరుద్ధరణ ప్రాజెక్ట్ ప్రార్థనా మందిరం చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా ఉన్నప్పటికీ మతపరమైన యాత్రికులు సమీపంలోని బ్రెంటానో నుండి అభయారణ్యం వరకు రెండు గంటల ప్రయాణం చేసి కొండను చేరుకుంటారు. "డెల్ టిగ్లియో"(Del Tiglio) బ్రిడ్జ్ నుండి చర్చికి వెళ్ళే చాలా ఇరుకైన మార్గంలో రాక్ నుండి  234 మెట్లు ఉన్నాయి. ఈ మార్గంలో, ప్రకృతి అందాలతో పాటు అరణ్యంలోని అనేక రకాల వన్య ప్రాణులను కూడా చూసే అవకాశం ఉంటుంది.  గోతిక్ ముఖభాగం ముందు సాల్మన్ రంగు చర్చి - బెల్ టవర్‌(Bell Tower) లోని గంటలు మధ్యాహ్నపు వేళ పాట పాడటం ప్రారంభిస్తాయి. ఆ రాగం లోయ మీదుగా ఎగిరి ఆకాశం వైపు దూసుకుపోతుంది. ఇది స్వర్గం భూమి మధ్య ప్రత్యేక క్షణంలా అనిపిస్తుంది. ప్రపంచంలోని అందాన్నివెతికే వాళ్ళకు చక్కని ప్రదేశం. ఫోటోగ్రాఫర్స్ కైతే ఇది మరో స్వర్గమే.. ఎన్ని యాంగిల్స్ కావాలంటే అన్ని తీసుకునే మంచి చాన్స్.

Updated Date - 2022-07-22T22:18:29+05:30 IST