గిలకలదిండిలో ముమ్మరంగా నాటుసారా తయారీ
అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లోనే
పోలీసులకు పట్టుబడినా గుట్టు బయటపడదు
మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని గిలకలదిండి, పరిసర ప్రాంతాల్లో నాటుసారా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. మత్స్యకారులు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో ఒక్కో ఇంటి పేరిటవారు గ్రూపులుగా విడిపోయి మరీ సారా కాస్తున్నారు. గిలకలదిండి ప్రాంతంలోని మడ అడవుల్లో జోరుగా సారా కాస్తున్నా, పట్టించుకునేవారే కరువయ్యారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : గిలకలదిండి హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లే కాలువ మార్గంలో కుడివైపున మడ అడవులున్నాయి. సముద్రంలో చేపల వేటకు బోట్లు ఈ కాలువ వెంబడే వెళతాయి. చేపల వేట పేరుతో కాపుసారా తయారీకి ఉపయోగించే సరుకులను పడవల్లో తీసుకువెళుతున్నారు. అక్కడే కొద్దిరోజులు మకాం ఉండి మరీ నాటుసారా తయారు చేస్తున్నారు. మడ అడవులకు వెళ్లాలంటే పడవ ప్రయాణమే ఆధారం. స్థానికుల సహకారం లేకుండా ఆ ప్రాంతానికి వెళ్లడం కుదరదు. ఇదే అవకాశంగా కొందరు ఇక్కడ జోరుగా నాటుసారా తయారు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వారానికి కనీసం ఒక్కో బట్టీ నుంచి వెయ్యి లీటర్ల సారాని గుట్టుచప్పుడు కాకుండా ఇతరప్రాంతాలకు తరలిస్తున్నారు.
నిలిపివేయాలని నిర్ణయించినా..
గిలకలదిండిలో నాటుసారా తయారీని అరికట్టాలని ఇటీవల స్థానికంగా సమావేశం ఏర్పాటు చేశారు. సారా తయారీని ప్రతి ఒక్కరూ నిలిపివేయాలని, దీనిపై కట్టుబాటు విధించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ కొందరు ఒక మెలికపెట్టారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధి ఇంటిపేరిటి వారు నిలిపివేస్తే, తాము కూడా నిలిపివేస్తామన్నారు. దానికి వారు ముందుకు రాకపోగా, ముందుగా మీరు ఎందుకు నిలిపివేయకూడదు? అంటూ వాగ్వాదానికి దిగారు. అందరూ ఇలా పంతానికి పోవడంతో నాటుసారా తయారీ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఎవరికి వారు వెళ్లిపోయారు.
అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో..
నాటుసారా తయారీదారులకు అధికారపార్టీ నాయకుడి నుంచే పూర్తిస్థాయి భరోసా లభిస్తోంది. జిల్లాస్థాయి పదవిలో ఉన్న ఒక నాయకుడు సారా తయారీదారుల నుంచి నెలకు రూ.8 వేల నుంచి 15 వేల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. తయారీదారులు పోలీసులకు పట్టుబడినా, కేసుల్లేకుండా చేసేందుకు వేలల్లో చేతులు మారుతున్నాయనేది ఇక్కడ బహిరంగ రహస్యమే. సారా తయారు చేయవద్దని గిలకలదిండిలో పోలీస్ ఉన్నతాధికారులు పలుమార్లు పరివర్తన పేరుతో సమావేశాలు నిర్వహించినా, సారా ప్రవాహం ఆగలేదు.