ఆ తల్లి చనిపోయింది

ABN , First Publish Date - 2021-01-16T06:30:43+05:30 IST

భర్త, కుమార్తె అనారోగ్యంపై బాధపడుతూ ఆత్మహత్యాయత్నం చేసిన కురబలకోట మండలానికి చెందిన సరస్వతమ్మ మృతిచెందింది

ఆ తల్లి చనిపోయింది
సరస్వతమ్మ(ఫైల్‌ ఫొటో)

మదనపల్లె క్రైం, జనవరి 15: అనారోగ్యంతో బాధపడుతున్న భర్తకు సేవలు చేయలేక.. ఇటు దివ్యాంగురాలైన కుమార్తె దుస్థితిపై ఆ వృద్ధురాలు కొంతకాలంగా కలత చెందుతోంది. దీంతో జీవితం విరక్తి చెంది కురబలకోట మండలానికి చెందిన సరస్వతమ్మ(65) కుమార్తెతో కలసి ఈనెల 12న ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. కాగా, తిరుపతి రుయాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం మృతిచెందింది. వివరాలివీ.. కురబలకోట మండలం ఎర్రబల్లికి చెందిన ఎం.మారపరెడ్డి(75), సరస్వతమ్మ(65) దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరి నాలుగో కుమార్తె హేమలత(30) పుట్టుకతోనే దివ్యాంగురాలు. కాగా, మిలిటరీలో పనిచేస్తూ పదవీ విరమణ చెందిన మారపరెడ్డి ఇటీవల అనారోగ్యం బారినపడ్డారు. ఇటు భర్త వైద్యం కోసం పెరిగిన ఆర్థిక ఇబ్బందులు, అటు ఏళ్లుగా కుమార్తెకు సేవలు చేయడంపై సరస్వతమ్మ మానసిక ఆందోళన చెందుతోంది. దీంతో ఆమె ఈనెల 12వతేది కుమార్తె హేమలతకు క్రిమిసంహారక మందు తాగించి, తానూ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. 108 సిబ్బంది బాధితులను జిల్లా వైద్యశాలకు తరలించగా, పరీక్షించిన వైద్యులు మార్గమధ్యంలో హేమలత మృతిచెందినట్లు పేర్కొన్నారు. అనంతరం సరస్వతమ్మను బంధువులు మదనపల్లెలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో గురువారం రాత్రి రుయాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందారు. 

Updated Date - 2021-01-16T06:30:43+05:30 IST