సర్దుకోలేం..

ABN , First Publish Date - 2022-08-06T06:40:21+05:30 IST

సర్దుకోలేం..

సర్దుకోలేం..
హనుమకొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న వీఆర్‌వోలు (ఫైల్‌)

భగ్గుమంటున్న గ్రామ రెవెన్యూ అధికారులు

‘సర్దుబాటు’ విధానంపై తీవ్ర అసంతృప్తి

సర్వీస్‌ కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాలి..

పదోన్నతుల సంగతేమిటీ? 

లాటరీ పద్ధతి నియామకాలేమిటి?

డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాడతామని ప్రకటన


వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన తీరుపై గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌వో) తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికారుల ఒత్తిడితో విధిలేని పరిస్థితుల్లో తమకు కేటాయించిన శాఖలో వారు అన్యమనస్కంగానే విధుల్లో చేరారు. తమ సర్వీస్‌ కొనసాగింపు, పదోన్న తులు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు వివిధ రూపాల్లో  పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు. మరో పక్క వీఆర్‌వోల సర్దుబాటు వల్ల తమ ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు వస్తుందో నని కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆయా శాఖల్లోని ఉద్యోగులు కూడా వీఆర్‌వోల రాక వల్ల తమకు అన్యాయం జరుగుతుందని భయపడుతున్నారు.


హనుమకొండ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వీఆర్‌వోలందరినీ సోమవారం ఆయా జిల్లాల కలెక్టర్లు 38 ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. జీవో నెంబరు 121 ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రా పద్ధతి ద్వారా వీరిని వివిధ శాఖల్లోని ఖాళీల్లో సర్దుబాటు చేశారు. ఆ వెంటనే నియామక ఉత్తర్వులను జారీ చేశారు. అయితే సర్దుబాటు ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, లోపభూయిష్టంగా ఉందని వీఆర్‌వోలు నిరసిస్తున్నారు.


సర్వీస్‌పై అస్పష్టత

వీఆర్‌వోలు తమకు కేటాయించిన ఇతర శాఖలకు వెళ్లడానికి వ్యతిరేకించడం లేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విధుల్లో చేరడానికి సుముఖంగానే ఉన్నారు. అయితే ఈ సర్దుబాటువల్ల తమకు జరిగే అన్యాయం సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇతర శాఖలకు వెళ్లే తమకు సర్వీస్‌ కొనసాగింపు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడాన్ని వారు ప్రధానంగా ఎత్తిచూపుతున్నారు. కొత్త శాఖల్లో చేరిన తర్వాత తమ సీనియారిటీ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు కేటాయించిన శాఖల్లో అప్పటికే ఉన్న ఉద్యోగులతో కలిసి పని చేయాల్సి ఉన్నందువల్ల సర్వీస్‌ను యథావిధిగా కొనసాగిస్తారా? కొనసాగిస్తే ఏ ప్రాతిపదికన? అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


పదోన్నతులపై స్పష్టత కరువు

పదోన్నతుల విషయంలోనూ స్పష్టత లేదంటున్నారు. కొత్త శాఖలకు వెళ్లిన తర్వాత భవిష్యత్తులో పదోన్నతి కల్పించే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత, మార్గదర్శకాలూ లేవంటున్నారు. కొద్దినెలల్లో పదోన్నతి పొందాల్సిన తమను ఇతర శాఖల్లోకి బదిలీ చేసినందువల్ల ఆ శాఖలో పదోన్నతి రావడం దాదాపు అసాధ్యమని అంటున్నారు. 


లక్కీడిప్‌ సరికాదు

ఇతర శాఖల్లో తమను సర్దుబాటు చేయడానికి అనుసరించిన లాటరీ విధానాన్ని వీఆర్‌వోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ఉద్యోగులను మరోశాఖలో సర్దుబాటు చేసేప్పుడు వారి సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని, ఆ మేరకు శాఖలను కేటాయించాలని, కానీ లక్కీడిప్‌ను అనుసరించడం సర్వీస్‌రూల్స్‌కు విరుద్ధమని ఆక్షేపిస్తున్నారు. పైగా ఈ లాటరీ పద్ధతి కూడా వీఆర్‌వోల సమక్షంలో కాకుండా అధికారులే నిర్వహించడం దారుణం అంటున్నారు. కౌన్సెలింగ్‌ నిర్వహించడం ద్వారా నియామకాలు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. సర్దుబాటు జీవో 121ను వెంటనే రద్దు చేయాలని, లేదా పునఃసమీక్షించాలని కోరుతున్నారు.


చేర్చుకోవద్దు

ఒక పక్క వీఆర్‌వోలు సర్దుబాటు ప్రక్రియను వ్యతిరేకిస్తుంటే.. మరో పక్క సర్దుబాటులో భాగంగా కేటాయించిన వీఆర్‌వోలను చేర్చుకోవద్దని ఆయా శాఖల ఉద్యోగులు ఆందోళనలు మొదలు పెట్టారు. వారు వస్తే తమ పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందంటున్నారు. మహబూబాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయానికి ఐదుగురు వీఆర్‌వోలను కేటాయించారు. వారిని విధుల్లో చేర్చుకోవద్దని కోరుతూ మున్సిపల్‌ ఉద్యోగులు  మంగళవారం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఇతర జిల్లాల్లో కూడా ఆయా శాఖల ఉద్యోగులు వీఆర్‌వోల సర్వుబాటుకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.


నిరుద్యోగుకు షాక్‌

వీఆర్‌వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులను దిగ్ర్భాంతికి గురి చేసింది. గ్రూప్‌-4 పోస్టుల్లో భాగమైన వీఆర్‌వోలను జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో సర్దుబాటు చేయడంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇటీవల ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయడంతో గ్రూప్‌-4లోని పోస్టుల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులు నిరాశకు లోనయ్యారు. వీఆర్‌వోలను సర్దుబాటు చేయడం వల్ల గ్రూప్‌-4లో ఉన్న పోస్టులు గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉన్న పోస్టులు వీఆర్‌వోలతోనే సర్దుబాటు చేస్తే ఇక తమకు మిగిలేమిదని వాపోతున్నారు. వీరితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో చాలా ఏళ్లుగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై పని చేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్ల ఉద్యోగాలకు కూడా ఎసరువచ్చింది. వీఆర్‌వోల రాకతో తమను బయటకు ఎక్కడ సాగనపంపుతారోనని వారు కలవరపడుతున్నారు. తమ స్థానంలో వీఆర్‌వోలకు పోస్టింగ్‌ ఇస్తే ఇక తాము రోడ్డున పడ్డట్టేనని ఆందోళన చెందుతున్నారు.


జాబ్‌చార్టు లేకుండా..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 687 మంది వీఆర్‌వోలు ఉన్నారు. హనుమకొండ జిల్లాలో 148 మంది, వరంగల్‌లో 143 మంది, జనగామలో 121 మంది, మహబూబాబాద్‌లో 103 మంది, ములుగులో 79 మంది, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 93మంది ఉన్నారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా 2020 సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసింది. అప్పటినుంచి వీఆర్‌వోలు తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని ప్రతిపాదనలు తెస్తున్నారు. నాటినుంచి జాబ్‌చార్డు లేకుండానే కలెక్టరేట్‌, ఆర్టీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో విధులు నిర్వహస్తూ వచ్చారు. నిర్ధిష్టమైన విధులు లేక తమను ఖాళీగా ఉంచడంపై వీఆర్‌వోలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సాగించారు. ఎట్టకేలకు ప్రభుత్వం వీరిని వేరే శాఖల్లో సర్దుబాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కలెక్టర్లు వారికి వేరే శాఖను కేటాయించారు.

Updated Date - 2022-08-06T06:40:21+05:30 IST