సరిహద్దు ప్రాంతం.. ‘పుష్ప’ల విహారం!

ABN , First Publish Date - 2021-12-24T04:24:35+05:30 IST

జిల్లాలో 2.80 లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉండగా అందులో 25 వేల హెక్టార్లలో ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి.

సరిహద్దు ప్రాంతం..  ‘పుష్ప’ల విహారం!
అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న అటవీ శాఖ, పోలీసులు (ఫైల్‌)

జిల్లా అడవుల్లోకి తమిళ కూలీలు

విచ్చలవిడిగా ఎర్రచందనం చెట్ల నరికివేత

స్థానికుల సహకారం.. తెర వెనుక ఇంటిదుంగలు


ఎర్రచందనం రవాణాలో ‘పుష్ప’లకు పోటీపడుతున్నారు జిల్లాలోని కొందరు స్మగ్లర్లు. సులువుగా నగదు సంపాదించాలనే ఆలోచన, కొంతమంది వేసే ఉచ్చిలో పడి ఎంతోమంది ఆ మార్గంలోకి అడుగుపెడుతున్నారు. తమిళనాడుకు చెందిన కూలీలను జిల్లాకు రప్పించి, వారిని అడవుల్లోకి పంపి విలువైన ఎర్రచందనం వృక్ష సంపదను  కొల్లగొడుతున్నారు. టాస్క్‌ఫోర్స్‌, అటవీ, పోలీసు శాఖల అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఎర్రచందనం వృక్షాలను నరకడం, తరలించడం కూలీలు, స్మగర్లకు షరామామూలైపోయింది. 


ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 23 : జిల్లాలో 2.80 లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉండగా అందులో 25 వేల హెక్టార్లలో ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి రేంజ్‌లు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉండటంతో సులువుగా నగదు సంపాదించాలనే ఆలోచనతో పలువురు స్మగ్లర్లుగా మారుతున్నారు. అధికారుల కదలికలు ఎలా ఉన్నాయి? ఏ ప్రాంతంలో నిఘా తక్కువగా ఉంటుందని ముందుగానే గుర్తించి, విడతలవారీగా తమిళనాడుకు చెందిన కూలీలను అడవుల్లోకి పంపుతున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉండేది మేసీ్త్రలు, స్థానికులే. వారం నుంచి పది రోజులపాటు అడవుల్లోనే ఉంటూ చెట్లు నరుకుతారు. ఇందుకు అవసరమైన సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు రూ.లక్షల్లో నగదు ముట్టచెబుతారు.  గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం వృక్షాలను నరికించి, దుంగలను చెన్నై, బెంగళూరు మహా నగరాలకు, అక్కడ నుంచి విదేశాలకు తరలిస్తారు. 


పట్టుబడేది కూలీలే!


ఇటీవల ఉదయగిరి రేంజ్‌ పరిధిలోని కొత్తపల్లి, ఆర్లపడియ, దేవమ్మచెరువు, శకనాలపల్లి బీట్‌లలో స్థానికులతో కలిసి తమిళ కూలీలు ఎర్రచందనం దుంగలు నరికి తరలించే సమయంలో దుంగలతోపాటు కూలీలూ పట్టుబడ్డారు. అయినా మళ్లీ ఓ ప్రణాళికతో కూలీలు విడతల వారీగా అడవుల్లోకి ప్రవేశించి చెట్లు నరుకుతున్నారంటే వారి ధైర్యం అర్థమవుతోంది. స్మగ్లర్లకు కొంతమంది ఇంటిదొంగల సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. కూలీలను ఎవరైనా అడ్డుకోవడానికి చూస్తే ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడటం లేదు. అందుకే వీరిని పట్టుకోవడానికి సిబ్బంది కూడా జంకుతుంటారు. ఇటీవల దేవమ్మచెరువు అటవీ ప్రాంతంలో తమిళ కూలీలు పాగా వేశారన్న సమాచారంతో పోలీసు, అటవీ శాఖ అధికారులు రెండు రోజులపాటు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో ఎర్రచందనం దుంగలు లభించగా కూలీలు పలాయనం చిత్తగించారు. 


గట్టి చర్యలు చేపడుతున్నాం

ఎర్రచందనం రవాణా అడ్డుకట్టకు గట్టి చర్యలు చేపడుతున్నాం. టాస్క్‌ఫోర్స్‌, పోలీసు, అటవీ శాఖల ఆధ్వర్యంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాం. బేస్‌క్యాంప్‌, సై్ట్రకింగ్‌ఫోర్స్‌, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. ఇప్పటికే పలు రేంజ్‌లకు ఆయుధాలు అందజేశాం. సిబ్బందికి సైతం ఆయుధాలు అందజేసేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. 

- వైవీ షణ్ముగకుమార్‌, డీఎ్‌ఫవో

Updated Date - 2021-12-24T04:24:35+05:30 IST