ltrScrptTheme3

సర్పంచ్‌ పదవి కోసం వైసీపీలో అంతర్యుద్ధం

Oct 26 2021 @ 22:54PM
బింగినపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం

బింగినపల్లి ఉప ఎన్నికలో అధికార పార్టీలో ఇరువర్గాలు పోటీకి సన్నాహాలు

సై అంటున్న తెలుగు తమ్ముళ్లు

త్రిముఖ పోరు అనివార్యమేనా...

ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలు


సింగరాయకొండ, అక్టోబరు 26 : మండలంలోని బింగినపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవికి ఉపఎన్నిక అధికార పార్టీ వైసీపీలో అంతర్యుద్ధాన్ని నడిపిస్తోంది. గ్రామ వైసీపీలోని రెండు వర్గాల నాయకులు తమ కుటుంబీకులను పోటీలో దించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీరిద్దరూ పోటీ చేస్తే టీడీపీ తరఫున అభ్యర్థిని కూడా బరిలో దించేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహం పన్నుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత పంచాయతీ ఎన్నికల్లో బింగినపల్లి సర్పంచ్‌ జనరల్‌కు కేటాయించారు. గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్‌ నాయకుడు జెట్టి సుబ్బారెడ్డి బరిలో దిగారు. ఎన్నికల ముందు నుంచే ఆయన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఆయన టీడీపీ నాయకులను కూడా కలిసి సర్పంచ్‌ పదవి ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు. వివాదరహితుడు కావడం, ఆరోగ్యం బాగాలేకపోవడం, వయసు రీత్యా పెద్దవారు కావడంతో ఆయన అభ్యర్థనను టీడీపీ నేతలు అంగీకరించారు. దీంతో సుబ్బారెడ్డి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఏన్నుకున్నారు. అతని అనారోగ్య కారణాల దృష్ట్యా సుబ్బారెడ్డి కుమారుడు జానకరామిరెడ్డిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టకముందే సుబ్బారెడ్డి మృతి చెందాడు. ఉప సర్పంచ్‌గా ఉన్న ఆయన కుమారుడు సర్పంచ్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టారు. అలా ఆరునెలలు గడవడంతో అధికారులు ఉపఎన్నికను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. రేపోమాపో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన నాటి నుంచి వైసీపీలో రెండు వర్గాల మధ్య అధిపత్య పోరు తీవ్రంగా నడుస్తోంది. దివంగత సర్పంచ్‌ వర్గీయులు ఒక వర్గానికి, వైసీపీ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, ఎంపీటీసీ సభ్యుడు మరో వర్గానికి నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల ఊళ్లపాలెం హైస్కూల్లో జరిగిన పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల సందర్భంగా రెండు వర్గాల వారు బాహాబాహీకి దిగారు. కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ గొడవలపై కేసులూ నమోదయ్యాయి. ఈ ఘటనలో ఏ1గా ఇన్‌చార్జి సర్పంచ్‌ జానకిరామిరెడ్డి పేరు చేర్చారు. అప్పట్లో ఈ సంఘటన స్థానికంగా అధికార పార్టీలో అలజడిని సృష్టించింది. ఇదిలా ఉండగా, పంచాయతీ ఉప ఎన్నికలో ఇన్‌చార్జి సర్పంచ్‌ వ్యతిరేక వర్గీయుడైన మరో నాయకుడు తన సతీమణిని పోటీలో దించాలనే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పోటీ అనివార్యమైతే దివంగత సర్పంచ్‌ కుటుంబ సభ్యుల నుంచి ఎవరోఒకరు పోటీ చేయడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నారు. పార్టీ అధిష్టానం మద్దతు ఎవరికి ఇస్తుందోనని చర్చనడుస్తోంది.

పోటీ యోచనలో టీడీపీ

దివంగత సుబ్బారెడ్డి కుటుంబంలో ఎవరికైనా ఏకగ్రీవంగా సర్పంచ్‌ పదవిని ఇస్తే టీడీపీ తరఫున పోటీ నుంచి గౌరవంగా తప్పుకునే అవకాశాలున్నాయని సమాచారం. అలా కాకుండా వైసీపీలో ఇరు వర్గాల పోటీలో దిగితే తప్పనిసరిగా టీడీపీ తరఫున ఉప ఎన్నిక బరిలో అభ్యర్థిని నిలపడం ఖాయమనే తెలుస్తోంది.   మొత్తానికి బింగినపల్లిలో ఉపఎన్నిక రసకందాయంలో పడింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.