YSR Congressకు ఆయన రాజీనామా.. కన్నీటితో..!

ABN , First Publish Date - 2022-03-18T06:50:59+05:30 IST

YSR Congressకు ఆయన రాజీనామా.. కన్నీటితో..!

YSR Congressకు ఆయన రాజీనామా.. కన్నీటితో..!

  • ప్రతాప్‌కుమార్‌ రెడ్డి నిర్ణయంతో పార్టీలో కలకలం
  • తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న వైసీపీ శ్రేణులు

చిత్తూరు జిల్లా/కలికిరి, మార్చి 17: కలికిరి పంచాయతీ సర్పంచు రెడ్డివారి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ప్రతాప్‌కుమార్‌ రెడ్డి రాజీనామాకు సంబంధించిన సమాచారం కలికిరి మండలంతో పాటు పీలేరు నియోజకవర్గ వైసీపీలో కలకలం రేపుతోంది. పార్టీకి తాను చేస్తున్న రాజీనామాకు సంబంధించిన ప్రకటనతో పాటు దానికి సంబంధించి ఆయన విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అలజడి రేపుతోంది. కొంతకాలంగా వైసీపీతో ఆయనకు పొసగడం లేదు.గత ఏడాది జరిగిన సర్పంచు ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో అత్యధిక మెజారిటీ సాధించిన ఆరుగురిలో ఒకడిగా నిలిచి రికార్డు సృష్టించిన ప్రతాప్‌కుమార్‌ రెడ్డి ఉన్నపాటున ఆ పార్టీని వీడిపోవడం వైసీపీ కార్యకర్తల్ని హతాశుల్ని చేసింది.గత శనివారం నాటి మండల సమావేశంలో జరిగిన పరిణామాలు ఈ రాజీనామాకు దారి తీశాయి. కలికిరి మండలానికి సంబంధించి  40 ఏళ్ళుగా నల్లారి కుటుంబీకులను దీటుగా ఎదుర్కొంటూ ప్రస్తుత ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డికి వెన్నుదన్నుగా నిలబడిన ప్రతాప్‌కుమార్‌ రెడ్డి చివరికి చింతల వ్యవహారాల కారణంగానే పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడం విశేషం.


కన్నీటితో ఎమోజీలు..!

రాజీనామాకు సంబంధించిన ప్రకటన వెలువడగానే సామాజికమాధ్యమాల్లో స్పందనలు వెల్లువెత్తాయి. ‘కన్నీటి’ ఎమోజీలను పోస్టు చేయడం ద్వారా ఆయన పట్ల వైసీపీ కార్యకర్తల్లో పెల్లుబుకుతున్న సానుభూతిని వెల్లడించారు. గత ఆగస్టులో జరిగిన ఎంపీపీ ఎన్నిక నాటి నుంచి ఆయన వైసీసీ నాయకులపైన బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడల కారణంగానే తాను పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రతాప్‌ ప్రకటించారు. చింతల రామచంద్రా రెడ్డి టీడీపీలో వున్నా, ప్రజారాజ్యంలో వున్నా, అనంతరం వైసీపీలో చేరినా ఆయన్ను భుజాలకెత్తుకుని మోశామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా బలమైన నల్లారి కుటుంబాన్ని ఎదుర్కోవడంలో ఆర్థికంగా చితికిపోయామన్నారు.


అసలేం జరిగింది..!?

వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చి ఎమ్మెల్యే పరువు నిలబెట్టానని గుర్తు చేశారు. గత 40 ఏళ్లలో చింతల అధికారంలో వున్నప్పుడు  తాను ఏ పదవినీ ఆశించకుండా ఆయన కోసం సర్వస్వం వొడ్డి పోరాడానని చెప్పుకొచ్చారు. ఆయన్నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా తన స్వశక్తితో సర్పంచుగా ఎన్నికయ్యానని, ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యే నుంచి ఆర్థిక సహకారం ఆశించలేదని పేర్కొన్నారు. మెజారిటీ ఎంపీటీసీలను గెలిపించుకుని నల్లారి కుటుంబం నుంచి మొట్టమొదటి సారిగా ఎంపీపీ పదవిని కైవసం చేసుకునే దశలో ఎమ్మెల్యే తాను ఊహించని విధంగా ఎంపీపీని ఎన్నిక చేశారని ఆరోపించారు. కనీసం తనను సంప్రదించలేదని వివరించారు. నల్లారి కుటుంబీకులు ముఖ్యమంత్రిగా వున్నా తనపై పోలీసులు ప్రతాపం చూపించలేదని, కానీ సొంత పార్టీ వారే మండల సమావేశం నుంచి తనను పోలీసుల చేత గెంటించారని ఆరోపించారు. ఎమ్మెల్యే పీఏ ఆనంద రెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో కూచుని నిబంధనలకు విరుద్ధంగా పోలీసులను తన పైకి ఉసిగొలిపారని తెలిపారు. ఇంతకన్నా అవమానకరమైన సంఘటన తన జీవితంలో చూడలేదని చెప్పారు. ఇక పార్టీలో కొనసాగడానికి తన అనుచరులు అంగీకరించకపోవడంతో పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

Updated Date - 2022-03-18T06:50:59+05:30 IST