అయ్యో.. సర్వేయర్లు..

ABN , First Publish Date - 2021-03-01T05:32:26+05:30 IST

పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌ బి-పాస్‌ బిల్లు.. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు శాపంగా మారింది. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లతో పాటు వారి వద్ద పనిచేసే సహాయకులు ఉపాధి కరువై వీధిన పడనున్నారు. మునిసిపల్‌ శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ బి-పాస్‌ బిల్లు మంచిదే అయినా ఇళ్ల అనుమతుల దరఖాస్తుల దాఖలులో సర్వేయర్లకు భాగస్వామ్యం లేకుండా పోయింది. దీంతో వారు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దరఖాస్తుదారులు కూడా ఇబ్బందులు పడే అవకాశముంది.

అయ్యో.. సర్వేయర్లు..

రోడ్డున పడనున్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు
ఇళ్ల అనుమతులపై పరిమిత సేవలు
టీఎస్‌ బి-పా్‌సతో ప్రమేయం తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం
సంస్కరణల పేరుతో అన్యాయం చేసిందంటున్న సర్వేయర్లు
ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు


పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌ బి-పాస్‌ బిల్లు.. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు శాపంగా మారింది. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లతో పాటు వారి వద్ద పనిచేసే సహాయకులు ఉపాధి కరువై వీధిన పడనున్నారు. మునిసిపల్‌ శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ బి-పాస్‌ బిల్లు మంచిదే అయినా ఇళ్ల అనుమతుల దరఖాస్తుల దాఖలులో సర్వేయర్లకు భాగస్వామ్యం లేకుండా పోయింది. దీంతో వారు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దరఖాస్తుదారులు కూడా ఇబ్బందులు పడే అవకాశముంది.


హన్మకొండ (ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 500 మందికిపైగా సర్వేయర్లు ఉండగా, ఒక్క వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోనే 250 మంది పనిచేస్తున్నారు. గతంలో అన్ని ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల ద్వారా దాఖలయ్యేవి. పూర్తిచేసిన దరఖాస్తులకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను జత చేసి నిబంధనల ప్రకారం డీపీఎంఎస్‌ (డెవల్‌పమెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) సాఫ్ట్‌వేర్‌ ద్వారా యూజర్‌ ఐడీ పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్‌ అయి సమర్పించేవారు. షార్ట్‌ఫాల్‌ నోటీసులు రాకుండా, ఒకవేళ వచ్చినా మునిసిపాలిటీలు అడిగిన పత్రాలను ఆన్‌లైన్‌లోనే సమర్పించి గృహనిర్మాణ అనుమతులు సత్వరమే వచ్చేలా చూశారు. టీఎస్‌ బీ-పాస్‌ వల్ల ఇప్పుడా అవకాశం లేకుండా పోతోంది. 600 గజాల విస్తీర్ణం మించితేనే సర్వేయర్లకు దరఖాస్తు దాఖలుకు అవకాశం కల్పించారు. దీంతో వారు ఉపాధిపరంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. 75 నుంచి 600 గజాల ఇళ్లు నిర్మించుకునే పేద, మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటారు. దరఖాస్తుల దాఖలుకు సర్వేయర్ల వద్దకు ఎక్కువ సంఖ్యలో వచ్చేది వీరే. 600 గజాల కన్నా మించిన స్థలాల్లో నిర్మాణమయ్యే ఇళ్లు 5 నుంచి 10 శాతం మించి ఉండవు. దరఖాస్తుల దాఖలుకు ఎక్కువ మంది రాక తమకు పనిలేకుండా పోతుందని లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు వాపోతున్నారు.

ఇబ్బందులు
టీఎస్‌ బి-పా్‌సతో 76 నుంచి 500 గజాలకు ఇళ్ల అనుమతికి ప్లాన్‌ అవసరం లేదు. అప్పటికప్పుడు అనుమతి ఇస్తారు. ఆ తర్వాత పోస్టు వెరిఫికేషన్‌ చేస్తారు. పరిశీలనలో దరఖాస్తుదారుడు ఇంటి నిర్మాణంలో డీవియేషన్‌ పాటించలేదని, నిర్మాణం యుఎల్‌బీ మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా ఉందని, బఫర్‌ జోన్‌లో నిర్మాణం జరిగిందని తేలితే నోటీసు ఇవ్వకుండానే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తారు. 25రెట్లు జరిమానా విధిస్తారు. కేసు కూడా పెడతారు. మునిసిపల్‌ చట్టాలు, నిబంధనల గురించి సామాన్యులకు అంతగా అవగాహన ఉండదు. మిడిమిడి జ్ఞానంతో టీఎస్‌ బీపాస్‌ కింద స్వీయదరఖాస్తు దాఖలు చేసిన వెంటనే అనుమతి లభించి ఇల్లు కట్టుకున్న తర్వాత పోస్టు వెరిఫికేషన్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తేలితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.గతంలో మాదిరిగా డీపీఎంఎ్‌సలో  లైసెన్సుడ్‌ సర్వేయర్‌ ద్వారా దరఖాస్తు దాఖలు చేయిస్తే ఇబ్బందులు తలెత్తవు.

ఉద్దేశం మంచిదే అయినా..

టీఎస్‌ ఐ-పాస్‌ తరహాలోనే టీఎస్‌ బి-పాస్‌ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా సర్వేయర్ల ప్రమేయం లేకుండా అమలు ఎంత వరకు సాధ్యమవుతుందన్న సందేహం కూడా తలెత్తుతోంది. జీహెచ్‌ఎంసీ మినహా అన్ని మునిసిపాలిటీలు తెలంగాణ మునిసిపల్‌ చట్టం-2019 పరిధిలోకి వస్తాయి. అయితే భవన నిర్మాణ అనుమతుల విషయంలో జీహెచ్‌ఎంసీసహా అన్ని పురపాలక సంఘాలకు వర్తించేలా ఒక పాలసీ ఉండాలని ప్రభుత్వం భావించింది. దాని ఫలితమే టీఎస్‌ బి-పాస్‌. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ లేదా మీ సేవ, పౌరసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అనుమతుల్లో పారదర్శకత నెలకొల్పడం, నిర్ణీత సమయం విధించడం, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, నిర్మాణదారుకు మధ్య వ్యక్తిగత ప్రమేయం తగ్గించడం ఈ బిల్లు లక్ష్యం.

మమ్మల్ని రోడ్డు పాలు చేయొద్దు..
- జి.రఘు, అధ్యక్షుడు, లైసెన్సుడ్‌ టెక్నికల్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌

టీఎస్‌ బి-పా్‌సలో ఎల్‌టీపీల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 6వేల మంది లైసెన్సుడ్‌ సర్వేయర్లు ఉపాధి కోల్పోయి రోడ్డు పడతారు. లైసెన్సుడ్‌ సర్వేయర్లలో చాలామంది పట్టభద్రులు ఉన్నారు. భూసర్వేను వృత్తిగా చేసుకొని ప్రభుత్వం నుంచి పొందిన లైసెన్సు ద్వారా సర్వేయర్‌గా ఉపాధి పొందుతున్నారు. సంస్కరణల పేరుతో వారి పొట్టకొట్టడం అన్యాయం. పేద, మధ్య తరగతివారికి బిల్డింగ్‌ నిబంధనలు-168, నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌, మాండేటరీ సెట్‌ బ్యాక్స్‌ గురించిన అవగాహన ఉండదు. కనుక లైసెన్సుడ్‌ సర్వేయర్ల భాగస్వామ్యం అవసరం తప్పనిసరి.

సర్కారుపై ఒత్తిడి తీసుకురండి
తీన్మార్‌ మల్లన్నకు సర్వేయర్ల వినతి

లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్స్‌(ఎల్‌పీటీ) ఆదివారం హన్మకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లను కలిసి వినతిపత్రం అందజేశారు. టీఎస్‌ బీపా్‌సతో లైసెన్సుడ్‌ సర్వేయర్లు ఉపాధి కోల్పోయే దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. టీఎస్‌ బీపా్‌సలో వారి భాగస్వామ్యాన్ని కొనసాగించేట్టు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ విషయమై ప్రభుత్వంతో పోరాడుతానని మల్లన్న హామీ ఇచ్చారు.

Updated Date - 2021-03-01T05:32:26+05:30 IST