శశికళకు ఏమైంది?

ABN , First Publish Date - 2021-01-22T13:14:55+05:30 IST

అక్రమాస్తుల కేసుకు సంబంధించి పరస్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వస్తున్న వార్తలు ఆమె అభిమానులు...

శశికళకు ఏమైంది?

కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన

చిన్నమ్మ ఆరోగ్యంపై ఉత్కంఠ

ఆమె క్షేమం : దినకరన్‌


చెన్నై, (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసుకు సంబంధించి పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వస్తున్న వార్తలు ఆమె అభిమానులు, కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన శశికళ.. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఐసీయూలో చేరారు. దాంతో ఆమె ఆరోగ్యపరిస్థితి ఎలా వుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈనెల 27వ తేదీన జైలు నుంచి విడుదలై చెన్నై రావాల్సిన శశికళ.. ఈలోపే అస్వస్థతకు గురవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2017లో జైలుకు వెళ్లిన శశికళ.. కోర్టు చెప్పిన మేరకు జరిమానా చెల్లించడం, సత్ప్రవర్తన తదితరాల కారణంగా అనుకున్న సమయం కన్నా ముందే జైలు నుంచి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ నెల 27వ తేదీన ఆమె విడుదల కావడం ఖాయమైంది. ఆమెకు స్వాగతం పలికేందుకు ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ అధినేత టీటీవీ దినకరన్‌, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వెయ్యి వాహనాలతో ఏర్పాట్లు చేపట్టారు. అన్నీ సవ్యంగా సాగుతున్నాయను కుంటున్న తరుణంలో శశికళ హఠాత్తుగా అనారోగ్యానికి గురవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. 


అసలేమైంది?

పరప్పణ అగ్రహారం జైలులో వుంటున్న శశికళ గత వారం రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. ఎప్పుడూ లేనంతగా నలతగా కనిపించారు. దీంతో జైలు వైద్యులే ఆమెకు వైద్యం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దాంతో జైలు ప్రాంగణంలోనే వున్న ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమెను బెంగుళూరు శివాజీ నగర్‌లో వున్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంబులెన్సు నుంచి వీల్‌చైర్‌పైనే శశికళ ఆస్పత్రిలోకి వెళ్లారు. తొలిగా ఆమెకు కరోనా వైద్య పరీక్షలతో పాటు బీపీ, మధుమేహం, ఆక్సిజన్‌ లెవల్స్‌ తదితర పరీక్షలు నిర్వహించారు. బీపీ, మధుమేహం నియంత్రణలోనే వున్నప్పటికీ ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువగా వున్నట్టు తేలడంతో సాధారణ వార్డుకు తరలించి, ఆక్సిజన్‌ అందించారు. కానీ జ్వరం పెరుగుతూనే వచ్చింది. ఇదిలా వుండగా గురువారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో మళ్లీ శశికళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె పరిస్థితి కాస్త ఆందోళనకరంగా కనిపించడంతో వైద్యులు వెంటనే ఐసీయూకి తరలించారు. అక్కడ ఆర్‌టీపీసీఆర్‌ సహా వివిధ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె కోలు కుంటున్నారని, ఆక్సిజన్‌ లెవల్స్‌ కూడా పెరిగాయని జైలు సిబ్బంది తెలిపారు. అయితే జనరల్‌ వార్డులో తగిన సదుపాయాలు లేకపోవడంతోనే శశికళను ఐసీయూకి తరలిం చాల్సి వచ్చిందని, ఆమె పరిస్థితి మెరు గ్గానే వుందని జైలు వర్గాలు వివరించాయి. 


శశికళ క్షేమం : దినకరన్‌

శశికళ ఆరోగ్యం పట్ల ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, ఆమె క్షేమంగానే వున్నట్టు తనకు సమా చారం వుందని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ పేర్కొన్నారు. శశికళ అస్వస్థతకు గురైనట్టు తెలుసుకున్న దినకరన్‌ బుధవారం సాయంత్రమే బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. కానీ గురువారం ఉదయం వరకూ ఆయన్ని శశికళ వద్దకు అనుమతించలేదు. ఆమెను కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో అధికారులతో మాట్లాడిన దినకరన్‌.. శశికళ యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శశికళకు కరోనా లేదని వైద్యులు నిర్ధారించారని తెలిపారు. శశికళ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని జైలు సిబ్బంది చెప్పారని, ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే వుందని తెలిపారు. అవసరమైతే మెరుగైన ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తామన్నారు. శశికళను కలుసుకున్న తరువాతే తాను పూర్తి వివరాలు వెల్లడించగలనని దినకరన్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-01-22T13:14:55+05:30 IST