శశికళకు కరోనా పాజిటివ్‌..

ABN , First Publish Date - 2021-01-22T14:51:35+05:30 IST

బెంగళూరు: అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది.

శశికళకు కరోనా పాజిటివ్‌..

బెంగళూరు: అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. బెంగళూరులోని సెంట్రల్‌ జైలులో ఉన్న ఆమె అస్వస్థతకు గురయ్యారు. కాగా.. ఆమెకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌గా తేలింది. జ్వరం, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో శశికళ ఇబ్బందులు పడుతున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ శిక్షను అనుభవిస్తున్నారు. జైలు నుంచి ఈ నెల 27న విడుదల కానున్నారు.


పరప్పన అగ్రహారం జైలులో వుంటున్న శశికళ గత వారం రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. ఎప్పుడూ లేనంతగా నలతగా కనిపించారు. దీంతో జైలు వైద్యులే ఆమెకు వైద్యం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దాంతో జైలు ప్రాంగణంలోనే వున్న ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమెను బెంగుళూరు శివాజీ నగర్‌లో వున్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంబులెన్సు నుంచి వీల్‌చైర్‌పైనే శశికళ ఆస్పత్రిలోకి వెళ్లారు. తొలిగా ఆమెకు కరోనా వైద్య పరీక్షలతో పాటు బీపీ, మధుమేహం, ఆక్సిజన్‌ లెవల్స్‌ తదితర పరీక్షలు నిర్వహించారు. బీపీ, మధుమేహం నియంత్రణలోనే వున్నప్పటికీ ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువగా వున్నట్టు తేలడంతో సాధారణ వార్డుకు తరలించి, ఆక్సిజన్‌ అందించారు. కానీ జ్వరం పెరుగుతూనే వచ్చింది. ఇదిలా వుండగా గురువారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో మళ్లీ శశికళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె పరిస్థితి కాస్త ఆందోళనకరంగా కనిపించడంతో వైద్యులు వెంటనే ఐసీయూకి తరలించారు. అక్కడ ఆర్‌టీపీసీఆర్‌ సహా వివిధ పరీక్షలు నిర్వహించారు. 

Updated Date - 2021-01-22T14:51:35+05:30 IST