సత్యదేవుడికి జన్మనక్షత్ర పూజలు..

ABN , First Publish Date - 2021-11-28T06:31:02+05:30 IST

రత్నగిరివాసుడైన సత్యదేవుడి జన్మనక్షత్రం మఖ సందర్భంగా శనివారం పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.

సత్యదేవుడికి జన్మనక్షత్ర పూజలు..
రత్నగిరి కొండపై సత్యదీక్షల విరమణ అనంతరం గిరిజన మహిళల నృత్యాలు

పంచామృతాభిషేకాలు

ఇరుముడి సమర్పించి దీక్షలు విరమించిన దీక్షాపరులు

 దీక్షావిరమణ చేసిన వారికి ఉచితంగా వ్రతాలు, అన్నప్రసాదాలు

నిజరూప దర్శనంతో తన్మయత్వం పొందిన సామాన్య భక్తులు

అన్నవరం, నవంబరు 27: రత్నగిరివాసుడైన సత్యదేవుడి జన్మనక్షత్రం మఖ సందర్భంగా శనివారం పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. వేకువజాము ఒంటి గంటకు స్వామి, అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపి అభ్యంగన స్నానమాచరింపజేశారు. అనంతరం పంచామృతాభిషేకాలు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ప్రధానార్చకుడు కోట శ్రీను ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా నూతన పట్టువస్త్రాలు, సుగంధభరిత పుష్పాలతో మూలవరులను అలంకరించారు. ఇటు సామాన్య భక్తులకు సైతం స్వామివారి అభిషేక సమయంలో నిజరూప దర్శన భాగ్యం కలగడంతో తన్మయత్వం చెందారు. ఉదయం పది గంటలకు యాగశాలలో ఆయుష్యహోమం నిర్వహించారు. 11 గంటల కు పూర్ణాహుతి నిర్వహించగా, చతుర్వేద పండితుల వేదాశీర్వచనాలనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక సత్యదీక్షల విరమణ సందర్భంగా 27 రోజులపాటు అత్యంత నియమనిష్ఠలతో దీక్ష చేపట్టిన దీక్షాపరులు శనివారం వేకువజాము నుంచే ఇరుముడులు ధరించి రత్నగిరికి చేరుకుని దీక్షలు విరమించారు. వందలాదిగా తరలివచ్చిన దీక్షాపరుల సత్యదేవ నామస్మరణతో రత్నగిరి మార్మోగింది. దీక్షలు విరమించిన భక్తులకు ఉచితంగా స్వామివారి వ్రతాలు చేయించి, అన్నప్రసాదాలు అందజేశారు. సుమారు వెయ్యి మంది గిరిజన భక్తులు రత్నగిరిపై ఇరుముడి సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గిరిజన నృత్యాలతో భక్తులను రంజింపజేశారు. ఈ సందర్భంగా గిరిజనులను దీక్షల వైపు ప్రోత్సహించిన పవనగిరి స్వామీజీని ఈవో త్రినాథరావు సత్కరించారు. కార్యక్రమంలో పీఆర్వో కొండలరావు పాల్గొన్నారు.

పోటెత్తిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రం సత్యదేవుడి సన్నిధి శనివారం అశేష భక్తజనంతో పోటెత్తింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒంటి గంట నుంచే వ్రతాలు, రెండు గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతించారు. శనివారం ఒక్కరోజే 5,335 వ్రతాలు జరగగా వివిధ విభాగాల ద్వారా సుమారు రూ.60 లక్షల ఆదా యం లభించింది. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఈవో త్రినాథరావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి పలు సూచనలిచ్చారు. స్వామివారి ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం భక్తులు క్యూలైన్‌లో వేచియున్నారు.

Updated Date - 2021-11-28T06:31:02+05:30 IST