జిల్లా ఆస్పత్రిలో సేవలపై ‘కాయకల్ప‘ బృందం సంతృప్తి

ABN , First Publish Date - 2021-02-27T05:30:00+05:30 IST

కాయకల్ప పీర్‌ అసెస్‌మెంట్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిని శనివారం నిర్మల్‌ ఆస్పత్రి అధికారులు సందర్శించారు.

జిల్లా ఆస్పత్రిలో సేవలపై ‘కాయకల్ప‘ బృందం సంతృప్తి
సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిని పరిశీలిస్తున్న కాయకల్ప బృందం సభ్యులు

సంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 27 : కాయకల్ప పీర్‌ అసెస్‌మెంట్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిని శనివారం నిర్మల్‌ ఆస్పత్రి అధికారులు సందర్శించారు. నిర్మల్‌ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌కృష్ణ, ఇన్‌చార్జి నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ శోభ, క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్‌ ధరమ్‌సింగ్‌, నర్సులు కృష్ణవేణి, వీణ, మినిస్టీరియల్‌ స్టాఫ్‌ సంపత్‌తో కూడిన బృందం ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ల్యాబ్‌, ఐసీయూ, ఓపీ, ఎంసీహెచ్‌లోని లేబర్‌రూమ్‌, ఆపరేషన్‌ థియేటర్‌, పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డు, పిల్లల వార్డులను పరిశీలించారు. బయోమెడికల్‌ మేనేజ్‌మెంట్‌, శానిటేషన్‌ తదితర అంశాలతో పాటు రోగులకు అందజేస్తున్న సేవలు, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత విషయంలో పాటిస్తున్న నిబంధనలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పీర్‌ అసెస్‌మెంట్‌లో భాగంగా నమోదు చేసిన అంశాలు, లోపాలను బృందం సభ్యులు రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదించనున్నారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సంగారెడ్డి, ఆర్‌ఎంవో మధుకర్‌, క్వాలిటీ మేనేజర్‌ రవి చింతల, నర్సింగ్‌ సూపరింటెండెంట్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:30:00+05:30 IST