సత్రం భూమిలో ప్రైవేటు పాగా

ABN , First Publish Date - 2021-10-27T06:39:05+05:30 IST

ఎకరాల కొద్దీ భూమిని అప్పనంగా వాడేసుకుంటుంటే దేవదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.

సత్రం భూమిలో ప్రైవేటు పాగా
దేవదాయ స్థలంలో నిర్వహిస్తున్న ఇసుక డిపో

దేవదాయ శాఖ స్థలంలో ఇసుక డిపో

లీజుకు తీసుకోకుండానే 2.95 ఎకరాలు వినియోగం

స్పందించిన అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎకరాల కొద్దీ భూమిని అప్పనంగా వాడేసుకుంటుంటే దేవదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఎక్కడైనా చిన్న గుడిసె వేస్తే...పది మందితో వెళ్లి పీకి పందిరేసే అధికారులు భీమిలి మండలం కుమ్మరిపాలెం భూమి విషయంలో మాత్రం నోరెత్తడం లేదు. ఇందులో మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. 

లంగర్‌ఖానా సత్రానికి కుమ్మరిపాలెం సర్వే నంబర్‌ 75/2లో 2.05 ఎకరాల భూమి ఉంది. అది దేవదాయ శాఖ భూమి అని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. కొద్దికాలం క్రితం ప్రభుత్వం అందులో ఇసుక డిపో ఏర్పాటుచేసింది. ఇసుక ప్రభుత్వమే విక్రయిస్తున్నందున దేవదాయ శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కొద్దికాలానికి ప్రభుత్వం ఇసుక డిపోలు మూసేసింది. ఆ తరువాత టెండర్‌ ప్రక్రియ ద్వారా ఇసుక విక్రయాలను గంపగుత్తగా జయప్రకాశ్‌ వెంచర్స్‌ అనే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టింది. ర్యాంపులు, డిపోల నిర్వహణ అంతా ఆ సంస్థే చూసుకోవాలి. అయితే సదరు సంస్థ కొద్దికాలం కుమ్మరిపాలెంలో ఇసుక డిపోను నడపలేదు. ఆ భూమి ఖాళీగా ఉంది. ఆ సమయంలో దేవదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని మళ్లీ బోర్డులు పెట్టాల్సి ఉంది. కానీ ఆ పనిచేయలేదు. తాజాగా అక్కడ ఇసుక విక్రయాలను జయప్రకాశ్‌ సంస్థ ప్రారంభించింది. అది తన సొంత స్థలం అన్నట్టుగా శ్రీకాకుళం నుంచి ఇసుక తెచ్చి, అక్కడ నిల్వ చేసి అమ్ముకుంటోంది. గతంలో ప్రభుత్వమే ఇసుక విక్రయించింది గనుక దేవదాయ శాఖకు రూపాయి లీజు రాలేదు. ఇప్పుడు ప్రైవేటు సంస్థ ఆ పని చేస్తున్నందున...వినియోగించుకుంటున్న భూమికి అక్కడి ధరల ప్రకారం లీజు చెల్లించాలి. దీనికి ఇరువర్గాల మధ్య ఒప్పందం జరగాలి. కానీ దేవదాయ శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. దీని వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయో తెలియడం లేదు.  


అది ఈఓ పరిధి

కాళింగిరి శాంతి, అసిస్టెంట్‌ కమిషనర్‌

అక్కడ ఇసుక డిపో నడుపుతున్న వ్యవహారం, లీజు గురించి దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతిని సంప్రతిస్తే అది లంగర్‌ ఖానా సత్రం ఈఓ పరిధిలోకి వస్తుందని, ఆయన్ను సంప్రతించాలని సూచించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి సూచన మేరకు లంగర్‌ఖానా సత్రం ఈఓ పీఎస్‌న్‌ మూర్తికి ఫోన్‌ చేస్తే ఆయన స్పందించలేదు.


Updated Date - 2021-10-27T06:39:05+05:30 IST