సత్తన్‌పెల్లి, సేవ్యానాయక్‌ తండా, గ్రామాల మధ్య ముదిరిన సరిహద్దు వివాదం

ABN , First Publish Date - 2022-05-14T06:52:58+05:30 IST

కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీకి పాత గ్రామ పంచాయతీకి మధ్యలో సరిహద్దులను గుర్తించే అంశంలో సత్తన్‌పెల్లి, సేవ్యానాయక్‌ తాండా ఇరు గ్రామాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు మరింత ముదురుతోంది.

సత్తన్‌పెల్లి, సేవ్యానాయక్‌   తండా, గ్రామాల మధ్య ముదిరిన సరిహద్దు వివాదం
సరిహద్దు విషయంలో సర్వే అధికారిని అడ్డుకుని వాగ్వాదానికి దిగిన ఇరుగ్రామాల నాయకులు

ఇరు గ్రామాల సరిహద్దుల ఏర్పాటు అంశంలో తలెత్తిన విభేదాలు 

సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారిని అడ్డుకున్న సత్తన్‌పెల్లి గ్రామస్థులు

ఇరు గ్రామాల నాయకుల వాగ్వాదం

ఖానాపూర్‌, మే 13 : కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీకి పాత గ్రామ పంచాయతీకి మధ్యలో సరిహద్దులను గుర్తించే అంశంలో సత్తన్‌పెల్లి, సేవ్యానాయక్‌ తాండా ఇరు గ్రామాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు మరింత ముదురుతోంది. శుక్రవారం ఆ రెండు గ్రామాల సరిహద్దులను నిర్ణయించేందుకు వచ్చిన రిటైర్డ్‌ సర్వేయర్‌ గంగాధర్‌ను సత్తన్‌పెల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఇరు గ్రామాల నాయకులు, ప్రజల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల్లోకెలితే.. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త గ్రామ పంచాయతీలలో బాగంగా నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం సత్తన్‌పెల్లి గ్రామం నుండి సేవ్యానాయక్‌ తాండా వేరయ్యింది. దీంతో అప్పటి నుండి ఇప్పటి వరకు తమ తమ గ్రామాల మధ్య సరైన సరిహద్దులను గుర్తించడంలో తరుచుగా ఇరు గ్రామాల మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో గత కొద్ది రోజుల క్రితం తమ గ్రామాల సరిహద్దులు చూపాలని సేవ్యానాయక్‌ తాండా గ్రామస్థులు నిర్మల్‌ ఏడీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సత్తన్‌పెల్లి, సేవ్యానాయక్‌ తాండా గ్రామాల మధ్య సరిహద్దులు ఏర్పాటు చేసి రెండు గ్రామాల మ్యాప్‌లను సిద్దం చేయాలని నిర్మల్‌ ఏడీ స్థానిక అధికారులను ఆదేశించారు. అందుకుగాను రి టైర్డ్‌ సర్వేయర్‌ గంగాధర్‌కు బాధ్యతలు అప్పగించారు. 

ఏడీ ఆదేశాలతో ఇరు గ్రామాల సర్వేనంబర్ల ఆదారంగా మ్యా ప్‌ను సిద్దం చేసిన గంగాధర్‌ సత్తన్‌పెల్లి, సేవ్యానాయక్‌ తాండా గ్రామాల సరిహద్దులను ఏర్పాటు చేసేందుకు శుక్రవారం గ్రామంలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేను సత్తన్‌పెల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో ప్రస్తుతం ఉన్న ఇళ్లు సైతం ఈ సర్వేలో సేవ్యానాయక్‌ తాండాకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. 

సదరు సర్వేయర్‌ ఉద్ధేశపూర్వకంగా మాకు నష్టం చేస్తున్నారంటూ అతనితో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదం కాస్త ఖానాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి చేరడంతో తహసిల్దార్‌ రాజ్‌మోహన్‌ తాత్కాలికంగా సర్వేను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు. రెండు గ్రామాల మధ్య సరిహద్దు వివాదం తలెత్తకుండా అధికారులు సరైన విధంగా ప్రణాళికలు సిద్దం చేయాలని ఖానాపూర్‌ ఎంపీపీ అబ్దుల్‌ మోయిద్‌ కోరారు. జిల్లా అధికార యంత్రాంగం ఈ అంశంపై దృష్టిసారించాలని ఆయన కోరారు.  

Read more