సత్యాగ్రహమేనా?

ABN , First Publish Date - 2022-06-15T07:43:24+05:30 IST

నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటివరకూ సుమారు 17గంటలపాటు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ప్రశ్నించింది. ఒకపక్కన తినడానికి తగినంత సమయం కూడా ఇవ్వకుండా...

సత్యాగ్రహమేనా?

నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటివరకూ సుమారు 17గంటలపాటు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ప్రశ్నించింది. ఒకపక్కన తినడానికి తగినంత సమయం కూడా ఇవ్వకుండా గంటలపాటు సాగుతున్న ఈ విచారణలో ఓపికగా జవాబులు ఇస్తూ, మరోపక్కన అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తల్లిని చూసుకుంటున్న యాభైరెండేళ్ళ రాహుల్ ఇటువంటి ఎన్ని పరీక్షలనైనా ఎదుర్కొనడానికి మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్‌కు సమీకరణశక్తి తక్కువనీ, ఆ పార్టీ నాయకుల్లో అధికులు విలేఖరుల సమావేశాల్లోనే వీరంగాలు వేస్తారు తప్ప, వీధిపోరాటాలు చేయరని ఓ ఆరోపణ. కానీ, సోమ, మంగళవారాల్లో ఆ పార్టీ నాయకులంతా చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా రోడ్లమీదకు వచ్చి సంఘటితంగా పోరాడటం ఆశ్చర్యం కలిగించకమానదు. 


ఇది నేరుగా సోనియా కుటుంబంతోనూ, పార్టీతోనూ ముడిపడిన వ్యవహారం కనుకనే కాంగ్రెస్ ఈ స్థాయిలో వీధిపోరాటాలతో విరుచుకుపడుతున్నమాట నిజం. ఆ పార్టీ ముఖ్యమంత్రులు, పార్లమెంటరీ పార్టీ నాయకులు, మాజీ కేంద్రమంత్రులతో సహా ఎవ్వరూ ఒళ్ళుదాచుకోకుండా పోరాటాలు చేశారు, దెబ్బలుతిన్నారు, అరెస్టులయ్యారు. ఈ మొత్తం నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ ఏకంగా ‘సత్యాగ్రహం’ అని నామకరణం చేసింది. ఒక మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ రాహుల్‌ను ప్రశ్నించడానికి పిలిచినంత మాత్రాన ఆయన పార్టీ యావత్తూ ఇలా రోడ్డునపడటమేమిటని కొందరు ఆశ్చర్యపోతున్నారు. అంతర్జాతీయంగా దేశాన్ని అప్రదిష్ఠపాల్జేసిన నుపుర్ శర్మ వ్యవహారంలో కానీ, నిరసనకారులపై యూపీ ప్రభుత్వం బుల్‌డోజర్లను ప్రయోగించిన విషయంలో కానీ బీజేపీని ఇరుకునపెట్టగలిగే ఇతరత్రా చాలా అవకాశాల్లో మాటల, ట్వీట్ల యుద్ధానికీ, నామమాత్రపు పోరాటానికి కాంగ్రెస్ పరిమితమైన మాటా నిజమే. కానీ, నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ కక్షలో భాగమనీ, ఈడీ ప్రయోగం అందులో భాగమేనని కాంగ్రెస్ వాదిస్తున్నది కనుక, నిరసన కార్యక్రమాలతో వీధిపోరాటాలతో ఆ దాడిని ఎదుర్కోవడం అర్థంలేనిదేమీ కాదు. స్వాతంత్ర్యపోరాటంతోనూ, నెహ్రూతోనూ, ఆయన కుటుంబంతోనూ ముడిపడిన ఈ పత్రికను లక్ష్యంగా చేసుకోవడం వెనుక బీజేపీకి చాలా దురుద్దేశాలున్నాయని కాంగ్రెస్ నాయకుల వాదన. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో సుబ్రహ్మణ్యస్వామి ఆరోపిస్తున్నదేమిటో దీనికి ప్రతిగా కాంగ్రెస్ వాదిస్తున్నదేమిటో తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను మోదీ ప్రభుత్వం అమ్మేస్తున్నప్పుడల్లా, ఎంతో విలువైన ఆస్తిని అస్మదీయులకు కారుచవుకగా కట్టబెట్టేశారని విపక్షాలు ఆ ఆస్తిపాస్తులకు సంబంధించి ఏవో లెక్కలు చూపుతూంటాయి. నేషనల్ హెరాల్డ్ లావాదేవీలో మనీ ప్రమేయమేలేనప్పుడు లాండరింగ్ ఎక్కడిదనీ, ఒక దాతృత్వసంస్థ దాని అనుబంధ సంస్థ మధ్య మూతబడిన పత్రికను పునరుద్ధరించడమే లక్ష్యంగా జరిగిన లావాదేవీ అక్రమమెలా అవుతుందనీ కాంగ్రెస్ అడుగుతోంది.


చాలాకాలంగా కాంగ్రెస్‌తో పోల్చితే దానినుంచి వేరుపడిన ముక్కలు బలమైన పోరాటాలతో బీజేపీని ఎదుర్కొంటున్నాయి. బీజేపీకి ఎదురొడ్డి పోరాడుతున్నదీ, దానిని నిలువరించేందుకు ప్రాణాలు ఫణంగా పెడుతున్నదీ తామేనని ప్రాంతీయపార్టీలు సగర్వంగా చెప్పుకుంటున్నాయి. ఇదంతా అంతిమంగా రాజకీయమనుగడకోసమే కావచ్చును కానీ, ప్రజాప్రయోజనాల పేరిట అవి బలమైనపోరాటాలే చేస్తున్నాయి. కాంగ్రెస్ ఈ పనిచేయలేకపోతున్నది, ప్రజల మనసులు గెలవలేక రాష్ట్రాలను కోల్పోతున్నది. మిత్రులనదగ్గవారు కూడా దానికి మిగలడం లేదని రాజ్యసభ ఎన్నికలు తేల్చేశాయి. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏం చేద్దాం అంటూ సోనియాకు పోటీగా మమత విపక్షనేతల సమావేశం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త ‘సత్యాగ్రహం’ దానికి కొత్తగా ఎంత ఊపునిస్తుందో చూడాలి.  రాజకీయపార్టీలు పరస్పరం పెట్టుకొనే కేసులు ఎప్పటికీ తేలకుండా సుదీర్ఘకాలం కొనసాగుతూంటే మధ్యలో ప్రజలు ఆ వేడి భరించక తప్పడం లేదు.

Updated Date - 2022-06-15T07:43:24+05:30 IST