Satyakumar: ముఖ్యమంత్రి కూడా సొంత ఊరికి వెళ్లలేని పరిస్థితి...

ABN , First Publish Date - 2022-09-30T20:46:07+05:30 IST

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో మూడు నెలల పొడిగించినట్లు బీజేపీ నేత సత్యకుమార్ తెలిపారు.

Satyakumar: ముఖ్యమంత్రి కూడా సొంత ఊరికి వెళ్లలేని పరిస్థితి...

గుంటూరు జిల్లా (Guntur Dist.): ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించినట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Satyakumar) తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆ బియ్యాన్ని ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, ఏపీకి 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందించామని, అందులో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అధికార పార్టీ నేతలు విదేశాలకు ఎగుమతి చేశారని ఆరోపించారు. శాసనసభ్యుల సమావేశం ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఆత్మస్తుతి, పరనిందకు పాల్పడ్డారని, గడపగడపకు వెళ్తున్న వారికి ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయన్నారు. సీఎం జగన్ కూడా సొంత ఊరికి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి పులివెందుల వస్తుంటే ప్రొద్దుటూరులో కూడా బారికేడ్లు పెట్టారని, ప్రజా వ్యతిరేకతపై ముఖ్యమంత్రి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పులివెందులలో కూడా జగన్‌కు 50 శాతం ప్రజలు మాత్రమే మద్దతు ఇస్తున్నట్లు పీకే టీం సర్వేలో వెల్లడైందని, కానీ ఆయన మాత్రం ఎమ్మెల్యేలపైన నెపం మోపేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.


గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ ఎన్నిసార్లు సమీక్ష చేసినా పనుల్లో పురోగతి లేదని సత్యకుమార్ విమర్శించారు. మూడున్నరేళ్లలో గృహ నిర్మాణానికి ముఖ్యమంత్రి చేసిందేంటి?.. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను ఎందుకు నిర్మించడం లేదు? కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో కూడా సమాధానం లేదని విమర్శించారు. గుంటూరులో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వటం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా పది శాతం కంటే ఎక్కువ ఇళ్లు నిర్మించలేదని ఆరోపించారు. పులివెందుల నియోజకవర్గంలో 21 వేల ఇళ్లు మంజూరైతే కేవలం 15 వందలు మాత్రమే నిర్మాణం చేశారన్నారు. ఈ క్రాప్ విషయంలో ప్రభుత్వ వైఖరితో రైతులు నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలోనూ విఫలమైందని సత్యకుమార్ విమర్శించారు.

Updated Date - 2022-09-30T20:46:07+05:30 IST