Satyapradasahu: 2.45 కోట్ల మంది ఓటర్లు ఆధార్‌తో అనుసంధానం

ABN , First Publish Date - 2022-09-18T13:24:58+05:30 IST

రాష్ట్రంలో 2.43 కోట్ల మంది ఓటరుకార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(Satyapradasahu)

Satyapradasahu: 2.45 కోట్ల మంది ఓటర్లు ఆధార్‌తో అనుసంధానం

                          - ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 17: రాష్ట్రంలో 2.43 కోట్ల మంది ఓటరుకార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(Satyapradasahu) తెలిపారు. సచివాలయంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులతో దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపుకార్డుతో ఆధార్‌ నెంబర్‌ అనుసంధాన ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో ఓటర్లకు దానిపై అవగాహన కల్పించేలా ప్రచారం చేపట్టామని తెలిపారు. ఇందుకోసం ఓటర్లు 6-బి ఫారం సమర్పించాల్సి ఉందన్నారు. అలాగే, పోలింగ్‌ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆధార్‌ నెంబర్లు సేకరిస్తుండగా, ప్రజలు ఎన్‌వీఎస్బీ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా ఆధార్‌ నెంబరు ఓటరు గుర్తింపు కార్డుతో అనుసంధానం చేయవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 40 శాతం మంది ఓటర్లు ఆధార్‌తో అనుసంధానం చేశారన్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలో 6 కోట్ల 21 లక్షల 72 వేల 922 మంది ఓటర్లుండగా, వారిలో 2.45 కోట్ల మంది తమ ఓటరు గుర్తింపుకార్డుతో ఆధార్‌(Aadhaar) జతచేశారని తెలిపారు. అరియలూరు జిల్లాలో అధికంగా 61.5 శాతం మంది అనుసంధానం చేసుకోగా, మిగిలిన జిల్లాల్లో కూడా 60 శాతం మేరకు పనులు జరిగాయన్నారు. ఓటర్ల జాబితాలో రెండు సార్లు నమోదుకావడం, చిరునామా మార్పు తదితరాలు ఈ ప్రక్రియ ద్వారా సరిచేసుకోవచ్చని సత్యప్రదసాహు తెలిపారు.

Updated Date - 2022-09-18T13:24:58+05:30 IST