మహిళల విషయంలో.. సౌదీ మరో సంచలన నిర్ణయం !

ABN , First Publish Date - 2021-02-24T00:10:23+05:30 IST

గల్ఫ్ దేశం సౌదీ అరేబియా మహిళ విషయంలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలను ఆర్మీలో చేరేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కింగ్‌డమ్ మహిళలు ఇకపై మిలిటరీ, సాయుధ దళాలలో జాయిన్ కావొచ్చని స్పష్టం చేసింది.

మహిళల విషయంలో.. సౌదీ మరో సంచలన నిర్ణయం !

రియాద్: గల్ఫ్ దేశం సౌదీ అరేబియా మహిళ విషయంలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలను ఆర్మీలో చేరేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కింగ్‌డమ్ మహిళలు ఇకపై మిలిటరీ, సాయుధ దళాలలో జాయిన్ కావొచ్చని స్పష్టం చేసింది. సౌదీ మహిళలు సౌదీ అరేబియన్ ఆర్మీ, రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్, రాయల్ సౌదీ నేవీ, రాయల్ సౌదీ స్ట్రాటజిక్ మిస్సైల్ ఫోర్స్, సాయుధ దళాల మెడికల్ సర్వీసెస్‌లో చేరొచ్చని తన ప్రకటనలో పేర్కొంది. కాగా, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్.. విజన్ 2030లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 


ఇక కింగ్ సల్మాన్.. విజన్ 2030లో భాగంగా సౌదీలో ఇప్పటికే పలు కీలక సంస్కరణలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా మహిళల విషయమై ఆయన శతాబ్దాలుగా ఉన్న నిబంధనలను మార్చారు. మహిళలకు డ్రైవింగ్‌కు అనుమతించడం, ఇంట్లో పురుషుల అనుమతి లేకుండా ఒంటరిగా ఒక చోటు నుంచి మరోచోటికి ప్రయాణించడం, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్‌లో పని చేసేందుకు వీలు కల్పించడం లాంటివి అమలు చేశారు. తాజాగా రక్షణ రంగంలో కూడా మహిళలకు అవకాశం కల్పిస్తూ సల్మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.


అయితే, సౌదీ 2019లోనే మహిళలకు ఆర్మీలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, అది కార్యారూపం దాల్చలేదు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు సౌదీ దీనిని అధికారికంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి ఆసక్తి ఉన్న సౌదీ మహిళలు మిలిటరీలో జాయిన్ కావడానికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని ఈ సందర్భంగా ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో ఆర్మీలో చేరే మహిళల అర్హతలపై కూడా కొన్ని సూచనలు చేసింది. వాటి వివరాలను పరిశీలిస్తే...

1. 21 నుంచి 40 ఏళ్ల వయసు 

2. 155 సెంటీమీటర్ల ఎత్తు

3. జాతీయ గుర్తింపు కార్డు

4. హై స్కూల్ ఎడ్యుకేషన్ 

5. సౌదీ పౌరుడు కాకుండా విదేశీయుడిని వివాహం చేసుకుని ఉండకూడదు.    

Updated Date - 2021-02-24T00:10:23+05:30 IST