Travel Ban దేశాల విషయంలో Saudi కీలక నిర్ణయం.. ఇకపై ఆయా దేశాలకు..

ABN , First Publish Date - 2021-10-05T14:00:56+05:30 IST

సౌదీ అరేబియా సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Travel Ban దేశాల విషయంలో Saudi కీలక నిర్ణయం.. ఇకపై ఆయా దేశాలకు..

రియాద్: సౌదీ అరేబియా సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ట్రావెల్ బ్యాన్ చేసిన భారత్ సహా 10 దేశాలకు దేశ పౌరులను వెళ్లేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మానవతాధృక్పథంతో సౌదీ పౌరులను ఆయా దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రయాణాలపై కొన్ని షరతులు విధించింది. ఆయా దేశాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు, అవయవదానం చేసేవారు, బంధువుల మృతిపై వెళ్లేవారికి మాత్రమే ఈ అవకాశం ఇచ్చినట్లు జనరల్ డైరెక్టర్ ఆఫ్ పాస్‌పోర్టు విభాగం పేర్కొంది. దీనికోసం మొదట డైరెక్టరేట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసింది. వెబ్‌సైట్‌లో టర్మ్ అండ్ కండిషన్స్‌ను పూర్తిగా చదివిన తర్వాతే ప్రయాణం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత మై సర్వీస్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాస్‌పోర్ట్ వివరాలు పొందుపరచాలి. అనంతరం తవసుల్ అప్షన్‌ను ఎంచుకుని దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది. ఇక సౌదీ ప్రస్తుతం పది దేశాలకు తమ పౌరులు ప్రయాణించకుండా నిషేధించింది. ఈ జాబితాలో భారత్‌తో పాటు ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్, ఇథియోపియా, వియత్నాం, ఆఫ్ఘానిస్తాన్, లెబనాన్ ఉన్నాయి. తాజాగా సౌదీ ఈ దేశాలకు అత్యవసరాలపై దేశపౌరులను వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఇదిలాఉంటే.. ఇటీవల సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వలసదారులకు కింగ్‌డమ్‌లోకి డైరెక్ట్ ఎంట్రీకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ట్రావెల్ బ్యాన్ ఉన్న దేశాల్లోని సౌదీ పౌరులు, దౌత్యవేత్తలు, హెల్త్ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు నేరుగా సౌదీ వెళ్లొచ్చు.    

Updated Date - 2021-10-05T14:00:56+05:30 IST