Blood money: సౌదీ అరేబియాలో కీలక పరిణామం.. ఇకపై చట్టం ముందు అందరూ సమానులే

ABN , First Publish Date - 2022-05-26T15:27:07+05:30 IST

దియా..! అరబ్బిలో దీని అర్థం నష్టపరిహారం. గల్ఫ్‌ దేశాల్లో రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా మరణాల విషయంలో బాధితులకు నష్ట పరిహారం చెల్లించేలా చట్టాలున్నాయి.

Blood money: సౌదీ అరేబియాలో కీలక పరిణామం.. ఇకపై చట్టం ముందు అందరూ సమానులే

మరణంలో అంతా సమానమే!

సౌదీలో నష్టపరిహార చట్టంలో సవరణలు

గతంలో ముస్లింలు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే.. రూ. 6 కోట్ల పరిహారం

అదే ముస్లిమేతరులకైతే రూ.4 లక్షలు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): దియా..! అరబ్బిలో దీని అర్థం నష్టపరిహారం. గల్ఫ్‌ దేశాల్లో రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా మరణాల విషయంలో బాధితులకు నష్ట పరిహారం చెల్లించేలా చట్టాలున్నాయి. ప్రమాదాలకు కారకులైన వారు క్షమాభిక్ష కింద ఆ మొత్తాలను చెల్లిస్తారు. అయితే.. సౌదీ అరేబియాలో ఈ నష్ట పరిహారాన్ని బాధితులందరికీ ఒకేలా నిర్ణయించరు. రోడ్డు ప్రమాదంలో ఓ ముస్లిం చనిపోతే.. మూడు లక్షల రియాళ్ల(సుమారు రూ.6 కోట్లు) దియా చెల్లించేలా అతని ప్రాణానికి ఖరీదు కడతారు. అదే ఒక ముస్లిమేతరుడు బాధితుడైతే.. దియా ప్రకారం అతడి ప్రాణం ఖరీదు కేవలం 20 వేల రియాళ్లు(సుమారు రూ.4 లక్షలు). సౌదీలో పనిచేసే జగిత్యాలకు చెందిన తొర్తి గంగ నర్సయ్య, అదే జిల్లాకు చెందిన ఖాజా మొహియుద్దీన్‌ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరణించగా.. వారి కుటుంబాలకు పైన పేర్కొన్నట్లుగా రూ.4 లక్షలు, రూ.6 కోట్ల చొప్పున దియా చెల్లించారు. మహిళల విషయంలో పరిహారాన్ని సగానికి తగ్గించి ఇస్తారు. అంటే.. ముస్లిం మహిళ చనిపోతే, ఆమె కుటుంబానికి సుమారు రూ.3 కోట్లు.. ముస్లిమేతర మహిళ అయితే రూ.2 లక్షలు చెల్లిస్తే.. మరణానికి కారకుడికి క్షమాభిక్ష దక్కుతుంది. ఈ వివక్షను రూపుమాపి, అందరికీ సమానమైన పరిహారం ఇచ్చేలా సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది.


మజ్లిస్-అష్-షురాలో నిర్ణయం

సౌదీలో కఠిన ఇస్లామిక్‌ నిబంధనలు అమలవుతాయి. అయితే.. ఇటీవలి కాలంలో సౌదీ కూడా కొన్ని విషయాల్లో మార్పులు చేసేలా విప్లవాత్మకచర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మజ్లిస్-అష్-షురా(పార్లమెంట్‌ తరహా సలహా మండలి)కు చెందిన ముగ్గురు సభ్యులు దియా విషయంలో వివక్షను రూపుమాపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సౌదీలో అమల్లో ఉన్న పౌర వ్యవహారాల చట్టంలోని దియాకు సంబంధించిన 138వ అధికరణకు సవరణలు చేశారు. ‘‘ఇక దియా విషయంలో ముస్లింలు, ముస్లిమేతరులు, స్తీ-పురుష విభేదాలు ఉండబోవు. అందరికీ ఒకే విధమైన నష్ట పరిహారం ఉంటుంది’’ అని మజ్లి్‌స-అ్‌ష-షురా పేర్కొన్నట్లు స్థానిక అరబ్బీ దినపత్రిక ఓకాజ్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. దియాను న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. పోలీసు నివేదికలను పరిశీలించాకే.. దియా మొత్తం ఎంత ఉండాలో నిర్ణయిస్తాయి. అంటే.. ప్రమాదంలో మరణించిన వారు ట్రాపిక్‌ నిబంధనలను ఉల్లంఘించారా? ప్రమాదానికి కారకుడిదే తప్పా? అనే కోణాలను పరిశీలిస్తాయి. అంటే.. సిగ్నల్‌ పడకుండా రోడ్డు దాటడం, రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్లడం వంటి కారణాలతో, స్వీయ తప్పిదాలతో ప్రమాదానికి గురైన వ్యక్తి కుటుంబాలకు తక్కువ మొత్తంలో దియాను ప్రతిపాదిస్తారు.

Updated Date - 2022-05-26T15:27:07+05:30 IST