Hajj: సౌదీ టూరిజం మినిస్ట్రీ కీలక ప్రకటన.. ఆ వీసాదారులకు హజ్‌కు నో ఛాన్స్!

ABN , First Publish Date - 2022-09-04T16:41:43+05:30 IST

సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వశాఖ (Saudi Arabia Ministry of Tourism) తాజాగా హజ్, ఉమ్రాల నేపథ్యంలో టూరిస్ట్ వీసాదారులకు (Tourist visa holders) సంబంధించి కీలక ప్రకటన చేసింది.

Hajj: సౌదీ టూరిజం మినిస్ట్రీ కీలక ప్రకటన.. ఆ వీసాదారులకు హజ్‌కు నో ఛాన్స్!

జెడ్డా: సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వశాఖ (Saudi Arabia Ministry of Tourism) తాజాగా హజ్, ఉమ్రాల నేపథ్యంలో టూరిస్ట్ వీసాదారులకు (Tourist visa holders) సంబంధించి కీలక ప్రకటన చేసింది. టూరిస్ట్ వీసాపై హజ్ (Hajj) లేదా ఉమ్రాను నిర్వహించడం కుదరదని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పర్యాటక వీసా నిబంధనలను సవరించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక కొత్త సవరణల ప్రకారం టూరిస్ట్ వీసాదారులు సౌదీలో ఉన్న సమయంలో నిబంధనలు, భద్రతా సూచనలను తప్పకుండా పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ధృవ పత్రాలను ఎల్లప్పుడూ తమవెంట పెట్టకోవాలని సూచించింది. జీసీసీ (GCC) రెసిడెన్సీని కలిగి ఉన్నవారు ఇ-టూరిస్ట్ వీసా (e-tourist visa) ద్వారా కింగ్‌డమ్‌లోకి ప్రవేశించవచ్చని వెల్లడించింది. అయితే, రెసిడెన్సీ అనుమతి అనేది కనీసం మూడు నెలల పాటు చెల్లుబాటయ్యేలా ఉండాలని తెలిపింది. ఇక గురువారం సౌదీ సర్కార్ జీసీసీ దేశాల నివాసితులకు ఈ-వీసా (e-visa) కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అలాగే బ్రిటన్, అమెరికా, ఈయూ నివాసితులు వీసా ఆన్ అరైవల్ (Visa on Arrival)కు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 


దీనికి సంబంధించిన మంత్రివర్గ ఉత్తర్వుపై ఆ దేశ పర్యాటక మంత్రి అహ్మద్ అల్ ఖతీబ్ సంతకం చేశారు. ఈ నిర్ణయం ద్వారా పర్యాటకులకు సౌదీ అరేబియాను వేగంగా, సులభంగా సందర్శించేందుకు వీలు కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. యూకే, యూఎస్ లేదా స్కెంజెన్ (Schengen) ఒప్పందంలోని దేశాలలో ఒకదాని నుండి చెల్లుబాటయ్యే వ్యాపార లేదా పర్యాటక వీసాను కలిగి ఉన్నవారు వీసా జారీ చేసిన దేశంలోకి ప్రవేశించడానికి కనీసం ఒక్కసారైనా ఉపయోగించినట్లయిత ఈ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఇక సౌదీలోకి ప్రవేశించే ముందు చాలా మంది సందర్శకులు తమ దేశ రాయబార కార్యాలయానికి వెళ్లాలనే షరతును కూడా మంత్రివర్గ ఉత్తర్వు ద్వారా తొలగించడం జరిగిందని తెలిపారు. ఇది ఆయా ప్రయణికుల ప్రయాణాన్ని మరింత సరళీకృతంగా మార్చిందని మంత్రి పేర్కొన్నారు. ఇంకా మంత్రి అహ్మద్ అల్ ఖతీబ్ మాట్లాడుతూ.. “సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడం అనేది పర్యాటక పరిశ్రమ భవిష్యత్తుకు ప్రధానమైంది. డిజిటల్ ఇన్నోవేషన్‌ను ఉపయోగించడం, ప్రయాణీకులకు ప్రయాణించడాన్ని సులభతరం చేయడం ద్వారా ప్రపంచంలోని అన్ని మూలల నుండి భారీ సంఖ్యలో సందర్శకులను సౌదీ ఆకర్షించడం ఖాయమని" అని మంత్రి చెప్పుకొచ్చారు. 



Updated Date - 2022-09-04T16:41:43+05:30 IST