Skyscrapers: భారీ జంట కట్టడాలకు రెడీ అయిన సౌదీ.. ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. మరో ప్రపంచ వింతగా నిలవడం ఖాయం!

ABN , First Publish Date - 2022-07-26T17:57:55+05:30 IST

స్కై స్క్రాపర్‌(ఆకాశ హర్మ్యాలు) మాదిరిగానే సైడ్‌వే స్కైస్క్రాపర్లను (Sideway Skyscraper) నిర్మించేందుకు సౌదీ అరేబియా(Saudi Arabia) రెడీ అవుతోంది.

Skyscrapers: భారీ జంట కట్టడాలకు రెడీ అయిన సౌదీ.. ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. మరో ప్రపంచ వింతగా నిలవడం ఖాయం!

రియాద్: స్కై స్క్రాపర్‌(ఆకాశ హర్మ్యాలు) మాదిరిగానే సైడ్‌వే స్కైస్క్రాపర్లను (Sideway Skyscraper) నిర్మించేందుకు సౌదీ అరేబియా(Saudi Arabia) రెడీ అవుతోంది. అది కూడా 120 కిమీల పొడవుతో రెండు సైడ్‌వే స్కైస్క్రాపర్లను నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాని మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ 'నియోమ్‌ సిటీ' (Neom City) పేరిట భారీ నగర నిర్మాణానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఒకటికాదు రెండుకాదు ఏకంగా 26,500 చదరపు కిలోమీటర్ల మేర ఈ నగర నిర్మాణం జరగనుంది. దీనిలో భాగంగానే తాజాగా 120 కిమీల పొడవైన రెండు సైడ్‌వే స్కైస్క్రాపర్లను నిర్మించాలని నిర్ణయించినట్లు సమాచారం. వాయవ్య సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రానికి (Red sea) చెందిన గల్ఫ్‌ ఆఫ్‌ అకాబా తీరం నుంచి ఎడారిలో ఉన్న కొండల మధ్య దాకా ఈ ప్రాజెక్టు విస్తరించనుంది.


ఇక ఈ రెండు భవనాలను పూర్తిగా అద్దాలతో అలంకరించనున్నారట. అందుకే దీనికి ‘మిర్రర్‌ లైన్‌’ అని పేరు పెట్టారు. అంతేగాక ఎత్తు విషయంలో కూడా వీటిని ప్రపంచంలోని ఇతర ఆకాశహర్మ్యాల స్థాయిలోనే నిర్మించనున్నారు. సుమారు అర కిలోమీటర్‌ ఎత్తు(490 మీటర్లు) వరకు ఈ భారీ కట్టడాలను నిర్మిస్తారట. న్యూయార్క్‌లోని (New York) 102 అంతస్తుల ప్రఖ్యాత ఎంపైర్‌ స్టేట్‌ భవనం ఎత్తు 443 మీటర్లకన్నా ఈ జంట భవనాల ఎత్తునే ఎక్కువ. ఇక ఈ కట్టడాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 120 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే ఈ సైడ్‌వే స్కైస్క్రాపర్లలో కట్టబోయే ఇళ్లలో ఏకంగా 50 లక్షల మంది వరకు నివసించవచ్చు. 


ఇక్కడ నివసించే వారికి అవసరమైన పంటలను కూడా ఇక్కడే పండిస్తారట. ఈ భవనాల ఒక చివరి నుంచి మరో చివరికి ప్రయాణించడానికి భూగర్భంలో హైస్పీడ్‌ రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే పాదచారుల కోసం వాక్‌ వేస్ ఇలా ఎన్నో హంగులు ఈ బాహుబలి కట్టడాల్లో ఉండనున్నాయి. ఇక భారీ ప్రాజెక్టు నిర్మాణానికి ఏకంగా రూ. 80 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. అలాగే ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి సుమారు 50 ఏళ్లు పడతుందట. ఇక ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తైతే కచ్చితంగా మరో ప్రపంచ వింత కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Updated Date - 2022-07-26T17:57:55+05:30 IST