పాకిస్థాన్ ముక్కు పిండి 1 బిలియన్ డాలర్లు వసూలు చేసిన సౌదీ అరేబియా

ABN , First Publish Date - 2020-08-08T20:32:26+05:30 IST

పాకిస్థాన్ నుంచి 1 బిలియన్ డాలర్లను సౌదీ అరేబియా పట్టుబట్టి వసూలు చేసింది.

పాకిస్థాన్ ముక్కు పిండి 1 బిలియన్ డాలర్లు వసూలు చేసిన సౌదీ అరేబియా

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ నుంచి 1 బిలియన్ డాలర్లను సౌదీ అరేబియా పట్టుబట్టి వసూలు చేసింది. ఈ పరిణామం పాకిస్థాన్‌కు ఇస్లామిక్ దేశాల నుంచి మద్దతు తగ్గుతోందనడానికి ఉదాహరణ. అత్యంత విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పాకిస్థాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, సౌదీ అరేబియా గతంలో ఇచ్చిన అప్పులో 1 బిలియన్ డాలర్లను పాకిస్థాన్ తీవ్ర నిర్బంధ పరిస్థితుల్లో తిరిగి చెల్లించింది. 


పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా ఏడాదిన్నర క్రితం 3 బిలియన్ డాలర్లు రుణం ఇచ్చింది. అంతర్జాతీయ రుణాల చెల్లింపు కోసం ఈ అప్పు తీసుకుంది. ఇదిలావుండగా, ఇస్లామిక్ దేశాలకు ఆర్థిక సహాయాన్ని తగ్గించాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. దీంతో రుణం తిరిగి చెల్లించాలని పాకిస్థాన్‌పై సౌదీ అరేబియా తీవ్ర ఒత్తిడి చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్థాన్ 1 బిలియన్ డాలర్లు తిరిగి చెల్లించింది. 


జమ్మూ-కశ్మీరు విషయంలో భారత్‌కు వ్యతిరేకంగా కలిసి రావాలని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కోరినప్పటికీ, సౌదీ అరేబియా, మాల్దీవులు పట్టించుకోలేదు. మాల్దీవులు మరో అడుగు ముందుకు వేసి, భారత దేశంలో ముస్లింలు శతాబ్దాల నుంచి ఉన్నారని, ప్రస్తుతం 14.2 శాతం మంది ముస్లింలు ఉన్నారని, దేశ జనాభాలో రెండో స్థానం ముస్లింలదేనని, అలాంటి భారత దేశంలో ఇస్లామోఫోబియా ఉందనడం ఎంతమాత్రం సరైనది కాదని తెలిపింది. 


ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు అండగా చైనా ముందుకు వచ్చింది. సౌదీ అరేబియా అండదండలు లేకపోవడం వల్ల ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవడానికి 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసింది. అందుకు బదులుగా చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవ (సీపీఈసీ)లో 6.8 బిలియన్ డాలర్ల అంచనాతో ప్రతిపాదించిన రైల్వే లైన్స్  ప్రాజెక్టుకు పాకిస్థాన్ ఆమోదం తెలిపింది. 


Updated Date - 2020-08-08T20:32:26+05:30 IST