అక్రమ విదేశీ కార్మికుల నియామకాలపై Saudi Arabia ఉక్కుపాదం.. ఇకపై..

ABN , First Publish Date - 2021-12-02T18:50:43+05:30 IST

చట్టవిరుద్ధంగా విదేశీ కార్మికులను నియమించుకునే సంస్థలు, వ్యాపారసముదాయాల యజమానులపై సౌదీ అరేబియా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

అక్రమ విదేశీ కార్మికుల నియామకాలపై Saudi Arabia ఉక్కుపాదం.. ఇకపై..

రియాద్: చట్టవిరుద్ధంగా విదేశీ కార్మికులను నియమించుకునే సంస్థలు, వ్యాపారసముదాయాల యజమానులపై సౌదీ అరేబియా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇకపై విదేశీ కార్మికుల రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్(జవాజత్) హెచ్చరించింది. కార్మిక, రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించే యజమానులను ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చింది. కార్మికుల నియామకాలలో నిబంధనలను ఉల్లంఘిస్తే 1లక్ష సౌదీ రియాల్(సుమారు రూ.20లక్షలు) జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష ఉంటుందని జవాజత్ వెల్లడించింది. అలాగే నేరం చేసినట్లు తేలిన కంపెనీలను ఐదేళ్ల పాటు విదేశీ కార్మికులను రిక్రూట్ చేసుకోకుండా బ్యాన్ చేస్తామని హెచ్చరించింది. 


అంతేగాక ఆయా కంపెనీల పేర్లను మీడియాలో కూడా ప్రచురించడం జరుగుతుందని తెలిపింది. దీంతోపాటు ఒకవేళ కంపెనీ యజమాని ప్రవాసుడైతే దేశం నుంచి బహిష్కరిస్తామని పేర్కొంది. అలాగే ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థలోని విదేశీ కార్మికుల సంఖ్యను బట్టి జరిమానా పెరుగుతుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రెసిడెన్సీ, కార్మిక, బార్డర్ సెక్యూరిటీ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి సమాచారాన్ని తెలియజేయాలని జవాజత్ కింగ్‌డమ్ ప్రజలను కోరింది. దీనికోసం మక్కా, రియాద్ ప్రాంతాల వారు 911 నంబర్‌కు కాల్ చేయాల్సిందిగా తెలిపింది. ఇతర ప్రాంతాలలోని వారు 999 నంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పింది.  

Updated Date - 2021-12-02T18:50:43+05:30 IST