అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభంపై సౌదీ కసరత్తు

ABN , First Publish Date - 2021-01-16T16:28:36+05:30 IST

అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభం కోసం సౌదీ అరేబియా కసరత్తు మొదలెట్టింది.

అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభంపై సౌదీ కసరత్తు

రియాద్: అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభం కోసం సౌదీ అరేబియా కసరత్తు మొదలెట్టింది. తాజాగా విమానయాన సంస్థలకు ఈ మేరకు కీలక సమాచారాన్ని అందించింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని త్వరలోనే ఎత్తివేయనున్నట్లు సౌదీ ఎయిర్ పోర్ట్స్ నుంచి విమాన సర్వీసులు నడిపించే విమాన కంపెనీలకు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్(జీఏసీఏ) నుంచి నోటిఫికేషన్స్ వెళ్లాయి. అలాగే సౌదీ పౌరులను మార్చి 31 నుంచి ఇతర దేశాలకు వెళ్లడానికి, వేరే దేశాల నుంచి తిరిగి రావాడానికి అనుమతించనున్నట్లు ఇటీవల జీఏసీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విమానయాన సంస్థలకు వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. కాగా, హోంశాఖ మాత్రం దేశ పౌరులను ప్రత్యేక అనుమతి లేనిదే లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మెనియా, సోమాలియా, కాంగో, ఆఫ్గనిస్థాన్, వెనెజులా, రష్యా దేశాలకు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది.   

Updated Date - 2021-01-16T16:28:36+05:30 IST