సౌదీ మహిళల హక్కుల గళం

ABN , First Publish Date - 2021-01-04T05:30:00+05:30 IST

లోజైన్‌ ఆల్‌-హథ్‌లాల్‌ పేరు వినగానే మహిళలు డ్రైవింగ్‌ చేయకూడదని సౌదీ అరేబియా ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వ్యతిరేకించినది ఆమే కదా అని అందరికీ వెంటనే గుర్తుకువస్తుంది.

సౌదీ మహిళల హక్కుల గళం

‘మహిళల హక్కులూ మానవహక్కులే’ అని   పురుషాధిపత్య వ్యవస్థ గల సౌదీ ప్రభుత్వంపై పోరాడుతున్నారు స్థానికంగా ‘అత్యాధునిక ఫెమినిస్ట్‌’గా పేరుతెచ్చుకున్న లోజైన్‌ ఆల్‌-హథ్‌లాల్‌. ఆమె రప్రజలను రెచ్చగొడుతోందనే నెపంతో జైలులో నిర్బంధించడం అన్యాయమని అంతర్జాతీయ సమాజం నిరసిస్తున్నా సౌదీ ప్రభుత్వం  మాత్రం ఆమెపై నిర్బంధపు కొరడాను మరోసారి ఝుళిపించింది. 


లోజైన్‌ ఆల్‌-హథ్‌లాల్‌ పేరు వినగానే మహిళలు డ్రైవింగ్‌ చేయకూడదని సౌదీ అరేబియా ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వ్యతిరేకించినది ఆమే కదా అని అందరికీ వెంటనే గుర్తుకువస్తుంది. పురుషాధిపత్య వ్యవస్థ గల సౌదీలో  మహిళల డ్రైవింగ్‌ హక్కు కోసం    ప్రభుత్వాన్ని ఎలుగెత్తి ప్రశ్నించినందుకు లోజైన్‌ ఎన్నోమార్లు అరెస్టయి విడుదలయ్యారు. ‘మహిళలు వాహనాలు నడపడం వారి హక్కు’ అని నినదించడమే కాదు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేలా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు లోజైన్‌. సౌదీ మహిళలు విదేశీ ప్రయాణాలు చేయడానికి  ఇంట్లోని మగపెద్ద అనుమతి తప్పనిసరి. ఈ విధమైన ఆంక్షలు అక్కడి మహిళలపై ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి.


లోజైన్‌ పోరాట ఫలితంగా అక్కడి మహిళలు గత ఏడాది ఆగస్టులో వాహనాలు నడిపే హక్కును పొందారు. స్వేచ్ఛగా విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు. ఇంట్లోని మగపెద్దల అంగీకారంతో పనిలేకుండా పాస్‌పోర్టులకు  దరఖాస్తు పెట్టుకుంటున్నారు. అంతేకాదు పెళ్లి, విడాకుల రద్దుల కోసం తమంతట తాముగా రిజిస్టర్‌ చేసుకుంటున్నారు. అయితే తమతో సమానంగా హక్కులు కావాలని మహిళలు ఉద్యమించడం సౌదీలోని పురుషాధిపత్య సమాజానికి మింగుడుపడలేదు. మగవాళ్ల ఆధిపత్యానికి ఈ పరిణామాలు అడ్డుకట్టవేస్తాయేమోనన్న భయం వారిని వెంటాడింది. 


లోజైన్‌కి యుఎఇలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంది. యుఎఈ నుంచి సౌదీ అరేబియాలో అడుగుపెట్టి వాహనం నడపడానికి ప్రయత్నించి నందుకుగాను ఆమెను అధికారులు 73 రోజుల పాటు నిర్బంధించారు. ఆమెతోపాటు ఎందరో మహిళా మానవహక్కుల కార్యకర్తలను కూడా సౌదీ ప్రభుత్వం అప్పుడు నిర్భంధించింది.  నేడు అక్కడి  మహిళలు వాహనాలను నడుపుతూ సౌదీ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే లోజైన్‌ స్ఫూర్తి అని చెప్పాలి. ఆమె పోరాటంతో 2018లో సౌదీ అరేబియా మహిళలు ఎట్టకేలకు ఆ హక్కును పొందగలిగారు. 




జైలులో వేధింపులు

‘మార్పు కావాలంటూ సౌదీ ప్రజలను లోజైన్‌ రెచ్చగొడుతోంది, విదేశీ ఎజెండాతో పనిచేస్తోంది. ఇంటర్నెట్‌ ద్వారా ప్రజాజీవితానికి భంగం కలిగిస్తోందని, మా దేశాన్ని అస్థిరపాలు చేయడానికి ప్రయత్నిస్తోంది’ అని ఆమెపై లేనిపోని ఆరోపణలు మోపి సౌదీ ప్రభుత్వం ఆమెను 2018లో జైలులో నిర్బంధించింది. కోర్టు ఆమెకు విధించిన 34 నెలల శిక్షను రద్దు చేస్తూ షరతులతో కూడిన విడుదలను అనుమతించింది. ఆ లెక్కప్రకారం లోజైన్‌  2020, మేలో జైలు నుంచి విడుదల కావాలి. కానీ అలా జరగలేదు.


ఈ కేసు విచారణ సమయంలో ముసుగు ధరించిన పురుషులు కొందరు తనను మానసికంగా, లైంగికంగా వేధించారని  లోజైన్‌ కోర్టుకు పలుసార్లు మొరబెట్టుకుంది కూడా.  తాజాగా సౌదీ స్పెషల్‌ క్రిమినల్‌ కోర్టు లోజైన్‌కు ‘తీవ్రవాద వ్యతిరేక చట్టం’ కింద ఐదు సంవత్సరాల ఎనిమిది నెలలు జైలు శిక్ష విధించింది. లోజైన్‌పై సౌదీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు సత్యదూరమని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవహక్కుల నిపుణులు వ్యాఖ్యానించారు. వెంటనే లోజైన్‌ని విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు. ఆమె నిర్భంధకాలాన్ని ఐదు సంవత్సరాలకు పైగా పెంచడంపై అంతర్జాతీయంగా నిరసన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మానవహక్కుల బృందాలు ఆమెను వెంటనే విడుదల చేయమని డిమాండ్‌ చేస్తున్నాయి. 


2015 ఎన్నికల్లో ...

సౌదీలోని మహిళలు ఓటు  హక్కు రావడం వెనుక ఆమె పోరాటం ఉంది. 2015లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన తొలి మహిళగా లోజైన్‌ వార్తల్లో నిలిచారు. ఆ ఎన్నికల సమయంలోనే మొట్టమొదటసారిగా సౌదీ మహిళలకు ఎన్నికల్లో ఓటువేసే హక్కు లభించింది. అంతేకాదు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కూడా అప్పుడే వారికి దక్కింది.  

‘నిర్బంధంలో ఆమెకు ఎలక్ట్రిక్‌ షాకులిచ్చి హింసించారు. లైంగికంగా వేధించారు. నిర్బంధ కాలంలో అత్యాచారం చేస్తామంటూ, చంపేస్తామంటూ ఆమెని బెదిరించార’ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పేర్కొంది కూడా. ‘‘నా సోదరి తీవ్రవాది కాదు. ఉగ్రవాది కాదు. ఉద్యమకారిణి. సౌదీలోని పరిస్థితులపై తనకు సంపూర్ణ అవగాహన ఉంది, ఇక్కడి వ్యవస్థను ఎదిరిస్తే ఎదురయ్యే సవాళ్లు కూడా ఆమెకు  తెలుసు. అయినా  ధైర్యంగా నా సోదరి ముందుకు అడుగువేసిది. ప్రభుత్వం తనను జైలులో నిర్భందించి అశక్తురాలిని చేయాలని చూస్తోంది’’ అంటోంది లోజైన్‌ సోదరి లీనా.

జైలులో తనను హింసించలేదని, లైంగికంగా వేధించలేదని చెబితే లోజైన్‌ను విడుదల చేస్తామని సౌదీ ప్రభుత్వం బెదిరిస్తున్నదని లోజైన్‌ కుటుంబసభ్యులు చెబుతున్నారు. 



ఒక మహిళగా తన హక్కుల కోసం, సాటి మహిళల సాధికారత కోసం పోరాడుతున్న లోజైన్‌ను శిక్షించడం అన్యాయమని, సౌదీలో మార్పును తీసుకువచ్చే సంస్కరణల కోసం సౌదీ ప్రజలకు ఆమె పోరాటం స్ఫూర్తిగా నిలిస్తోందని పలువురు అంటున్నారు.

మహిళల హక్కులూ మానవహక్కులే. వాటి కోసం పోరాడడమే లోజైన్‌ ఆల్‌-హథ్‌లోల్‌ చేసిన తప్పా? అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. సౌదీలోని ‘అత్యాధునిక ఫెమినిస్టు’గా అక్కడి మహిళలకు నాయకురాలిగా మార్గనిర్దేశం చేస్తున్నారు లోజైన్‌.


సౌదీలోని మహిళలకు ఓటు  హక్కు రావడం వెనుక లోజైన్‌ పోరాటం ఉంది. 2015లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన తొలి మహిళగా లోజైన్‌ వార్తల్లో నిలిచారు. ఆ ఎన్నికల సమయంలోనే మొట్టమొదటసారిగా సౌదీ మహిళలకు ఎన్నికల్లో ఓటువేసే హక్కు లభించింది. అంతేకాదు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కూడా అప్పుడే వారికి దక్కింది.  


Updated Date - 2021-01-04T05:30:00+05:30 IST